Shubham Dubey: గ్లవ్స్‌ కొనలేని స్థాయి నుంచి.. ఐపీఎల్ వేలంతో కోటీశ్వరుడయ్యాడు..

క్రికెట్‌ అంటే ఎనలేని ప్రేమ ఉన్నప్పటికీ.. గ్లవ్స్‌ కొనేందుకు కూడా డబ్బుల్లేని పరిస్థితి. కానీ, మాజీ క్రికెటర్‌ సాయంతో ఆటలో రాణించి.. ఐపీఎల్‌ వేలంలో కోట్ల రూపాయల ధర పలికాడు. 

Updated : 20 Dec 2023 17:27 IST

తండ్రి నడుపుతోంది పాన్‌షాప్‌.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు.. అసలు క్రికెటర్‌గా ఎదిగే పరిస్థితే లేదక్కడ. కానీ ఆ కుర్రాడు మాత్రం ఆశలను చంపుకోలేదు. ఓ సీనియర్‌ సాయంతో ముందుకెళ్లాడు. క్రికెట్లో పేరు తెచ్చుకున్నాడు. ఈ పట్టుదలే అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఐపీఎల్‌లో ఏకంగా రూ.5 కోట్లకుపైనే పలికే అవకాశాన్ని కల్పించింది. ఈ కుర్రాడే శుభమ్‌ దూబె (Shubham Dubey). తాజాగా ఐపీఎల్‌ (IPL) వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) అతడిని రూ. 5.8 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. 

సుదీప్‌ సాయంతో

నాగ్‌పుర్‌కు చెందిన శుభమ్‌.. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి బద్రీప్రసాద్‌ దూబె పాన్‌ షాప్‌ను నిర్వహించేవాడు. కుటుంబం పెద్దది కావడంతో ఆ సంపాదన ఏమాత్రం సరిపోయేది కాదు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌ను ఎంతో ప్రేమించే శుభమ్‌ మాత్రం ఎప్పటికైనా ఈ ఆటలో ఓ స్థాయికి వెళ్లాలని కలలు కన్నాడు. ఇది అంత తేలిక కాదని అతడికి బాగా తెలుసు. డబ్బులు ఉంటేనే ఈ ఆటలో ముందుకెళ్లగలడని కూడా అర్థం చేసుకున్నాడు. 

విదర్భ మాజీ ఆటగాడు సుదీప్‌ జైస్వాల్‌ పరిచయం కావడం దూబె కెరీర్‌ను మలుపు తిప్పింది. శుభమ్‌ను ఎంతో ప్రోత్సహించిన సుదీప్‌.. అతడి పరిస్థితిని చూసి కిట్‌ అందించాడు. ఆరంభంలో టోర్నీలకు వెళ్లేందుకు డబ్బులు సాయం చేశాడు. దీంతో విదర్భ అండర్‌-19, అండర్‌-23 జట్లలో చోటు దక్కించుకున్న శుభమ్‌.. సత్తా చాటి సీనియర్‌ జట్టులోకి వచ్చాడు. సీనియర్‌ జట్టు తరఫున స్థిరంగా రాణిస్తున్నా ఇన్నాళ్లూ అతడికి గుర్తింపు మాత్రం రాలేదు. వయసు కూడా 29 ఏళ్లు వచ్చేయడంతో ఇక అవకాశాలు కూడా కష్టమే అనిపించిన దశ అది. కానీ అతడికి అదృష్టం కలిసొచ్చింది.

ముస్తాక్‌అలీ టోర్నీలో సత్తా చాటి

ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్లో 7 మ్యాచ్‌ల్లో 222 పరుగులు చూసి ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా 180పైన స్ట్రైక్‌ రేట్‌తో పరుగులు సాధించడం దూబెకు కలిసొచ్చింది. బెంగాల్‌పై 20 బంతుల్లో 58 పరుగుల ఇన్నింగ్స్‌ హైలైట్‌. లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి పవర్‌ హిట్టింగ్‌తో పరుగులు వరద పారించగల సత్తా ఉన్న శుభమ్‌ ఇటీవల గువహాటి లీగ్‌లోనూ అదరగొట్టాడు. దూకుడుగా ఆడే శుభమ్‌ కోసం వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. రూ.20 లక్షలు కనీస ధరగా ఉన్న తన కోసం ఫ్రాంఛైజీలు పోటీపడుతుంటే శుభమ్‌ కూడా నమ్మలేకపోయాడట. అలా ధర పెరుగుతూ పోయి చివరికి రాజస్థాన్‌ ఏకంగా రూ.5.8 కోట్లతో దూబెను ఎగరేసుకుపోయింది. కనీస ధరకైనా తనను తీసుకుంటారని ఊహించని శుభమ్‌కు ఇది నిజంగా ఇది పెద్ద జాక్‌పాటే.

రాజస్థాన్‌ రాయల్స్‌ యశస్వి జైస్వాల్, రవిచంద్రన్‌ అశ్విన్‌ కంటే శుభమ్‌ దూబె సంపాదనే ఎక్కువ కావడం విశేషం. ‘‘ఒకప్పుడు గ్లవ్స్‌ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. కానీ సుదీప్‌ సార్‌ వల్లే ఈ స్థితిలో ఉన్నా.. వేలంలో ఇంత డబ్బులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది’’ అని శుభమ్‌ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. బట్లర్, సంజు శాంసన్‌ లాంటి స్టార్లతో డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకునేందుకు అతడు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని