Sachin: కష్టమైన బౌలర్.. సచిన్‌ నా పేరు చెబుతాడని అనుకోలేదు: పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌

హేమాహేమీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న సచిన్‌ తెందూల్కర్ (Sachin)ను కాస్త ఇబ్బందికి గురి చేసిన బౌలర్‌ ఉన్నాడట. అతడు పాకిస్థాన్‌కు చెందిన మాజీ ఆల్‌రౌండర్‌ కావడం విశేషం.

Published : 16 Jun 2023 13:43 IST

ఇంటర్నెట్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు (Sachin) ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. వంద సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌. తన కెరీర్‌లో లెక్కకుమించి రికార్డులను నమోదు చేసిన భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ను కూడా ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉన్నారట. స్వయంగా సచినే చెప్పాడు మరి. వారు.. మెక్‌ గ్రాత్, షేన్ వార్న్, వకార్‌ యూనిస్‌, వసీమ్‌ అక్రమ్ అని పొరపాటుపడకండి. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ‘క్లిష్టమైన బౌలర్‌’ పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌  (Abdul Razzaq) అని సచిన్‌ చెప్పాడు. అతడి బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో సచిన్‌ వ్యాఖ్యలపై తాజాగా అబ్దుల్‌ రజాక్ ఆనందం వ్యక్తం చేశాడు. సచిన్‌ వంటి గ్రేట్‌ బ్యాటర్‌ నుంచి ఇలాంటి ప్రశంసలను ఊహించలేదని పేర్కొన్నాడు. 

‘‘సచిన్‌ తెందూల్కర్‌ ఎప్పటికీ ప్రపంచస్థాయి అత్యుత్తమ బ్యాటర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడికున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మనకు తెలిసిందే. అలాంటి సచిన్‌ కష్టమైన బౌలర్‌గా నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అలా కాకుండా గ్లెన్‌ మెక్‌గ్రాత్, వసీమ్‌ అక్రమ్, వకార్‌ యూనిస్, ఆంబ్రోస్, వాల్ష్‌, ముత్తయ్య, షేన్ వార్న్‌... ఇలా ఎవరిపేరైనా చెప్పి ఉండాల్సింది. కానీ.. సచిన్‌ నా పేరును చెప్పడం ఎప్పటికీ మరిచిపోలేను. దానిని గౌరవంగా భావిస్తా. గతంలోనూ నేను చాలా సార్లు సచిన్‌ గురించి చెప్పా. అతడి మానవతాదృక్పథం చాలా గొప్పది’’ అని రజాక్‌ తెలిపాడు.

వారిద్దరి కోసమే ప్రణాళికలు వేసేవాళ్లం

గత మార్చిలోనే వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ తెందూల్కర్‌ గురించి రజాక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరిని ఔట్‌ చేసేందుకు తమ జట్టు తీవ్రంగా ప్రణాళికలను రచించేదని పేర్కొన్నాడు. ‘‘వీరేంద్ర సెహ్వాగ్‌ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్. ఆ తర్వాతే సచిన్‌ తెందూల్కర్‌. సెహ్వాగ్‌ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడతాడు. వారిని ఔట్ చేసేందుకు నానా కష్టాలు పడేవాళ్లం. సెహ్వాగ్ - సచిన్‌ వికెట్లను త్వరగా తీసేస్తే చాలు.. మేం మ్యాచ్‌ను గెలిచినట్లే. ఇక బ్యాటర్లు అయితే జహీర్‌ ఖాన్, ఇర్ఫాన్‌ పఠాన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రణాళికలు వేసేవారు. హర్భజన్ కూడా ప్రమాదకారే. ఇరు దేశాల ఆటగాళ్లు విజయం కోసం తీవ్రంగా పోరాడేవారు’’ అని రజాక్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని