Virat Kohli: కోహ్లీ పరుగుల కరవులో ఉన్నాడు.. బ్యాటర్లకు ఈ సిరీస్‌ పీడ కల: రికీ పాంటింగ్‌

టెస్టుల్లో కొంతకాలంగా భారీ స్కోర్లు చేయలేక తడబడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) తిరిగి పుంజుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Updated : 06 Mar 2023 20:17 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శతకం బాది తిరిగి ఫామ్‌లోకి వచ్చిన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. టెస్టుల్లో మాత్రం ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు సెంచరీ బాది మూడేళ్లు దాటిపోయింది. టెస్టుల్లో చివరగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 111 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ ఆటతీరుపై క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానుల ఫోకస్‌ మరింత ఎక్కువైంది. అయితే, ఈ విషయంలో విరాట్‌ కోహ్లీకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) మద్దతుగా నిలిచాడు. ఇలాంటి గడ్డుకాలం నుంచి బయటపడటానికి ఛాంపియన్‌ ప్లేయర్లు ఎల్లప్పుడూ మార్గాన్ని అన్వేషిస్తారని, విరాట్ కోహ్లీ త్వరలోనే తిరిగి తన అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తాడని పాంటింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘కోహ్లీ విషయంలో నేను పదే పదే ఒకే విషయం చెబుతాను. ఛాంపియన్ ప్లేయర్లు ఎల్లప్పుడూ ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఏదోక మార్గాన్ని అన్వేషిస్తారు. ప్రస్తుతం అతడు పరుగుల కరవులో ఉన్నాడు. పెద్ద స్కోర్లు చేయకపోవచ్చు. కానీ త్వరలోనే అతడు పుంజుకుంటాడని మనం ఆశించాలి. కోహ్లీ కూడా వాస్తవాన్ని అర్థం చేసుకుంటాడనుకుంటున్నా. ఏ బ్యాటరైన పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే తాను రన్స్‌ చేయట్లేదనే విషయం అతడికే ఎక్కువగా తెలిసి ఉంటుంది. నేను విషయంలో ఆందోళన చెందను. ఎందుకంటే కోహ్లీ తిరిగి పుంజుకుంటాడని నమ్మకంతో ఉన్నా’ అని రికీ పాంటింగ్‌ వివరించాడు. 

బోర్డర్ గావస్కర్‌ ట్రోఫీ గురించి మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్ చూసి నేను ఎవరి ఫామ్‌పై ఓ అంచనాకు రాలేను. బ్యాటర్లకు ఈ సిరీస్ ఓ పీడకల. మొదటి రెండు టెస్టుల్లో ఓటమి నుంచి కోలుకుని మూడో టెస్టులో విజయం సాధించి ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని మనందరికీ తెలుసు. ఇది బంతి టర్న్ అవ్వడం వల్ల కాదు.. అకస్మాత్తుగా బంతి బౌన్స్ కావడం వికెట్‌పై నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. ఇలాంటి సమయంలో బ్యాటింగ్ చేయడం నిజంగా కష్టతరంగా ఉంటుంది’ అని పాంటింగ్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని