Rafael Nadal: ఎర్రకోటలో ఆఖరి ఆట!

ఆ దూకుడు, ఆ పవర్, ఆ ఉత్సాహం.. ఎర్రకోటలో అతడికి తిరుగేలేదు. విజయాల మీద విజయాలు.. టైటిళ్ల మీద టైటిళ్లు.

Published : 28 May 2024 03:05 IST

ఆ దూకుడు, ఆ పవర్, ఆ ఉత్సాహం.. ఎర్రకోటలో అతడికి తిరుగేలేదు. విజయాల మీద విజయాలు.. టైటిళ్ల మీద టైటిళ్లు. ప్రత్యర్థెవరైనా పరాజయానికి సిద్ధపడాల్సిందే. స్పెయిన్‌ బుల్‌ బరిలోకి దిగాడంటే.. అంతే! అద్భుతమైన ఆటతో దాదాపు రెండు దశాబ్దాలు రొలాండ్‌ గారోస్‌ను శాసించాడు. ఇంకా చెప్పాలంటే ఒక నియంతలా పాలించాడు. కానీ ఓ గొప్ప అధ్యాయానికి తెరపడ్డట్లే. అప్రతిహత విజయాలతో అభిమానులను ఉర్రూతలూగించిన రఫెల్‌ నాదల్‌ను మళ్లీ మనం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చూడలేం..! ఈసారి తొలి రౌండ్లోనే ఓడిన అతడు మళ్లీ ఇక్కడ ఆడే అవకాశాలు చాలా చాలా తక్కువని ప్రకటించాడు.

ఈనాడు క్రీడావిభాగం

ఫ్రెంచ్‌ ఓపెన్‌ అంటే నాదల్‌.. నాదల్‌ అంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌ అన్నది సగటు అభిమాని భావన. అంతలా అలరించాడు రఫా. ఫ్రెంచ్‌ ఓపెన్‌ అంటే అతడు ట్రోఫీని కొరికే దృశ్యాలే గుర్తొస్తాయి. ఊహకందని రీతిలో అతడు ఇక్కడ ఏకంగా 14 టైటిళ్లు చేజిక్కించుకున్నాడు. అయితే నాదల్‌ ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే జ్వెరెవ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలిసారి రొలాండ్‌ గారోస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన అతడు.. ఇలా తొలి రౌండ్లో కంగుతినడం విచిత్రమే. కానీ ఏడాదిన్నరగా గాయాలు, ఫిట్‌నెస్‌ లేమితో సతమతమవుతోన్న నాదల్‌లో ఒకప్పటి జోరు లేదన్నది స్పష్టం. 15 వేల మంది ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఆడిన అతడు.. పెద్దగా పోటీ ఇవ్వకుండానే నిష్క్రమించాడు. అయితే అతడు ప్రదర్శన పూర్తిగా ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. తుంటి, ఉదర కండరాల గాయాల కారణంగా 2023 జనవరి నుంచి 15 మ్యాచ్‌లే ఆడిన నాదల్‌ గెలుపోటముల రికార్డు 8-7. చాలా కాలం నంబర్‌వన్‌గా కూడా ఉన్న అతడు.. ఇటీవల ఎక్కువగా ఆడకపోవడంతో 275వ ర్యాంకుకు పడిపోయాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిసారి అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగాడు. ఫలితంగా తొలి రౌండ్లోనే నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌తో తలపడాల్సి వచ్చింది. ఓటమి నేపథ్యంలో నాదల్‌తో పాటు.. అతడికిదే చివరి ఫ్రెంచ్‌ ఓపెన్‌ మ్యాచ్‌ అని అర్థం కావడం వల్ల ప్రేక్షకులూ భావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడతానని కచ్చితంగా చెప్పలేనని మ్యాచ్‌ అనంతరం నాదల్‌ వ్యాఖ్యానించాడు. ‘‘అందరికీ కృతజ్ఞతలు. మాట్లాడానికి చాలా కష్టంగా ఉంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడడం ఇదే చివరిసారా.. అంటే చెప్పలేను. గత రెండేళ్లలో గాయాలతో చాలా ఇబ్బందిపడ్డా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నేను ఇక్కడికి తిరిగి రాకపోయే అవకాశాలే ఎక్కువ. కానీ అది నూరు శాతం అని చెప్పను. ఒలింపిక్స్‌ కోసం మాత్రం ఇక్కడికి మళ్లీ వస్తానని ఆశిస్తున్నా’’ అని నాదల్‌ గద్గద స్వరంతో అన్నాడు.

2005లో మొదలెట్టి..

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ టైటిళ్ల వేట 2005లో మొదలైంది. ఆ తర్వాత ఎదురులేకుండా పోయింది. తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022లోనూ అక్కడ విజేతగా నిలిచాడు. ఇతర గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ సత్తా చాటిన నాదల్‌.. కెరీర్‌లో మొత్తం 22 మేజర్‌ టైటిళ్లు గెలుచుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు