Ravi Shastri: నా కెరీర్‌లో ఎన్నో చూశా.. ఆ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను: రవిశాస్త్రి

రవిశాస్త్రి (Ravi Shastri) క్రికెటర్‌, కోచ్‌, కామెంటేటర్‌గా మనందరికీ పరిచయం. జీవితసాఫల్య పురస్కారం అందుకొన్న అతడు తన మనసులోని మాటలను బయటపెట్టాడు.

Updated : 24 Jan 2024 16:30 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ విజేతగా నిలిచిన తొలి వన్డే ప్రపంచ కప్‌లో సభ్యుడు.. టీమ్‌ఇండియాకు కోచ్‌గా పనిచేసిన అనుభవం.. కామెంట్రీలో కట్టిపడేసే వాక్చాతుర్యం.. ఇవన్నీ రవి శాస్త్రి (Ravi Shastri) సొంతం. తాజాగా కల్నల్‌ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఈ భారత మాజీ క్రికెటర్‌ జీవితంలో ఎన్నో స్పెషల్‌ మూమెంట్స్‌ ఉన్నాయని తెలిపాడు. తన క్రికెట్‌ కెరీర్‌తోపాటు కోచింగ్‌లో అత్యుత్తమ క్షణాలను ఆస్వాదించినట్లు వెల్లడించాడు.

‘‘దాదాపు 43 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో అత్యుత్తమ సందర్భం ఏంటనేది ఎంచుకోవడం కష్టమే. క్రికెటర్‌గా, కోచ్‌గా, వ్యాఖ్యాతగా ఎన్నో అద్భుత క్షణాలను ఆస్వాదించా. తొలిసారి భారత్‌ వరల్డ్‌ కప్‌ నెగ్గిన జట్టులో ఉండటం గర్వకారణం. లార్డ్స్‌ బాల్కనీలో కప్‌ను సగర్వంగా అందుకొన్నాం. బ్యాటర్‌గా విండీస్‌లో సెంచరీ, ఆస్ట్రేలియాలో డబుల్ సెంచరీ ఎప్పటికీ మరిచిపోలేను. కామెంటేటర్‌గా 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఎంఎస్ ధోనీ విన్నింగ్ షాట్‌ గురించి చెప్పడం అద్భుతం. 2007 టీ20 ప్రపంచ కప్‌ విజేతగా భారత్‌ నిలవడం చూశా. ఇవన్నీ ఒకెత్తు. కోచ్‌గా ఆసీస్ గడ్డపై వరుస విజయాలను సాధించిన జట్టుకు మార్గనిర్దేశం.. అందులోనూ గబ్బా టెస్టులో 329 పరుగులను ఛేదించడం.. రిషభ్‌ పంత్‌ విన్నింగ్ షాట్‌తో జట్టును గెలిపించడం.. ఈ క్షణాలు జీవితంలో మరిచిపోలేనివి’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

వైరల్‌గా మారిన సరదా వ్యాఖ్యలు

ఇదే కార్యక్రమంలో రవిశాస్త్రి చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కోచ్‌గా ఉన్నప్పుడు ఆటగాళ్లతో కఠినంగా ఉండేవాడు కాదు. పూర్తి స్వేచ్ఛనిస్తూ అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేందుకు ప్రయత్నించాడు. ‘గేమ్‌ను స్పిరిట్‌తో ఆడాలి. ఆట ముగిశాక స్పిరిట్స్‌ వాడాలి’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించడంతో సభాప్రాంగణంలో నవ్వులు విరిశాయి. అయితే, సోషల్ మీడియాలో పలువురు క్రికెట్ ఫ్యాన్స్‌ భిన్నంగా స్పందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని