IND vs ENG: రాజ్‌కోట్‌.. టీమ్‌ఇండియా కోట... మూడో టెస్టులో రికార్డులు ఇవే!

Rajkot Test Match Records: భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో నమోదైన రికార్డులు ఇవే... 

Updated : 18 Feb 2024 20:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్‌ 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సర్ఫరాజ్‌ రాణించడంతో ఒక రోజు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు ఇవే...

జైస్వాల్‌ రికార్డులు ఇవీ...

  • యశస్వి జైస్వాల్‌ (214) డబుల్‌ సెంచరీలో మొత్తంగా 12 సిక్స్‌లు బాదాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌ల జాబితాలో వసీం అక్రమ్‌ రికార్డును సమం చేశాడు. 
  • కొట్టిన తొలి మూడు సెంచరీలూ 150+ స్కోర్లుగా మలిచిన తొలి భారత బ్యాటర్‌. ప్రపంచవ్యాప్తంగా అయితే ఏడోవాడు. 
  • చిన్న వయసులో రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌. రాజ్‌కోట్‌లో డబుల్‌ కొట్టే సమయానికి జైస్వాల్‌ వయసు 22 ఏళ్ల 49 రోజులు. తొలి స్థానంలో వినోద్‌ కాంబ్లీ (21 ఏళ్ల 54 రోజులు). రెండో స్థానంలో డాన్‌ బ్రాడ్‌మన్‌ (21 ఏళ్లు 318 రోజులు). 
  • ఒక సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌. ఇప్పటివరకు ఈ ఫీట్‌ వినోద్‌ కాంబ్లీ, విరాట్‌ కోహ్లీ చేశారు. 
  • 2019లో ఓ సిరీస్‌లో రోహిత్‌ శర్మ 19 సిక్స్‌లు బాది రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో 22 సిక్స్‌లతో ఆ రికార్డును జైస్వాల్‌ బద్దలు కొట్టాడు. 
  • ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్లలో జైస్వాల్‌ (545)ది తొలి స్థానం. గంగూలీ (534) ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్నాడు. 
  • 23 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఓ టెస్టు సిరీస్‌లో 500+ పరుగులు చేసిన బ్యాటర్‌ రికార్డు ఇప్పటివరకు సునీల్‌ గావస్కర్‌ (774) పేరున ఉంది. సుమారు 53 ఏళ్ల తర్వాత జైస్వాల్‌ (545) ఆ ఘనత సాధించాడు. 
  • అతి తక్కువ వయసు (22 ఏళ్ల 52 రోజులు)లో రెండో ఇన్నింగ్స్‌లో ద్విశతకం బాదిన మూడో బ్యాటర్‌. అతని కంటే ముందు జార్జ్‌ హెడ్లీ (20 ఏళ్ల 315 రోజులు), సునీల్‌ గావస్కర్‌ (21 ఏళ్ల 283 రోజులు) ఉన్నారు. 
  • వేగంగా డబుల్‌ సెంచరీ చేసిన భారత ప్లేయర్ల జాబితాలో జైస్వాల్‌ స్థానం ఆరు. 231 బంతుల్లో ద్విశతకం బాదిన జైస్వాల్‌ ధోనీ సరసన చేరాడు. తొలి ఐదు స్థానాలు వీరేంద్ర సెహ్వాగ్‌వే. 

టీమ్‌ రికార్డులు ఇవీ...

  • ఈ టెస్టులో భారత్‌ మొత్తంగా 28 సిక్స్‌లు బాదింది. ఓ టెస్టులో ఇన్ని సిక్స్‌లు నమోదవడం ఇదే తొలిసారి. తన పేరునే ఉన్న రికార్డు (దక్షిణాఫ్రికాపై 27)ను భారత్‌ ఈ మ్యాచ్‌తో తిరగరాసింది. 
  • సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనే 18 సిక్స్‌లు నమోదయ్యాయి.  రెండో ఇన్నింగ్స్‌ అత్యధిక సిక్స్‌ల జాబితాలో మన స్థానం రెండు. 22 సిక్స్‌లతో పాకిస్థాన్‌ తొలి స్థానంలో ఉంది. 
  • ఓ టీమ్‌ ఒక సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన రికార్డు భారత్‌పైనే ఉండేది. 2019లో దక్షిణాఫ్రికాపై 47 సిక్స్‌లతో సాధించిన రికార్డును ఈ సిరీస్‌లో 48 సిక్స్‌లతో తిరగరాసింది. 
  • అరంగేట్ర టెస్టులో రెండు అర్ధశతకాలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ ఖాన్‌ (62, 68*) నిలిచాడు. అతనికి ముందు దిలావర్‌ హుస్సేన్‌, సునీల్‌ గావస్కర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. 
  • ఆడుతున్న తొలి టెస్టులో అత్యధిక స్ట్రైక్‌ రేటు (94.2)తో రెండు అర్ధశతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో  సర్ఫరాజ్‌ ఖాన్‌ది తొలి స్థానం. 
  • ఓ జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 400కుపై పరుగులు సాధించడం సుమారు 15 ఏళ్ల తర్వాత జరిగింది. 2009లో భారత్‌.. శ్రీలంకపై ఈ ఫీట్‌ సాధించింది. ఇప్పుడు రాజ్‌కోట్‌లో మళ్లీ సాధ్యమైంది. 
  • సర్ఫరాజ్, జైస్వాల్‌ బ్యాటింగ్‌ సమయంలో నమోదైన రన్‌రేట్‌ 6.53. ఓ బ్యాటింగ్‌ జోడీ 150కిపైగా బంతులు ఆడిన పార్ట్‌నర్‌ షిప్‌ల జాబితాలో జైస్వాల్ - సర్ఫరాజ్‌ జోడీది ఏడో స్థానం. 
  • భారత్‌ విధించిన అత్యధిక టార్గెట్‌ల జాబితాలో ఈ మ్యాచ్‌ లక్ష్యానిది (557) రెండో స్థానం. తొలి స్థానంలో 617 ఉంది. 2009లో న్యూజిలాండ్‌కు భారత్‌ ఈ లక్ష్యం విధించింది. 
  • ఒక టెస్టులో సెంచరీ, 5 వికెట్ల ఫీట్‌ సాధించడం జడేజాకు ఇది రెండోసారి. ఇలా ఇప్పటివరకు ఏడు సార్లు భారత ప్లేయర్‌లు చేశారు. వాళ్లే వినూ మన్కడ్‌, పాలీ ఉమ్రిగర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ (మూడు సార్లు). 
  • ఇంగ్లాండ్‌కు ఇది రెండో భారీ పరాజయం. ఇప్పుడు 434 పరుగుల తేడాతో ఓడిపోగా... 1934లో 562 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
  • బజ్‌బాల్‌ ఎరా (స్టోక్స్‌ - మెక్‌కలమ్‌ కాంబో) వచ్చాక ఇంగ్లాండ్‌ వరుస టెస్టుల్లో ఓడిపోవడం ఇది రెండోసారి. 2023 యాషెస్‌ ఇలా వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని