Hardik Pandya: అతడూ మనిషే.. వరుసగా ఓడినంత మాత్రాన చెడ్డ జట్టేమీ కాదు: రవిశాస్త్రి

ఓ వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ మైదానంలో అల్లరి చేయడం తగదని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

Published : 03 Apr 2024 15:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్యను (Hardik Pandya) అభిమానులు ట్రోలింగ్‌ చేయడంపై రవిశాస్త్రి కాస్త అసహనం వ్యక్తం చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ సమయంలో.. ప్రేక్షకులు నినాదాలతో హోరెత్తించారు. దీనిపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘గత కొన్నేళ్లుగా ముంబయికి మద్దతుగా నిలిచారు. కానీ, కేవలం రెండు మ్యాచుల్లో ఓడిపోయినంత మాత్రాన జట్టును తక్కువ చేయడం మంచిది కాదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ అదే. ఇప్పుడు కొత్త కెప్టెన్‌ సారథ్యంలో బరిలోకి దిగింది. కాస్త ఓపికగా ఉండాలి. పాండ్యను మరీ ట్రోలింగ్‌ చేయడం తప్పు. అతడు కూడా మనిషే. రోజు ముగిసిన తర్వాత ఎవరైనా నిద్ర పోవాల్సిందే. కాబట్టి, ప్రతిఒక్కరూ కాస్త ఆలోచించండి. నిశ్శబ్దంగా ఉండాలి. ఈసందర్భంగా పాండ్యకు కూడా ఒక సూచన చేస్తున్నా. ఓపికగా ఉండి.. గేమ్‌పైనే దృష్టిసారించాలి. ఆ జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. మరో నాలుగు మ్యాచుల్లో గెలిస్తే చాలు. అంతా సర్దుకుంటుంది’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. 

ఇషాన్‌ కిషన్‌కు భలే పనిష్‌మెంట్

ముంబయి ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వినూత్నమైన శిక్ష విధించింది. అతడితో సూపర్‌ మ్యాన్‌ వేషం వేయించింది. అలాగే కుమార్‌ కార్తికేయ, షామ్స్‌ ములాని, నువాన్ తుషారాకూ ఇదే పనిష్‌మెంట్‌ ఇచ్చారు. ఎందుకు అనేగా మీ డౌటు? వీరంతా జట్టు మీటింగ్‌కు ఆలస్యం వచ్చారని ఇలాంటి శిక్ష విధించింది. దీంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో నవ్వులు విరిశాయి. ఈమేరకు ముంబయి తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. అందులో నమన్‌ ధిర్‌ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి శిక్షలు ఉంటాయనే తాను మీటింగ్‌కు అస్సలు ఆలస్యంగా రానని వ్యాఖ్యానించాడు. గతంలో నెహాల్ వధేరాకూ ఇలాంటి శిక్ష పడింది. అయితే, ఇషాన్‌కు ఇదే తొలిసారి కాదు. 2018లోనూ ఓసారి సమావేశానికి ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు రాహుల్‌ చాహర్, అనుకుల్‌ రాయ్‌తో కలిసి ఆలస్యమయ్యాడు. ఆ సమయంలో తాను మళ్లీ ఎప్పుడూ లేట్‌ కానని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు మరోసారి పనిష్‌మెంట్‌ను ఎదుర్కోవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని