Rohit Sharma: జడేజాతో కష్టం.. ప్రతి బంతికి అప్పీల్‌ చేయమంటాడు: రోహిత్‌ శర్మ

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా (Team India) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ డీఆర్‌ఎస్‌లను సరిగ్గా వినియోగించుకోలేదు. ఈ విషయంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడాడు.

Published : 08 Mar 2023 17:52 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమ్ఇండియా (Team India)కు మూడో టెస్టులో కంగారులు షాకిచ్చారు. స్పిన్‌ అస్త్రంతో చెలరేగి భారత్‌ను ఓడించారు. ఈ మ్యాచ్‌లో స్వయం తప్పిదాలు  కూడా టీమ్‌ఇండియా ఓటమికి కారణమయ్యాయి. మూడో టెస్టులో డీఆర్‌ఎస్‌ (DRS)లను సరిగ్గా వినియోగించుకోలేదు. మొదటి రోజే అన్ని రివ్యూలను వినియోగించుకుని తర్వాత సమీక్ష అవకాశాలు లేక ఇబ్బందిపడింది. మూడో టెస్టులో డీఆర్‌ఎస్‌ విషయంలో భారత్‌ సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నాలుగో టెస్టులో ఈ తప్పిదాలను సరిదిద్దుకుంటామని కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) చెప్పాడు.

‘అవును మేం గత మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అంగీకరిస్తున్నాం. డీఆర్‌ఎస్‌కు వెళ్లడం కష్టం. ముఖ్యంగా రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో. అతను ప్రతి బంతిని ఔట్ అని భావిస్తాడు. ఆ మ్యాచ్‌లో చేసిన తప్పులను నాలుగో టెస్టులో సరిదిద్దికుంటామని ఆశిస్తున్నాం. దీనిపై మేం చర్చించుకుంటాం. ఈ మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ను సరిగ్గా వినియోగించుకుంటామని భావిస్తున్నాం’ అని రోహిత్‌ శర్మ వివరించాడు. మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోవడంతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final)కు దూసుకెళ్లాలని టీమ్‌ఇండియా భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని