Roger Federer: కఠిన ప్రత్యర్థులను ఎదుర్కొని.. తొలి ప్లేయర్‌గా నిలిచి..!

టెన్నిస్‌ కెరీర్‌లో 310 వారాలపాటు నంబర్‌వన్‌ స్థానం.. వరుసగా 237 వారాలపాటు టాప్‌-ర్యాంకర్‌..

Updated : 18 Sep 2022 17:08 IST

ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన రోజర్ ఫెదరర్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టెన్నిస్‌ కెరీర్‌లో 310 వారాలపాటు నంబర్‌ వన్‌ స్థానం.. వరుసగా 237 వారాలపాటు టాప్‌-ర్యాంకర్‌.. కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లు.. మరి ఇలాంటివన్నీ సాధించినప్పుడూ వివాదాలూ ఉండాలిగా.. కానీ స్విస్‌ దిగ్గజం మాత్రం వాటికి అతీతుడు. ఓడిపోయినా.. గెలిచినా ప్రవర్తించే తీరు ఒకేలా ఉంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా అరుదు.. ఈ ఉపోద్ఘాతమంతా స్విట్జర్లాండ్‌ దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు రోజర్ ఫెదరర్ గురించే. ఇవాళ తన ప్రొఫెషనల్‌ ఆటకు వీడ్కోలు పలికాడు ఈ దిగ్గజ ఆటగాడు. ఈ సందర్భంగా ఫెదరర్‌ గురించి ప్రత్యేక కథనం.. 

1981 ఆగస్ట్‌ 8న స్విస్‌లోని బసేల్‌లో జన్మించిన రోజర్ ఫెదరర్‌.. 17 ఏళ్లకు (1998) ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా మారాడు. అయితే స్విస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యాడు. 2001 వింబుల్డెన్‌లో టాప్‌ ఆటగాడు పీట్ సంప్రాస్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. అయితే అక్కడ ఓటమిపాలై వెనుదిరిగాడు. ఈ క్రమంలో ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా మారిన ఐదేళ్లకు తొలి గ్రాండ్‌స్లామ్‌ (2003)ను ఫెదరర్ సొంతం చేసుకున్నాడు. ఇక 2004లో అయితే ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డెన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లను సాధించాడు. అలాగే 2006లోనూ మూడు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకోవడం విశేషం. తన కెరీర్‌లో ఒకే ఒక్కసారి మాత్రమే ఫ్రెంచ్‌ ఓపెన్‌ను అందుకున్నాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ డబుల్స్‌ విభాగంలో (ఫెదరర్‌-స్టానిస్లాస్‌) స్విస్‌కు స్వర్ణం పతకం అదించాడు. అదీనూ 2009లో రాబిన్‌ సోడర్లింగ్‌పై విజయం సాధించాడు. చివరిసారిగా 2018లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన ఫెదరర్‌ అప్పటి నుంచి గాయాలతో సహవాసం చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లు.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ (6), ఫ్రెంచ్‌ ఓపెన్ (1), వింబుల్డెన్‌ (8), యూఎస్‌ ఓపెన్ (5) గెలుచుకున్నాడు. 

అందరూ భీకర ప్రత్యర్థులే.. 

రోజర్‌ ఫెదరర్‌ తన కెరీర్‌ను ప్రారంభించిన సమయంలో ఆండ్రూ అగస్సీ, సఫిన్, నల్బందీయన్‌, హెవిట్, ఆండీ రాండిక్‌, ఆండీ ముర్రే, రఫేల్‌ నాదల్, నొవాక్ జకోవిచ్‌.. ఇలా ప్రతి ఒక్కరూ కఠిన ప్రత్యర్థులే. అయితేనేం వారందరినీ దాటుకొని 20 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గడం సాధారణ విషయమేమీ కాదు. జకోవిచ్‌తో 50 సార్లు, రఫేల్‌ నాదల్‌తో 40 సార్లు, హెవిట్‌తో 27 సార్లు, ఆండీ ముర్రేతో 25 సార్లు, రాడిక్‌తో 24, నల్బందీయన్‌తో 19 సార్లు తలపడ్డాడు. అయితే జకోవిచ్‌, నాదల్‌పై కాస్త వెనుకంజ వేసినప్పటికీ.. ఇతర టాప్ ఆటగాళ్లపై పైచేయి సాధించాడు. జకోవిచ్‌, రఫేల్‌ నాదల్‌ కంటే ముందే 20 గ్రాండ్‌స్లామ్‌లను గెలిచిన ఆటగాడిగా ఫెదరర్‌ రికార్డు సృష్టించాడు. 

ఫెదరర్‌కు అరుదైన గౌరవం

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న ఫెదరర్‌ దాదాపు పదేళ్లపాటు టాప్‌ ఆటగాడిగా పేరొందాడు. స్విట్జర్లాండ్‌లో రోజర్‌ పేరిట కాయిన్‌ విడుదలైంది. జీవించి ఉన్న వ్యక్తికి కాయిన్‌ విడుదల చేయడం ఫెదరర్‌ విషయంలోనే చోటు చేసుకోవడం విశేషం. అత్యధికంగా సంపాదించే అథ్లెట్లలో  2012 నుంచి 2021వరకు టాప్‌-10లో ఫెదరర్‌ నిలిచాడు. 2020లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. దాదాపు 106 మిలియన్‌ డాలర్ల ఆదాయం పొందినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని