Lucknow: లఖ్‌నవూ ‘చేతులారా’ పోగొట్టుకుంది..!

కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని లఖ్‌నవూ జట్టు ఈ టోర్నీలో ఆడింది తొలిసారే అయినా టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అయితే, గతరాత్రి కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో...

Updated : 26 May 2022 11:27 IST

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయారంటే?

కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని లఖ్‌నవూ జట్టు ఈ టోర్నీలో ఆడింది తొలిసారే అయినా టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా పేరు తెచ్చుకొంది. అయితే, గతరాత్రి కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోయి అభిమానుల ఆశలు ఆవిరి చేసింది. లీగ్‌స్టేజ్‌లో టాప్‌-2లో నిలిచేలా కనిపించిన ఆ జట్టు రన్‌రేట్‌ పరంగా వెనుకపడి ఆఖరి క్షణాల్లో మూడోస్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే నాలుగో స్థానంలో నిలిచిన బెంగళూరుతో పోటీపడి చివరికి నిరాశతో వెనుదిరిగింది. అయితే, ఇక్కడ లఖ్‌నవూ ఓటమికి పలు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం..

టాస్‌ దగ్గరే తప్పటడుగు..

ఈడెన్‌ గార్డెన్స్‌ అంటేనే బ్యాట్స్‌మెన్‌కు పరుగుల స్వర్గధామం. అలాంటిది ఇక్కడ ఎవరు టాస్‌ గెలిచినా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంటారు. కానీ, ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టాస్‌ నెగ్గిన వెంటనే బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. అదే ఆ జట్టు ఓటమికి తొలి కారణంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌కు కలిసివచ్చే పిచ్‌పై తొలుత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వడం ఎంత తప్పో బెంగళూరు ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత రాహుల్‌కు అర్థమైంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డుప్లెసిస్‌ టీమ్‌.. లఖ్‌నవూ ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ఛేదనలో ఎంత కష్టపడినా రాహుల్‌ టీమ్‌ కొండంత లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లఖ్‌నవూ దీని కన్నా ముందు ఆడిన 10 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడే 6 సార్లు విజయం సాధించింది. రెండోసారి బ్యాటింగ్‌ చేసిన 4 సార్లూ ఓటమిపాలైంది. ఈ గణాంకాలను పరిశీలించినా రాహుల్‌ తొలుత బ్యాటింగ్‌ వదులుకొని ఎంత తప్పు చేశాడో అర్థం చేసుకోవచ్చు.

క్యాచ్‌లు జారవిడవడం..

ఇక ఎలిమినేటర్‌ లాంటి కీలక దశలో ఏ చిన్న తప్పిదం జరిగినా అది భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. అలాంటిది ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఫీల్డింగ్‌లో భారీ తప్పిదాలే చేసింది. టైటిల్‌ పోరులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కొన్ని క్యాచ్‌లు వదిలేయడం ఆ జట్టు కొంపముంచింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కిన రజత్‌ పటీదార్‌ (112 నాటౌట్‌; 54 బంతుల్లో 12x4, 7x6) మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా.. దినేశ్‌ కార్తీక్‌ (37 నాటౌట్‌; 23 బంతుల్లో 5x4, 1x6) కూడా క్రీజులోకి వచ్చిన వెంటనే క్యాచ్‌ ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు. తొలుత రజత్‌ 59 పరుగుల వద్ద ఉండగా కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో షార్ట్‌ థర్డ్ మ్యాన్‌ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న మోసిన్‌ ఖాన్‌ బంతిని అందుకునేలా కనిపించినా విఫలమయ్యాడు. తర్వాత రజత్‌ 72 పరుగుల వద్ద ఉండగా రవిబిష్ణోయ్‌ బౌలింగ్‌లో డీప్‌మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న దీపక్‌ హూడా సైతం సులువైన క్యాచ్‌ను వదిలేశాడు. అలాగే మోసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో కార్తీక్‌ 2 పరుగుల వద్ద ఉండగానే మిడాఫ్‌లో కేఎల్‌ రాహుల్‌ చేతికి చిక్కాడు. కానీ, ఆ బంతి కూడా నేలపాలైంది. దీంతో ఇలా మూడు సార్లు క్యాచ్‌లు వదిలి లఖ్‌నవూ చేతులారా మ్యాచ్‌ను సమర్పించుకొంది.

డెత్‌ ఓవర్లలో అధిక పరుగులు..

లఖ్‌నవూ ఓటమికి మరో ప్రధాన కారణం డెత్‌ ఓవర్లలో అధికంగా పరుగులివ్వడం. అది కేవలం ఈ మ్యాచ్‌లో పరుగులిచ్చారని చెప్పడం లేదు. ఈ సీజన్‌లో ఇంతకుముందు కోల్‌కతా, చెన్నై జట్లతో ఆడిన సందర్భాల్లోనూ ఇలాగే చివరి ఓవర్లలో విపరీతంగా పరుగులిచ్చింది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ చివరి ఐదు ఓవర్లలో 84 పరుగులు ఇవ్వడం గమనార్హం. దీంతో ఈ సీజన్‌ డెత్‌ ఓవర్లలో రెండో సారి కూడా అత్యధిక పరుగులిచ్చిన జట్టుగా నిలిచింది. తొలుత 15 ఓవర్ల దాకా బెంగళూరును బాగా కట్టడి చేసినా.. ఆ తర్వాత చేతులెత్తేసింది. బౌలర్లు ఎలా వేసినా పటీదార్‌, కార్తీక్‌ రెచ్చిపోయారు. బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీంతో బెంగళూరు 15 ఓవర్లకు 123/4 స్కోర్‌తో ఉండగా.. ఇన్నింగ్స్‌ పూర్తయ్యేసరికి 207/4 స్కోర్‌తో నిలిచింది. అంటే చివరి ఐదు ఓవర్లలో సగటున 16.8 పరుగులిచ్చింది. అంతకుముందు కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లోనూ చివరి ఐదు ఓవర్లలో 74 పరుగులిచ్చింది. ఇక్కడ ఓవర్‌కు సగటున 14.8 పరుగులిచ్చింది. అలాగే చెన్నైతో ఆడిన మ్యాచ్‌లోనూ ఆఖరి ఐదు ఓవర్లలో 63 పరుగులిచ్చింది. అంటే సగటున 12.6 పరుగులు సమర్పించుకొంది. దీన్ని బట్టి లఖ్‌నవూ డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ ఎలా గాడి తప్పిందో పోల్చి చూసుకోవచ్చు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో గందరగోళం..

మరోవైపు లఖ్‌నవూ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఈ సీజన్‌లో అందర్నీ కాసింత గందరగోళానికి గురిచేసింది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కోలా బ్యాట్స్‌మన్‌ స్థానాలు మార్చి ప్రయోగాలు చేసింది. ఒకసారి కృష్ణప్ప గౌతమ్‌ వంటి లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ను మూడో స్థానంలో ఆడించిన ఆ జట్టు మరికొన్నింటిలో దిగువ స్థాయిలోనే అవకాశం ఇచ్చింది. అలాగే ఎవిన్ లూయిస్‌ వంటి ఓపెనర్‌ను కూడా ఒక్కోసారి మూడో నంబర్‌ ఆటగాడిగా, మరికొన్ని సార్లు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడించింది. కృనాల్‌ పాండ్యను సైతం ఒక్కోసారి మిడిల్‌ ఆర్డర్‌లో, ఒక్కోసారి లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో పంపించింది. ఇలా పలుమార్లు ప్రయోగాలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక కీలకమైన ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ మనన్‌ వోహ్రాను మూడో నంబర్‌ ఆటగాడిగా తీసుకొచ్చి లూయిస్‌ను వెనక్కినెట్టింది. దీపక్‌ హూడా నాలుగో స్థానంలో మెరవడంతో మార్కస్‌ స్టాయినిస్‌ లాంటి బిగ్‌ హిట్టర్‌ను ఆఖరివరకు దాచిపెట్టుకొంది. దీంతో ఈ మ్యాచ్‌లో లూయిస్‌, స్టాయినిస్‌ లాంటి ఆటగాళ్లు క్రీజులో కుదురుకునేసరికే ఆడాల్సిన రన్‌రేట్‌ కొండలా పెరిగిపోయి ఒత్తిడికి గురిచేసింది. చివరికి లూయిస్ (2)‌, స్టాయినిస్‌ (9) స్కోర్లతో జట్టు వైఫల్యంలో భాగమయ్యారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని