Delhi Capitals: వారిద్దరు ఉంటారు.. మరి సహాయక సిబ్బంది కొనసాగింపుపైనే అనిశ్చితి?

దారుణ ప్రదర్శనతో దిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్ 2023 సీజన్‌ను (IPL 2023) ముగించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ నిలకడగా ఆడితే.. ఫిల్ సాల్ట్‌ అప్పుడప్పుడు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. కోచింగ్‌ స్టాఫ్‌పై వేటు పడుతుందనే వార్తల నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్‌ సహయజమాని ట్వీట్‌ చేశారు.

Published : 15 Jun 2023 16:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఘోర ప్రదర్శనతో ఐపీఎల్ 2023 సీజన్‌ను (IPL 2023) దిల్లీ క్యాపిటల్స్‌ తొమ్మిదో స్థానంతో ముగించింది. జట్టులో డేవిడ్ వార్నర్, ఫిల్‌ సాల్ట్, పృథ్వీ షా, మనీశ్‌ పాండే, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక కోచింగ్‌ స్టాఫ్‌లో మాస్టర్‌ మైండ్స్‌ రికీ పాంటింగ్‌ ప్రధాన కోచ్‌ కాగా.. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ మెంటార్‌గా వ్యవహరించాడు. అయినా, ఫలితాలు మాత్రం దారుణంగా ఉండటంతో విమర్శలు వచ్చాయి. రిషభ్‌ పంత్‌ జట్టులో లేకపోవడం కూడా దిల్లీపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో వచ్చే సీజన్‌ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టామని దిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం పేర్కొంది. 

ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్‌ను కొనసాగిస్తారా.. లేదా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రికీ కొనసాగింపుపై దిల్లీ ఫ్రాంచైజీ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ సూచనాప్రాయంగా కీలక విషయాలను వెల్లడించారు. గంగూలీ, రికీ నేతృత్వంలో వచ్చే ఏడాది దిల్లీ క్యాపిటల్స్‌ బలంగా ముందుకొస్తుందని పేర్కొన్నారు. ‘‘వచ్చేఏడాది ఐపీఎల్‌ సన్నద్ధత కొనసాగుతోంది. గంగూలీ, రికీ పాంటింగ్‌ మాకు మద్దతుగా ఉంటారు. నేను, కిరణ్‌ గ్రంధి ఫ్రాంచైజీని ముందుకు తీసుకుపోవడానికి కష్టపడుతున్నాం. తప్పకుండా వచ్చే సీజన్‌లో టాప్‌లో నిలబడతాం’’ అని జిందాల్‌ ట్విటర్ వేదికగా తెలిపారు. 

మెంటార్‌గా సౌరభ్‌ గంగూలీ, ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్‌ ఉంటాడనే విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ.. సహాయక కోచ్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. షేన్ వాట్సన్‌, జేమ్స్ హోప్స్‌ కొనసాగింపు  కష్టమేననే దిల్లీ క్యాపిటల్స్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఫీల్డింగ్‌ కోచ్ బిజు జార్జ్‌ కూడా ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే, ప్రవీన్‌ ఆమ్రే, అజిత్ అగర్కార్‌ మాత్రం జట్టుతోపాటు ఉంటారని సమాచారం. అయితే, దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని