IND vs AFG: శ్రేయస్‌ను తప్పించడానికి కారణాలు ఇవేనా? టీ20 సిరీస్‌కు రషీద్‌ ఖాన్‌ దూరం

భారత్‌, అఫ్గానిస్థాన్‌ (IND vs AFG) మధ్య జనవరి 11 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన తాజా వార్తల మీకోసం.. 

Published : 10 Jan 2024 18:42 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, అఫ్గానిస్థాన్‌ (IND vs SA)  మధ్య జనవరి 11 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. 2024 టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమ్‌ఇండియా ఆడే చివరి టీ20 సిరీస్‌ ఇదే. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ను అఫ్గాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, దీని వెనుక వేరే కారణాలు ఉన్నాయట. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రేయస్ బ్యాటింగ్‌ శైలిపై సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సఫారీలతో టెస్టు సిరీస్‌ అనంతరం భారత్‌కు వచ్చిన అతడు ముంబయి తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడకుండా సెలవు తీసుకోవడంపై  టీమ్ మేనేజ్‌మెంట్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణాల వల్లే శ్రేయస్‌ని అఫ్గాన్‌తో సిరీస్‌కు పక్కన పెట్టారట.   

ఈ పరిణామాల నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ అప్రమత్తమయ్యాడు. త్వరలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో రంజీ ట్రోఫీలో ఆడటానికి సిద్ధమయ్యాడు. జనవరి 12 నుంచి  ఆంధ్రతో తలపడే ముంబయి జట్టులో శ్రేయస్ పేరును చేర్చారు. ఇంగ్లాండ్‌-ఎ తో సిరీస్‌ కోసం భారత్‌-ఎలో సర్ఫరాజ్‌ స్థానాన్ని ముంబయి జట్టులో ఇప్పుడు అయ్యర్ భర్తీ చేశాడు.


Rashid Khan: భారత్‌తో టీ20 సిరీస్.. రషీద్‌ ఖాన్‌ ఔట్

 

భారత్‌తో టీ20 సిరీస్‌కు అఫ్గాన్‌ స్టార్‌ లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) దూరమయ్యాడు. గత నవంబర్‌లో అతడు వెన్నెముక గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నాడు. అయినప్పటికీ ఇబ్రహీం జద్రాన్‌ను కెప్టెన్‌గా నియమించి రషీద్‌ను జట్టులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో సిరీస్‌ నుంచి తప్పిస్తున్నట్లు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా వెల్లడించింది. రషీద్‌ లేకపోయినా మహ్మద్‌ నబీ, ముజీబుర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌ వంటి స్పిన్నర్లతో పర్యాటక స్పిన్‌ దళం బలంగానే కనిపిస్తోంది. నవీనుల్ హక్, ఫజల్ హక్‌ ఫారూఖీ పేస్‌ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. జనవరి 11న తొలి టీ20 (మొహాలీ), 14న రెండో టీ20 (ఇండోర్), 17న మూడో టీ20 (బెంగళూరు) జరగనున్నాయి. 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్‌ శర్మ, సంజు శాంసన్‌, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్‌, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్ కుమార్. 

అఫ్గానిస్థాన్‌ జట్టు: ఇబ్రహీం జాద్రాన్‌ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇక్రం అలిఖిల్‌, హజ్రతుల్లా జజాయ్‌, రహ్మత్‌ షా, నజీబుల్లా జాద్రాన్‌, మహ్మద్‌ నబి, కరీమ్‌ జనత్‌, అజ్మాతుల్లా ఒమర్‌జాయ్‌, షరాఫుద్దీన్‌ అష్రాఫ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, ఫరీద్‌ అహ్మద్‌, నవీనుల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, సలీమ్‌, కైస్‌ అహ్మద్‌, గుల్బదీన్‌ నయీబ్‌, రషీద్‌ ఖాన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు