Team India: ‘ఐపీఎల్‌ కోసం సిద్ధమవుతున్నారా?’.. రంజీల్లో ఆడని ప్లేయర్లపై బీసీసీఐ అసంతృప్తి..!

ఫిట్‌గా ఉండి దేశవాళీ క్రికెట్‌లో ఆడకుండా వచ్చే ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ చేసుకుంటున్న వారిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Published : 12 Feb 2024 17:12 IST

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ జట్టుకు ఎంపిక కానివారు, రంజీల్లో ఆడని ఆటగాళ్లపై బీసీసీఐ కన్నెర్ర చేసేందుకు సిద్ధమైంది. గాయాలు, విరామం పేరుతో విశ్రాంతి తీసుకున్న క్రికెటర్లు ఫిట్‌గా ఉంటే తప్పకుండా రంజీల్లో ఆడాలని హెచ్చరిస్తోంది. ఒకవైపు సీనియర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె మళ్లీ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే.. ఇషాన్ కిషన్‌తోపాటు హార్దిక్‌ పాండ్య మాత్రం దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడంతోనే బీసీసీఐ ఈ నిర్ణయానికొచ్చినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆటగాళ్లకే చెప్పాలని బోర్డు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

‘‘జాతీయ జట్టుకు సెలక్ట్‌ కానివారు ఫిట్‌గా ఉంటే.. రంజీల్లో తమ రాష్ట్రాల జట్లకు ఆడాలి. ఫిట్‌నెస్‌కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే జాతీయ క్రికెట్‌ అకాడమీని సంప్రదించాలి. రాబోయే కొన్ని రోజుల్లో ఈ నిబంధనను బీసీసీఐ ఆటగాళ్లకు చెప్పనుంది. కేవలం ఎన్‌సీఏ మినహాయింపు ఇచ్చిన ప్లేయర్లు మాత్రమే రంజీల్లో ఆడకుండా ఉండే అవకాశం ఉంది. కొందరు జనవరి నుంచి వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నవారిని ఉద్దేశించే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది’’ అని బీసీసీఐ అధికారిక వర్గాలు తెలిపాయి. 

మానసికంగా అలసటకు గురి కావడంతో విరామం కావాలని తీసుకున్న ఇషాన్‌ కిషన్‌ ఇప్పటికీ రంజీల్లో ఆడటం లేదు. రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు ఇషాన్‌ మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీలో ఆడాల్సిందేనని స్పష్టంచేశాడు. కానీ, ఇషాన్‌ మాత్రం ఇంకా తన రాష్ట్ర క్రికెట్‌ సంఘాన్ని సంప్రదించలేదు. మరోవైపు ముంబయి ఇండియన్స్‌ కొత్త కెప్టెన్ హార్దిక్‌తో కలిసి ఇషాన్‌ కిషన్ ప్రాక్టీస్ చేస్తున్నాడని బీసీసీఐ దృష్టికి వచ్చినట్లు సమాచారం. కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో బోర్డు పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని