RCB: ఆర్‌సీబీకి కొత్త కోచ్‌.. వారిద్దరిపై వేటు!

వచ్చే ఐపీఎల్‌ (IPL) సీజన్‌లోనైనా విజేతగా నిలిచేందుకు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. అందులో భాగంగా తొలుత ప్రధాన కోచ్‌గా జింబాబ్వే మాజీ స్టార్‌ ప్లేయర్‌ను ఎంపిక చేసుకుంది.

Published : 04 Aug 2023 15:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి సీజన్‌ నుంచి ఇటీవల ముగిసిన ఐపీఎల్ (IPL) సీజన్‌ వరకు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేదు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB). కెప్టెన్‌ను మార్చినా ఫలితం లేదు. ఈ క్రమంలో వచ్చే సీజన్‌కు కోచింగ్‌ స్టాఫ్‌ను మారుస్తూ ఆర్‌సీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన కోచ్‌గా జింబాబ్వే మాజీ స్టార్‌ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌ను (Andy Flower) ఎంపిక చేసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న సంజయ్‌ బంగర్‌తోపాటు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ మైక్‌ హెసన్‌పై వేటు వేసింది. వారిద్దరి కాంట్రాక్ట్‌ను సెప్టెంబర్‌లో పొడిగించాలని నిర్ణయించుకున్నప్పటికీ తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆండీ ఫ్లవర్‌ను తీసుకొనే ముందు ఆర్‌సీబీ వైస్‌ ప్రెసిడెంట్ రాజేశ్‌ మేనన్ లండన్‌లో చర్చించారని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. ఆండీ ఫ్లవర్‌కు ఐపీఎల్‌లో పని చేసిన అనుభవం ఉంది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల కోచింగ్‌ స్టాఫ్‌లో బాధ్యతలు నిర్వర్తించాడు. 

గురువును మించిన శిష్యుడు.. టాప్‌-10లోకి భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌

ఆర్‌సీబీ ప్రధాన కోచ్‌గా నియమితులైన సందర్భంగా ఆండీ ఫ్లవర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది ఆర్‌సీబీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించాడు. ‘‘ఆటగాళ్లతో పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. ఆర్‌సీబీకి కోచ్‌గా అవకాశం రావడం అద్భుతమనిపిస్తోంది. ఇది ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర. అయితే, సవాళ్లతో కూడుకున్నదే. నా బాధ్యతలను ప్రారంభించడానికి వేచి ఉండలేను’’ అని ఆండీ ఫ్లవర్‌ వ్యాఖ్యానించాడు. 

సచిన్, విరాట్ తరాలు వేర్వేరు: చమిందా వాస్‌

సచిన్‌ తెందూల్కర్‌ రికార్డులను అధిగమించే అవకాశం ఉన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). వారిద్దరి ఆటతీరును మాత్రం పోల్చడం సరైంది కాదని శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘బ్రేక్‌ చేయడానికే రికార్డులు ఉండేది. అన్ని వేళలా రికార్డులన్నీ ఒకరి పేరు మీదనే ఉండిపోవు. తరాలు మారుతుంటాయి. విభిన్న ఆటగాళ్లు వస్తుంటారు. ఇప్పటికీ విరాట్ కోహ్లీ యంగ్‌గా కనిపిస్తున్నాడు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. ఇప్పుడు అతడి ఫామ్‌ను బట్టి టీమ్‌ఇండియా క్రికెట్‌ కోసం మరింత చేయగలడని అనిపిస్తోంది. తరతరాలకు అద్భుతమైన ఆటగాళ్లు వస్తూనే ఉంటారు’’ అని చమిందా వాస్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని