IND vs SA: రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పిందే ఫాలో అవుతున్నా: రింకు సింగ్‌

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ (IND vs SA) కోసం యువ భారత్‌ సిద్ధమవుతోంది. జట్టులో ఎక్కువమంది కుర్రాళ్ళు ఉండటం విశేషం.ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు కఠిన సవాల్‌ మాత్రం తప్పదు. ఎందుకంటే సఫారీ గడ్డపై రాణించడం తేలికైన విషయం కాదు.

Published : 09 Dec 2023 14:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆదివారం నుంచి భారత్ - దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పుడందరి దృష్టి మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకు సింగ్‌పై ఉంది. నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న అతడు ఆసీస్‌తో పొట్టి సిరీస్‌లో అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ కీలక పాత్ర పోషించేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) తనతో సంభాషించినట్లు రింకు సింగ్‌ (Rinku Singh) వెల్లడించాడు. రింకు సింగ్ ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. 

‘‘దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మా తొలి ప్రాక్టీస్ సెషన్ అద్భుతంగా జరిగింది. వాతావరణం కూడా చాలా బాగుంది. రాహుల్‌ ద్రవిడ్‌తో పని చేసే అవకాశం రావడం అదృష్టం. మా మధ్య జరిగిన సంభాషణ సమయంలో ఒకే మాట చెప్పాడు. ‘సహజంగా నువ్వు ఎలా ఆడతావో అలానే షాట్లు కొట్టేయ్‌’ ఇదీ నాకు ఇచ్చిన సందేశం. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుందని కూడా సూచించాడు. అలాంటి స్థానంలో ఆడాలంటే సవాల్‌తో కూడుకున్నదే. ఏమాత్రం కుదురుకోవడానికి సమయం ఉండదు. అయితే వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలని ద్రవిడ్‌ హితబోధ చేశాడు. 

నేను యూపీ తరఫున ఇదే స్థానంలో చాన్నాళ్లు ఆడా. నాకెంతో కలిసొచ్చిన స్థానం. నాలుగైదు వికెట్లు పడిన తర్వాత ఆడటమంటే ఎలాంటి బ్యాటర్‌కైనా కష్టమే. కానీ, దూకుడుగా ఆడటం చాలా ఇష్టం. దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఇదే ఫాలో అవుతా. ఇక జట్టులో రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌, జితేశ్‌, అవేశ్‌ ఖాన్‌తో కంపెనీ చాలా బాగుంటుంది. మైదానం ఆవల కూడా ఒకరికొకరం కలిసిపోతాం. క్రికెట్‌లో ఇది చాలా ముఖ్యం. అలాగే ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఉండాలి. దేశం కోసం చాలాకాలం ఆడాలంటే ఫిట్‌గా ఉండటం తప్పదు’’ అని రింకు సింగ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని