Punjab vs Rajasthan: ఉత్కంఠ పోరు.. పంజాబ్‌పై రాజస్థాన్‌ విజయం

ఐపీఎల్‌-17లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 13 Apr 2024 23:38 IST

ముల్లాన్‌పుర్‌: ఐపీఎల్‌-17 సీజన్‌లో రాజస్థాన్‌ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ మోస్తరు లక్ష్యాన్ని రాజస్థాన్‌ 7 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. యశస్వి జైస్వాల్ (39), తనుష్ కొటియన్ (24), రియాన్‌ పరాగ్ (23) పరుగులు చేశారు. చివర్లో కాస్త ఉత్కంఠ ఏర్పడిన హెట్‌మయర్ (27*; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించి జట్టును గెలిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో కగిసో రబాడ 2, సామ్‌ కరన్ 2, లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్‌ సింగ్, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను రాజస్థాన్‌ తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. టాపార్డర్ బ్యాటర్లు అథర్వ తైడే (15), జానీ బెయిర్‌స్టో (15), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (10), సామ్‌కరన్‌ (6) ఘోరంగా విఫలమయ్యారు. 52 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను జితేశ్ శర్మ (29), లివింగ్‌స్టోన్‌ (21) ఆదుకున్నారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన అశుతోష్ శర్మ (31; 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో పంజాబ్‌ పోరాడే స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 2, కేశవ్ మహరాజ్‌ 2, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్‌ సేన్, యుజ్వేంద్ర చాహల్‌కు ఒక్కో వికెట్ దక్కింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని