Ranji Trophy: రంజీ ట్రోఫీ స్క్వాడ్‌లోనూ బంధుప్రీతి..? దిల్లీ జట్టులో ఆయుష్‌కు దక్కని చోటు

రంజీ ట్రోఫీలో (Ranji Trophy) రికార్డులతో పాటు ఓ అంశం క్రికెట్‌ వర్గాలను ఆందోళన పరుస్తోంది. బంధుప్రీతి కారణంగా ఓ ఆటగాడికి అన్యాయం జరిగిందనే వార్తలు వస్తున్నాయి.

Updated : 27 Jan 2024 16:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన దిల్లీ జట్టు ఎంపికపై ‘బంధుప్రీతి’ ఆరోపణలు వచ్చాయి. ఈ సీజన్‌లో ఆ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓటమి పాలైంది. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు సార్లు  ఆ జట్టు కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ జట్టులో కాస్త పేరున్న ఆటగాడు ఆయుష్‌ బదోని. గత మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై 41 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కానీ, ఇప్పుడు ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఐపీఎల్‌ స్టార్‌కు చోటు దక్కలేదు. మరోసారి దిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే ఆలౌటైంది.  యశ్ ధుల్ (47) మాత్రమే చేశాడు. 

దిల్లీ జట్టులోకి తమకు అనుకూలమైన ఆటగాడు క్షితిజ్‌ శర్మను తీసుకొనేందుకే బదోనికి చోటు కల్పించలేదనే ఆరోపణలు దిల్లీ జట్టుపై వస్తున్నాయి. క్షితిజ్‌ శర్మకు బీసీసీఐ మాజీ ఆఫీస్‌ బేరర్‌తో సత్సంబంధాలు ఉన్నాయని.. 15 మంది స్క్వాడ్‌లో ఉన్న ఆటగాడికే బీసీసీఐ మ్యాచ్‌ ఫీజులు వస్తాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కామెంట్లు వచ్చాయి. చివరికి మ్యాచ్‌ను చూసేందుకు కూడా అధికారులు, ఆటగాళ్లు ఉండే ప్రదేశానికి వచ్చేందుకు అనుమతి లేదు. దీంతో అతడిని హోటల్‌ గదికే పరిమితం చేయడం గమనార్హం.

‘‘క్షితిజ్‌ శర్మను ఆడించేందుకు ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. అందుకే, బదోనికి 15 మందిలోనూ అవకాశం లేకుండాపోయింది. కాబట్టి, బీసీసీఐ ఇచ్చే మ్యాచ్‌ ఫీజులు కూడా బదోనికి అందవు. మ్యాచ్‌ను చూడాలంటే వీఐపీ గ్యాలరీలో నుంచి మాత్రమే చూసే అవకాశం ఇచ్చారు. టీమ్‌ మేనేజర్స్‌ అతడికి భోజన ఏర్పాట్లు చేశారు. అందుకోసం బీసీసీఐ నుంచి ఎలాంటి చెల్లింపులు ఉండవు.  నెట్స్‌లోనూ ప్రాక్టీస్‌ చేయడానికి వీలులేదు. తదుపరి మ్యాచ్‌లో అవకాశం వచ్చి బదోని సెంచరీ సాధిస్తే.. అతడిని పక్కన పెట్టినవారి నోళ్లు మూయించినట్లవుతుంది’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని దిల్లీ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని