Rinku Singh: రింకు సింగ్‌.. సూపర్‌ ఫినిషర్‌

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో కుర్రాళ్లతో నిండిన టీమ్‌ఇండియా సవాలుకు సై అంది. విశాఖలో తొలి టీ20..! ఛేదన చివర్లో భారత్‌తడబడింది.

Updated : 05 Dec 2023 09:33 IST

అదరగొడుతున్న రింకు

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో కుర్రాళ్లతో నిండిన టీమ్‌ఇండియా సవాలుకు సై అంది. విశాఖలో తొలి టీ20..! ఛేదన చివర్లో భారత్‌తడబడింది. అప్పుడు ఆ ఆటగాడు నిలబడ్డాడు. ఆఖరి బంతికి ఒక్క పరుగు కావాల్సి వస్తే సిక్సర్‌ కొట్టాడు. నోబాల్‌ కావడంతో సిక్సర్‌ లెక్కలోకి రాకపోయినా.. అతని నైపుణ్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. రెండో టీ20లోనూ అతని మెరుపులే. నాలుగో మ్యాచ్‌లోనూ అదరగొట్టి జట్టు సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు.. టీమ్‌ఇండియా కొత్త ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న రింకు సింగ్‌. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇప్పుడు చర్చంతా అతని గురించే!

ఈనాడు క్రీడావిభాగం

వచ్చే ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్‌. ఈ మెగా టోర్నీ దిశగా భారత జట్టులో యువ రక్తాన్ని ఎక్కిస్తున్నారు. నిరుడు టీ20 ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి లాంటి సీనియర్లు పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. టీ20 జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా యువ ఆటగాళ్లు సాగుతున్నారు. ఇందులో ముఖ్యంగా 26 ఏళ్ల రింకు సింగ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఫినిషర్‌గా ఎదుగుతూ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. టీమ్‌ఇండియాకు ధోని తర్వాత మరో మేటి ఫినిషర్‌గా రింకు పేరు తెచ్చుకుంటున్నాడు. ఫినిషర్‌గా 2024 పొట్టి కప్పులో ఆడే భారత జట్టులో ఉండే ఆటగాడిగానూ కనిపిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో 52.50 సగటుతో అతను 105 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 175గా ఉంది. చేసిన పరుగుల కంటే కూడా అవి సాధించిన తీరు, అప్పటి పరిస్థితులు రింకూను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

కంగారూలపై సత్తాచాటి

కంగారూ జట్టుతో సిరీస్‌లో రింకు తన సామర్థ్యాన్ని చాటాడు. మొదట బ్యాటింగ్‌ చేసినప్పుడు జట్టుకు భారీ స్కోరు అందించడం, ఛేదనలో తీవ్ర ఒత్తిడిలోనూ భారీ షాట్లతో జట్టును గెలిపించడం.. ఇదీ ఓ ఫినిషర్‌ బాధ్యత. ఇప్పుడు రింకు అదే చేస్తున్నాడు. ఆసీస్‌తో తొలి టీ20లో 14 బంతుల్లో అజేయంగా 22 పరుగులతో జట్టును గెలిపించే మైదానం వీడాడు. దీంతో టీ20ల్లో భారత్‌ తన అత్యధిక ఛేదన (209) రికార్డు నమోదు చేసింది. రెండో టీ20లో 9 బంతుల్లోనే అజేయంగా 31 పరుగులు చేసి జట్టు స్కోరును 230 దాటించడంలో రింకు కీలక పాత్ర పోషించాడు. నాలుగో టీ20లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 29 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ నెగ్గడంలో ప్రధాన భూమిక అతనిదే. పవర్‌ హిట్టింగ్‌ నైపుణ్యాలు, క్రీజులో బలంగా నిలబడి బంతిని అమాంతం స్టాండ్స్‌లో పడేసే ప్రతిభ అతని సొంతం. బౌలర్‌ ఎవరన్నదానితో సంబంధం లేకుండా తొలి బంతి నుంచే బాదగల ఆటగాడతను. పైగా ఎడమ చేతి వాటం కూడా కావడం మరింతగా కలిసొచ్చేదే. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటం, చెక్కు చెదరని   ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం, అలవోకగా భారీ షాట్లు ఆడటం అతనికి బ్యాటుతో పెట్టిన విద్య. నిటారుగా తల ఎత్తి నిలబడి, ప్రశాంతమైన బుర్రతో పని పూర్తిచేస్తాడు. ఆఖరి ఓవర్లలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా షాట్లు ఆడగలమని ధోని ఇచ్చిన సలహాను పాటిస్తూ దూసుకెళ్తున్నాడు. బంతి వచ్చేంతవరకూ క్రీజులో బలంగా నిలబడి.. ఆ తర్వాత బంతికి అనుగుణంగా కదులుతూ బౌండరీలు సాధిస్తున్నాడు. రెండో టీ20లో ఆఖరి ఓవర్లో ఎలిస్‌ ఎక్కువ ఎత్తులో వేసిన ఓ ఫుల్‌టాస్‌ బంతిని మిగతా ఆటగాళ్లగైతే ముందుగానే గాల్లోకి ఆడాలని చూసేవాళ్లేమో. కానీ చివరి వరకూ ఓపికతో ఉన్న రింక్‌.. బంతిని కీపర్‌, షార్ట్‌థర్డ్‌ మధ్యలో నుంచి ఫోర్‌గా మలిచాడు. అంతకుముందు అబాట్‌ ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు దంచాడు. బౌలర్‌    వైవిధ్యంగా బంతులేస్తే రింకు కూడా వైవిధ్యమైన షాట్లతో అదరగొట్టాడు. ఏదో గుడ్డిగా కొట్టేయడం, బలంగా బాదేయడం కాకుండా.. బంతిని కచ్చితంగా అంచనా వేసి మరీ బౌండరీ మార్గం చూపిస్తున్నాడు.

నిలకడ సాగిస్తే..

ఫినిషర్‌ అంటూ, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఆడించాలంటూ రింకు పేరు మార్మోగుతోంది. కానీ అతను పొట్టి కప్పులో ఆడాలంటే సవాళ్లను దాటి ముందుకు సాగాలి. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌ మరో ఆరు టీ20లు మాత్రమే ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆ తర్వాత 2024 ఐపీఎల్‌లోనూ స్థిరంగా పరుగుల వేటలో సాగితే రింకూకు జట్టులో స్థానం సుస్థిరమయ్యే అవకాశముంది. ‘‘టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో చోటు కోసం పోటీపడే ఆటగాళ్లలో రింకు ఒకడనడంలో సందేహం లేదు. కానీ స్థానం కోసం రింకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన, ఆ తర్వాత ఐపీఎల్‌లో అతని ప్రదర్శనను బట్టి టీ20 ప్రపంచకప్‌లో చోటు ఆధారపడి ఉంటుంది’’ అని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా పేర్కొన్నాడు. ధోని, యువరాజ్‌ లాగా మంచి ఫినిషర్‌గా ఎదిగే సామర్థ్యం రింకూకు ఉందని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్‌ కిరణ్‌ మోరె కూడా చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్థంగా బ్యాటింగ్‌ చేయగలనని రింకు నిరూపించుకుంటున్నాడు. హార్దిక్‌ పాండ్య ఉండొచ్చు, రిషబ్‌ పంత్‌ జట్టులోకి రావొచ్చు, సూర్యను బ్యాటింగ్‌ ఆర్డర్లో కింద ఆడించొచ్చు.. కానీ వీళ్లు పోషించాల్సిన పాత్రలు వేరు. రింకు ఇలాగే దూకుడు కొనసాగిస్తే ఫినిషర్‌గా కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ ఆడతాడనడంలో సందేహం లేదు.

ఆ సిక్సర్లతో..

ఇప్పుడు అంతర్జాతీయ టీ20ల్లో హాట్‌ టాపిక్‌గా మారిన రింకు సింగ్‌ ఈ స్థాయికి చేరడానికి కారణం ఆ అయిదు సిక్సర్లు. అవును.. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై మ్యాచ్‌లో కోల్‌కతా విజయానికి చివరి అయిదు బంతుల్లో 28 పరుగులు అవసరమవగా.. రింకు వరుసగా అయిదు సిక్సర్లతో జట్టును  గెలిపించిన దృశ్యాలను అంత త్వరగా మర్చిపోలేం. 2018 నుంచే అతను ఐపీఎల్‌ ఆడుతున్నా.. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అతని కెరీర్‌ గమనమే మారిపోయింది. అతను కొట్టిన సిక్సర్లలాగే కెరీర్‌ కూడా జోరందుకుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 149.52 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేసిన రింకు.. ఈ సీజన్‌లో కోల్‌కతా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే లీగ్‌లో ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని అతణ్ని టీమ్‌ఇండియాకు ఎలా ఎంపిక చేస్తారనే ప్రశ్నలూ వినిపించాయి. కానీ ఇప్పుడు ఆటతోనే జవాబిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్‌తో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతను.. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌ల్లో 180 పరుగులు చేశాడు. 60గా ఉన్న సగటు అతని నిలకడను, 187.50గా ఉన్న స్ట్రైక్‌రేట్‌ అతని బాదుడును సూచిస్తున్నాయి. ఆసియా క్రీడల్లోనూ రింకు ఫినిషర్‌గా మెరుపులు మెరిపించాడు. మరోవైపు దేశవాళీల్లోనూ ఉత్తరప్రదేశ్‌ తరపున నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో యూపీ తరపున 7 ఇన్నింగ్స్‌ల్లో 170.66 స్ట్రైక్‌రేట్‌తో 256 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని