IPL 2024: ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కొద్ది మార్పులుంటాయి: డీకోడ్‌ చేసిన రాయుడు

సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ 17వ సీజన్‌ కోసం సిద్ధమవుతున్నాడు. మరో 43 పరుగులు చేస్తే తన పేరిట ఓ రికార్డు నమోదవుతుంది.

Published : 15 Mar 2024 18:12 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్‌ ఎలా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌లో డెత్‌ ఓవర్లలో హార్డ్‌ హిట్టింగ్‌ చేసి కీలక పరుగులు సాధించాడు. అయితే, ఈసారి మాత్రం బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) వ్యాఖ్యానించాడు. గత సీజన్‌ వరకు ఐపీఎల్‌లో సీఎస్కే జట్టుకు ఆడిన అంబటి రాయుడు ఇప్పటికే వీడ్కోలు పలికాడు. మరో 43 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా ధోనీ అవతరిస్తాడు.

‘‘ధోనీ భాయ్‌ తీసుకొనే నిర్ణయాలు ఎవరికీ తెలియదు. గత కొన్ని సీజన్లలో అతడి గురించి తెలుసుకున్నాను కాబట్టి.. చెబుతున్నా. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కొన్ని మార్పులు ఉంటాయి. కానీ, ధోనీ టాప్‌ ఆర్డర్‌కు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు ఏడో స్థానంలో వస్తున్న అతడు అవసరమైతే ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడు. పైవరుసలో మాత్రం కుర్రాళ్లకే అవకాశం ఇస్తాడు. చాలామంది ధోనీకిదే చివరి సీజన్‌ అని చెబుతున్నారు. కానీ, అతడి ఫిట్‌నెస్‌ను చూస్తే మాత్రం మరో ఏడాది కూడా ఆడతాడు’’ అని రాయుడు వ్యాఖ్యానించాడు. 

ధోనీని ఎవరూ పునరావృతం చేయలేరు: ధ్రువ్‌

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసి సత్తా చాటిన ధ్రువ్‌ జురెల్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీతో పోల్చాడు. తాజాగా సన్నీ వ్యాఖ్యలపై ధ్రువ్ స్పందించాడు. ‘‘సునీల్‌ గావస్కర్‌కు ధన్యవాదాలు. నన్ను ధోనీతో పోల్చారు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం ధోనీని ఎవరూ అందుకోలేరని భావిస్తా. భారత క్రికెట్‌కు అతడు చేసిన దాంట్లో కొంత చేసినా చాలు. ధోనీ అంటే ఒకరే ఉంటాడు. నేను మాత్రం ధ్రువ్‌లా ఉండేందుకు ప్రయత్నిస్తా. ధోనీ ఓ దిగ్గజం. అతడిని ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగుతా’’ అని ధ్రువ్‌ (Dhruv Jurel) తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని