Virat Kohli: విరాట్‌కు తన ఫామ్‌పై పూర్తి క్లారిటీ ఉంది: రికీ పాంటింగ్‌

గతేడాది ఆసియా కప్‌ నుంచి ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ప్రస్తుత ఐపీఎల్‌లోనూ అదే ఊపును కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రికీ పాంటింగ్‌ అతడి బ్యాటింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 20 May 2023 10:31 IST

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో ఓవల్‌ మైదానం వేదికగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) మ్యాచ్‌ జరగనుంది. ఆ మ్యాచ్‌లో అత్యంత విలువైన వికెట్‌ విరాట్ కోహ్లీదే (Virat Kohli) అవుతుందని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అందులో విరాట్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య ఫైనల్‌ను చూసేందుకు వేచి ఉండటం కష్టంగా ఉందని, త్వరగా చూడాలనిపిస్తోందని పాంటింగ్‌ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ నేడు చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ సందర్భంగా దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌పై అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.

‘‘గత నెలలో బెంగళూరు వేదికగా ఆర్‌సీబీతో దిల్లీ ఆడినప్పుడు విరాట్ కోహ్లీతో కాసేపు ముచ్చటించా. ఆ సమయంలో విరాట్ చెప్పిన మాటలు నన్ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తన అత్యుత్తమ ఫామ్‌ను అందిపుచ్చుకున్నట్లు విరాట్‌ స్వయంగా చెప్పాడు. అతడి బ్యాటింగ్‌, క్రికెట్ కెరీర్‌ గురించి మాట్లాడుకున్నాం. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ను చూసినప్పుడు విరాట్ చెప్పింది నిజమేనని అనిపించింది. ఐపీఎల్‌లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అందుకే, వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కీలకంగా మారతాడు. ఆసీస్‌కు విరాట్ వికెట్ చాలా విలువైంది’’ అని పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు.

‘‘భారత్‌తో టెస్టు మ్యాచ్‌ అనగానే.. ప్రత్యర్థి బ్యాటర్లకు స్పిన్నర్లకు మధ్య పోరాటంగానే అభివర్ణిస్తుంటారు. ఓవల్‌ మైదానంలో ఈసారి కూడా అలాగే ఉండొచ్చు. పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రోజులు గడిచే కొద్ది స్పిన్‌కు అనుకూలంగా మారొచ్చు. తప్పకుండా నాలుగు లేదా ఐదో రోజుకు మ్యాచ్‌ వెళ్తుంది. ఇరు జట్ల మధ్య ఆసక్తికకర పోరు ఉండటం ఖాయం. భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఉన్నారు. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు’’ అని పాంటింగ్‌ తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్ కోహ్లీ 13 మ్యాచుల్లో 135.86 స్ట్రైక్‌రేట్‌తో 538 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని