Rohit Sharma: రోహిత్‌.. దశ సహస్ర వీర!

లావుగా ఉన్నాడు.. ఫిట్‌నెస్‌ లేదు? క్రికెట్‌కు పనికొస్తాడా? అనే మాటలు! మిడిలార్డర్‌లో రాణించడం లేదు.. అతణ్ని పక్కన పెట్టాల్సిందేనన్న వాదనలు!

Published : 16 Sep 2023 14:31 IST

హిట్‌మ్యాన్‌ అంటే మాటలా?

లావుగా ఉన్నాడు.. ఫిట్‌నెస్‌ లేదు? క్రికెట్‌కు పనికొస్తాడా? అనే మాటలు! మిడిలార్డర్‌లో రాణించడం లేదు.. అతణ్ని పక్కన పెట్టాల్సిందేనన్న వాదనలు! అతని కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు.. ఒడుదొడుకులు! కానీ అతనెప్పుడూ ఆగిపోలేదు. విమర్శలకు కుంగిపోలేదు! ఆనందంగా ఆటను ఆస్వాదించడమే అతనికి తెలుసు. ఓపెనర్‌గా మారినప్పటి నుంచి పరుగుల వేటలో సాగడమే అతని అలవాటు. వేలెత్తి చూపిన వాళ్లకు ఆటతో.. నోరెత్తి మాట్లాడిన వాళ్లకు పరుగులతో సమాధానమిచ్చాడు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమైన మైలురాయి చేరుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతనే.. దశ సహస్ర (పది వేలు) వీరుడు రోహిత్‌ శర్మ.

చాలా అరుదుగా..

వన్డేల్లో రోహిత్‌ బ్యాటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 నుంచి టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్‌ రాణిస్తున్నాడు. కానీ, వన్డేల్లో అతని ముద్ర ఎప్పుడో పడింది. అతని అద్భుతమైన బ్యాటింగ్‌ విన్యాసాలకు వన్డేలు ఎప్పుడూ వేదికగా నిలుస్తున్నాయి. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా కెరీర్‌ మొదలెట్టి.. ఇప్పుడు ఓపెనర్‌గా పరుగుల వేటలో సాగుతున్నాడు. తాజాగా వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో అతనీ ఘనత సాధించాడు. అతి కొద్దిమంది ఆటగాళ్లు మాత్రమే సాధించగలిగిన రికార్డు ఇది. భారత క్రికెట్లో సచిన్‌ (18,426), కోహ్లి (13,026), గంగూలీ (11,363), ద్రవిడ్‌ (10,889), ధోని (10,773) మాత్రమే రోహిత్‌ కంటే ముందు ఈ మైలురాయి చేరుకున్నారు. ప్రపంచ క్రికెట్లో చూసుకుంటే రోహిత్‌ కంటే ముందు 14 మంది ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలు చాలు వన్డేల్లో 10 వేల పరుగుల రికార్డును చేరుకోవడం ఎంత కష్టమో చెప్పేందుకు. అలాగే అత్యంత వేగంగా వన్డేల్లో 8 వేల పరుగులు చేసిన ఓపెనర్‌ రోహితే. ఓపెనర్‌గా 162 వన్డేల్లో 50కి పైగా సగటుతో సాగుతున్న ఆటగాడూ అతనే. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ కంటే ముందు 36 ఏళ్ల రోహిత్‌ 248 వన్డేల్లో 48.93 సగటుతో 10,031 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 51 అర్ధసెంచరీలున్నాయి. అతను ఏకంగా 286 సిక్సర్లు బాదడం విశేషం. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో అఫ్రిది (351), గేల్‌ (331) తర్వాతి స్థానం రోహిత్‌దే.

బౌలర్‌గా మొదలై..

చిన్నతనంలో క్రికెట్‌ సాధన కోసం ముంబయి లోకల్‌ రైళ్లలో తన పొడవున్న కిట్‌ బ్యాగును వేసుకొని ప్రయాణించిన రోహిత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే క్రికెటర్లలో ఒకడు. మొదట ఆఫ్‌ స్పిన్నర్‌గా కెరీర్‌ మొదలెట్టిన రోహిత్‌.. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసేవాడు. అండర్‌-17 స్థాయి వరకూ బౌలర్‌గానే ఆడాడు. కానీ ఓ గాయం కారణంగా అతను బ్యాటర్‌గా మారాడు. దేశవాళీల్లో మిడిలార్డర్‌లో సత్తాచాటాడు. ఓపెనర్‌గా అదరగొట్టాడు. 2007లో వన్డే అరంగేట్రం చేశాడు. కానీ మిడిలార్డర్‌లోనే ఆడేవాడు. నిలకడ లేకపోవడం, స్థానం కోసం పోటీ కారణంగా జట్టులోకి వస్తూ వెళ్తుండేవాడు. 2011 ప్రపంచకప్‌కు జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. కానీ ఆగిపోలేదు. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీˆలో అతణ్ని ఓపెనర్‌గా ధోని ఆడించడంతో రోహిత్‌ దశ తిరిగింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. తుపానుకు ముందు ప్రశాంతతలా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ మొదలెట్టే రోహిత్‌.. క్రమంగా అల్పపీడనం తుపానుగా మారినట్లు వేగం అందుకుంటాడు. ఆ తర్వాత పరుగుల సునామీలో ప్రత్యర్థులను ముంచెత్తుతాడు. పుల్‌ షాట్‌తో అతను కొట్టే సిక్సర్ల సొగసు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆ డబుల్‌ సెంచరీలు..

వన్డేలో డబుల్‌ సెంచరీ సాధించడం గగనమే. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు వన్డేలో ఈ ఘనతను అందుకున్న ఏకైక ఆటగాడు రోహిత్‌. వన్డే క్రికెట్లో అతని ఆధిపత్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? వన్డేలో అత్యధిక స్కోరు (264) అతనిదే. 2007లో 16.5 బంతులకు ఒకసారి రోహిత్‌ వికెట్‌  కోల్పోతే.. 2023కి వచ్చేసరికి అది 115.5 బంతులకు చేరిందంటే వన్డేల్లో అతని ఎదుగుదల ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019 వన్డే ప్రపంచకప్‌లో జట్టును గెలిపించడానికి రోహిత్‌ చేయాల్సిందంతా చేశాడు. విశ్వరూపం ప్రదర్శిస్తూ ఆ టోర్నీలో ఏకంగా అయిదు సెంచరీలు చేసి ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కానీ సెమీస్‌లో కివీస్‌ చేతిలో ఓటమితో కన్నీళ్లలో మునిగిపోయాడు. ఈ సారి సొంతగడ్డపై కెప్టెన్‌గా జట్టుకు విజయాన్ని అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. వచ్చే నెలలో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు సారథిగానూ జట్టును విజయతీరాలకు చేర్చాలన్నది అతని లక్ష్యం. అదే జరిగి.. భారత్‌ విశ్వవిజేతగా నిలిస్తే రిటైర్మెంట్‌ దిశగా సాగుతున్న రోహిత్‌కు ఇంతకంటే ఘనమైన ముగింపు ఇంకేముంటుంది? వన్డే ప్రపంచకప్‌తో అతని కెరీర్‌ పరిపూర్ణమవుతుంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని