Rohit - Shikhar : 5 వేల పరుగులు చేసిన నాలుగో జోడీ.. టాప్‌ ప్లేస్‌లో ఎవరంటే?

క్రికెట్‌లో ఏ జట్టుకైనా ప్లస్‌ పాయింట్‌ ఓపెనింగ్‌ జోడీనే..  ఆరంభంలో శుభారంభం దక్కితే మిగతా బ్యాటర్లు చెలరేగేందుకు అవకాశం దొరుకుతుంది. ప్రపంచ క్రికెట్‌లో..

Published : 14 Jul 2022 01:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌లో ఏ జట్టుకైనా ప్లస్‌ పాయింట్‌ ఓపెనింగ్‌ జోడీనే.. ఆరంభంలో మంచి పరుగులు రాబడితే మిగతా బ్యాటర్లు చెలరేగేందుకు అవకాశం దొరుకుతుంది. ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్లు సచిన్‌-సౌరభ్‌ గంగూలీ ఓపెనింగ్‌ జోడీని మించిన మరొక భాగస్వామ్యం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు రోహిత్ శర్మ - శిఖర్ ధావన్‌ జోడీ కూడా అద్భుతంగా ఆడుతోంది. వీరిద్దరూ కలిసి ఐదు వేల పరుగులను జోడించారు. వీరి కంటే ముందు మరో మూడు జోడీలు మాత్రమే ఆ మార్క్‌ను దాటాయి. అదేవిధంగా టాప్‌ -5 పార్టనర్‌షిప్‌ల గురించి తెలుసుకొందాం.. 

సచిన్ - గంగూలీ 

ఓపెనింగ్‌లో అత్యధిక పరుగులను జోడించిన బ్యాటర్లుగా టీమ్‌ఇండియా దిగ్గజాలు సచిన్‌ తెందూల్కర్‌ - సౌరభ్‌ గంగూలీ చిరస్థాయిగా నిలిచారు. వీరిద్దరూ కలిసి 136 ఇన్నింగ్స్‌ల్లో 6,609 పరుగులు చేశారు. ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 258 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ రికార్డును టచ్‌ చేయడం భవిష్యత్తులోనూ కష్టమే.

గిల్‌క్రిస్ట్‌ - మ్యాథ్యూ హేడెన్‌

మొన్నటి వరకూ క్రికెట్‌ను శాసించిన దేశాల్లో విండీస్‌ తర్వాత ఆసీస్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది. దీనికి ప్రధాన కారణం ఓపెనింగ్‌ జోడీ. గిల్‌క్రిస్ట్‌-హేడెన్ కలిసి ఎన్నో మ్యాచుల్లో జట్టుకు విజయాలను అందించారు. వీరిద్దరూ కలిసి 114 ఇన్నింగ్స్‌ల్లో తొలి వికెట్‌కు 5,372 పరుగులను జోడించారు.

గార్డన్‌ గ్రీనిడ్జ్‌ - డెస్మాండ్ హైన్స్‌ 

90వ దశకం వరకు క్రికెట్‌లో విండీస్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఆ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా హేమాహేమీలతో ఉండేది. గ్రీనిడ్జ్‌, హైన్స్, వివ్‌ రిచర్డ్స్, హోల్డింగ్స్‌, ఆండీ రాబర్ట్స్, లారీ గోమ్స్‌ వంటి ఆటగాళ్లు ఉండేవారు. మరీ ముఖ్యంగా గ్రీనిడ్జ్‌ - డెస్మాండ్ హైన్స్‌ జోడీ పరుగుల వరద పారించేది. వీరిద్దరూ కలిసి 102 ఇన్నింగ్స్‌ల్లోనే 5,150 పరుగులను జోడించారు.

రోహిత్ శర్మ - శిఖర్ ధావన్

ప్రస్తుతం టీమ్‌ఇండియా తరఫున అత్యుత్తమ భాగస్వామ్యాలను నిర్మిస్తున్న జోడీ రోహిత్ శర్మ - శిఖర్ ధావన్‌. వీరిద్దరూ ఇంగ్లాండ్‌పై శతక (114) భాగస్వామ్యం నిర్మించారు. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇదే క్రమంలో ఇప్పటి వరకు 112 ఇన్నింగ్స్‌ల్లో 5,108 పరుగులను జోడించారు. సచిన్‌-గంగూలీ రికార్డును బ్రేక్‌ చేయడం కష్టం కావొచ్చేమో కానీ.. రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

హషీమ్‌ ఆమ్లా - ఏబీ డివిలియర్స్‌ 

(ఫొటో సోర్స్‌: హషీమ్‌ ఆమ్లా ఇన్‌స్టాగ్రామ్‌)

మిస్టర్‌ 360 ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఓపెనింగ్‌ నుంచి ఏడో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. ఇక హషీమ్‌ ఆమ్లా క్రీజ్‌లో పాతుకుపోయి పరుగులు రాబడతాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో దక్షిణాఫ్రికా అనేక విజయాలను నమోదు చేసింది. హషీమ్‌ - ఏబీ కలిసి తొలి వికెట్‌కు  93 ఇన్నింగ్స్‌ల్లో 4,198 పరుగులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని