Cameron Green: గ్రీన్‌ కోసం రూ.17.5 కోట్లా?.. ఆర్సీబీ వ్యూహమేంటీ?

Cameron Green IPL: బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉన్న ఆర్సీబీ.. పేసర్‌ మీద కాకుండా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన గ్రీన్‌పై ఇంతలా ఖర్చు పెట్టడం సరైందేనా?

Updated : 28 Nov 2023 16:00 IST

డిసెంబర్‌ 19న ఐపీఎల్‌ మినీ వేలం. (IPL 2024) ఈ నేపథ్యంలో హసరంగ, హర్షల్‌ పటేల్, హేజిల్‌వుడ్, వేన్‌ పార్నెల్, డేవిడ్‌ విల్లీ లాంటి బౌలర్లను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు వదులుకుంది. తీరా చూస్తే జట్టులో ఆడగలిగే పేసర్‌ సిరాజ్‌ ఒక్కడే ఉన్నాడు. దీంతో బౌలింగ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఆర్సీబీ (Royal Challengers Bangalore) సిద్ధమైందని అనిపించింది. ఖాతాలోనూ రూ.40.75 కోట్లు ఉండటంతో వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేస్తుందనిపించింది. కానీ, రెండు గంటలు గడిచాయో లేదో ముంబయి ఇండియన్స్‌ నుంచి కామెరూన్‌ గ్రీన్‌ను (Australian all-rounder Cameron Green) ఏకంగా రూ.17.5 కోట్లు చెల్లించి తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి గ్రీన్‌ కోసం అంత మొత్తం ఖర్చు చేసేందుకు ఆర్సీబీ ఎందుకు సిద్ధమైంది? ఆ జట్టు వ్యూహమేంటీ?

అంతలోనే..

2024 ఐపీఎల్‌ సీజన్‌ నేపథ్యంలో వచ్చే ఏడాది 19న మినీ వేలం జరగబోతోంది. దీనికి ముందు లీగ్‌లోని పది ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే, వదులుకునే, మార్పిడి చేసుకునే ఆటగాళ్ల వివరాలను గడువుకు చివరి తేదీ అయిన ఆదివారం ప్రకటించాయి. మొదట ఆర్సీబీ హసరంగ, హేజిల్‌వుడ్, హర్షల్‌ పటేల్, ఫిన్‌ అలెన్, మైకెల్‌ బ్రేస్‌వెల్, డేవిడ్‌ విల్లీ, వేన్‌ పార్నెల్, సోను యాదవ్, అవినాష్‌ సింగ్, సిద్ధార్థ్‌ కౌల్, కేదార్‌ జాదవ్‌తో కలిపి 11 మంది ఆటగాళ్లను వదులుకుంది. ఇందులో బౌలర్లే ఎక్కువగా ఉన్నారు. పేసర్లు సిరాజ్, టాప్లీ మాత్రమే మిగిలారు. టాప్లీ ఏమో గాయాలతో బాధపడుతున్నాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌కు ఇచ్చేసి బదులుగా స్పిన్నర్‌ మయాంక్‌ దాగర్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో వేలంలో బౌలర్లపై ఆర్సీబీ (Royal Challengers Bangalore) ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని అనిపించింది. ఉత్తమ బౌలర్లను కొనుగోలు చేసి బౌలింగ్‌ దళాన్ని పటిష్ఠం చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అనూహ్యంగా ముంబయి నుంచి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ను ఆర్సీబీ తీసుకుందనే విషయం బయటపడింది. గతేడాది వేలంలో రూ.17.5 కోట్లు పెట్టి గ్రీన్‌ను ముంబయి దక్కించుకుంది. ఇప్పుడు అంతే మొత్తాన్ని చెల్లించి గ్రీన్‌ను ఆర్సీబీ తీసుకుంది. అంతే కాకుండా ఆటగాడి మార్పిడి ఫీజు కింద కూడా ఆర్సీబీ మరికొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే గ్రీన్‌ కోసం భారీ మొత్తం ఖర్చు పెట్టేందుకు ఆర్సీబీ ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. గ్రీన్‌ మంచి ఆటగాడే. ఈ ఏడాదే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన అతను ముంబయి తరపున 16 మ్యాచ్‌ల్లో 50.22 సగటుతో 452 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్‌ 160.28 ఉండటం విశేషం. ఓ సెంచరీ కూడా చేశాడు. తన ఫాస్ట్‌బౌలింగ్‌తో ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగడమే కాకుండా, ఉపయుక్తమైన బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా అతను ఆర్సీబీకి కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉన్న ఆర్సీబీ.. పేసర్‌ మీద కాకుండా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ మీద ఇంతలా ఖర్చు పెట్టడం సరైందేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడేం చేయాలి?

హార్దిక్‌ పాండ్యను గుజరాత్‌ నుంచి తీసుకోవాలంటే ముంబయికి డబ్బు కావాలి. అందుకే గ్రీన్‌ను ఇచ్చేస్తామని అన్ని జట్లతోనూ బేరసారాలు జరిపింది. చివరకు ఆర్సీబీ తీసుకుంది. ఇప్పటికే డుప్లెసిస్, కోహ్లి, మ్యాక్స్‌వెల్, రజత్‌ పటీదార్, దినేశ్‌ కార్తీక్‌తో బ్యాటింగ్‌ విభాగం బలంగా ఉంది. ఇప్పుడు గ్రీన్‌ కూడా జతకావడంతో మరింత పటిష్ఠంగా మారుతుంది. అయితే ఆర్సీబీ బ్యాటింగ్‌ ఎప్పుడూ అత్యుత్తమంగానే ఉంటోంది. బౌలింగ్‌ మాత్రమే బలహీనంగా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. మినీ వేలంలో సరైన బౌలర్లను ఎంచుకోవడం ఇప్పుడు ఆర్సీబీకి సవాలేనని చెప్పాలి. పైగా ఖాతాలో రూ.23.50 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వేలంలో తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల ప్రపంచకప్‌లో సత్తాచాటిన దక్షిణాఫ్రికా పేసర్‌ కొయెట్జీని దక్కించుకోవడానికి ఆర్సీబీ ప్రయత్నించే అవకాశముంది. అలాగే 2014, 2015 సీజన్లలో ఆర్సీబీతోనే ఆడిన మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా)నూ తిరిగి సొంతం చేసుకోవచ్చు. వీళ్లతో పాటు స్పిన్నర్లు దునిత్‌ వెల్లలాగె (శ్రీలంక), మెహిదీ హసన్‌ (బంగ్లాదేశ్‌), ముజీబుర్‌ రెహ్మాన్‌ (అఫ్గానిస్థాన్‌)పైనా ఆర్సీబీ కన్నేసి ఛాన్స్‌ ఉంది. అంతే కాకుండా వదులుకున్న వాళ్లలో హసరంగ, హేజిల్‌వుడ్‌నూ తిరిగి తీసుకునే అవకాశాలను కొట్టేయలేం. గ్రీన్‌ రాకతో బ్యాటింగ్‌ బలపడింది. ఓ బౌలర్‌ అవసరమూ తగ్గింది. ఈ నేపథ్యంలో బౌలింగ్‌ను మరింత పటిష్ఠం చేసుకుంటే.. ఆర్సీబీకి తిరుగుండదనే చెప్పాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని