Ravindra Jadeja: టెస్టుల్లో 3000 పరుగులు.. 250 వికెట్లు.. ‘జడ్డూ’ ది గ్రేట్‌

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అతడు. బ్యాట్‌, బంతితో పాటు ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో ఓ అరుదైన ఘనతను సాధించాడు.

Published : 16 Feb 2024 16:57 IST

బ్యాటింగ్‌లో జట్టు కష్టాల్లో ఉందా.. అయితే మిడిలార్డర్, లోయర్‌ మిడిలార్డర్‌లో వచ్చి ఆదుకుంటాడు. జట్టుకు వికెట్లు కావాలా.. అయితే బంతి అందుకుని తన స్పిన్‌తో మాయ చేస్తాడు. చురుకైన ఫీల్డర్‌ కావాలా.. అయితే తానున్నానంటూ మైదానంలో మెరుపు వేగంతో సాగుతాడు. అతను ఇంకెవరో కాదు.. టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంతితో, బ్యాట్‌తో సత్తా చాటుతున్న ఈ ప్రపంచ నంబర్‌వన్‌ టెస్టు ఆల్‌రౌండర్‌ తాజాగా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 3 వేల పరుగులు చేయడంతో పాటు 250 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కపిల్‌దేవ్, అశ్విన్‌ అతనికంటే ముందున్నారు. 70వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న జడేజా ఖాతాలో 3005 పరుగులు, 280 వికెట్లున్నాయి. 

గాయాలను దాటి..

ఇటీవల కాలంలో జడేజా తరచూ గాయాల బారిన పడుతున్నాడు. టీమ్‌ఇండియా ఆడిన చాలా టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కానీ గాయపడిన ప్రతిసారీ పట్టుదలతో కోలుకుంటూ, బలంగా పుంజుకుంటున్నాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ, ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ జడేజా తనదైన ముద్ర కచ్చితంగా వేస్తున్నాడు. గాయంతో విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన అతను.. తిరిగి కోలుకోవడమే కాదు మూడో టెస్టు కోసం జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. 2012లో టెస్టు అరంగేట్రం చేసిన 35 ఏళ్ల జడ్డూ.. 2019 నుంచి అత్యుత్తమ ఆటతీరుతో సాగుతున్నాడు. ఆల్‌రౌండర్‌గా జడేజా 2.0 వర్షన్‌ను చూపిస్తున్నాడు. 2019 నుంచి 30 టెస్టుల్లో 44.47 సగటుతో 1601 పరుగులు చేశాడు. 26.26 సగటుతో 90 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో అయితే మరింత ప్రమాదకరంగా మారాడు. 2019 నుంచి భారత్‌లో 14 టెస్టులాడిన జడ్డూ.. 54.43 సగటుతో 871 పరుగులు చేశాడు. 24.24 సగటుతో 55 వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా స్వదేశంలో 42 టెస్టుల్లో 41.69 సగటుతో 1793 పరుగులు చేశాడు. 21.04 సగటుతో 199 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్‌లో స్పెషలిస్టు బ్యాటర్‌ తరహాలో, బౌలింగ్‌లో ప్రధాన బౌలర్‌గా సాగుతున్నాడు. 

సంధి దశలో..

భారత జట్టు సంధి దశలో ఉన్న ఈ తరుణంలో టాప్‌ఆర్డర్లో మార్పులు జరుగుతున్నాయి. కొత్త కుర్రాళ్లు వస్తున్నారు. కొన్నిసార్లు టాప్‌ఆర్డర్‌ నిలదొక్కుకోలేకపోతోంది. మిడిలార్డరూ విఫలమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. బజ్‌బాల్‌ అంటూ ఇంగ్లాండ్‌ దూకుడుగా ఆడుతున్న ఈ రోజుల్లో జడ్డూ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అసలైన టెస్టు బ్యాటింగ్‌ నైపుణ్యాలను ప్రదర్శించాడు. 33కే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడిన సమయంలో పట్టుదలతో క్రీజులో నిలిచాడు. రాజ్‌కోట్‌ రాజకుమారుడైన జడ్డూ తన సొంతగడ్డపై పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో నాలుగో టెస్టు శతకాన్ని అందుకున్నాడు. రోహిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించి జట్టును నిలబెట్టిన అతను.. సర్ఫరాజ్‌తో అయిదో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. సర్ఫరాజ్‌ రనౌట్‌లో తప్పు తనదే అని ఒప్పుకోవడం జడ్డూ వ్యక్తిత్వానికి నిదర్శనం.

రాజ్‌కోట్‌లోని నిరంజన్‌ షా స్టేడియంలో జడ్డూకు గొప్ప రికార్డుంది. 17 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో ఏకంగా 142.18 సగటుతో అతను 1564 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలున్నాయి. అలాగే 20 కంటే తక్కువ సగటుతో 60 వికెట్లూ తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అయితే 3 మ్యాచ్‌ల్లో 128 సగటుతో రెండు శతకాలతో సహా 256 పరుగులు చేశాడు. ఇక జడ్డూకు ఇంగ్లాండ్‌ ప్రియ ప్రత్యర్థి. ఈ జట్టుపై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన 15వ భారత ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. ఇప్పటివరకూ ఆ జట్టుతో ఆడిన 18 మ్యాచ్‌ల్లో 1000 పరుగులు, 56 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని