Rohit Sharma: రోహిత్‌కు అన్ని మాస్టర్‌స్ట్రోక్‌లే

క్రికెట్లో ఒక్కో క్రికెటర్‌కు ఒక్కో సీజన్‌ కలిసి రాదు. అలాంటి సమయాల్లో బ్యాటర్‌గానే కాదు ఇటు కెప్టెన్‌గా విఫలమవుతుంటారు. కానీ 2023 సీజన్లో రోహిత్‌శర్మ (Rohit Sharma) అటు బ్యాటర్‌గా అదరగొడుతూ.. ఇటు కెప్టెన్‌గానూ రాణిస్తున్నా ఎందుకో అదృష్టం అతడి పక్షాన ఉన్నట్లు లేదు.

Published : 18 Dec 2023 02:10 IST

క్రికెట్లో ఒక్కో క్రికెటర్‌కు ఒక్కో సీజన్‌ కలిసి రాదు. అలాంటి సమయాల్లో బ్యాటర్‌గానే కాదు ఇటు కెప్టెన్‌గా విఫలమవుతుంటారు. కానీ 2023 సీజన్లో రోహిత్‌శర్మ (Rohit Sharma) అటు బ్యాటర్‌గా అదరగొడుతూ.. ఇటు కెప్టెన్‌గానూ రాణిస్తున్నా ఎందుకో అదృష్టం అతడి పక్షాన ఉన్నట్లు లేదు. గత ఏడాదిగా అతడికి అన్ని మాస్టర్‌స్ట్రోక్‌లే మరి. ఈ ఏడాది ఐపీఎల్‌ మొదలుపెట్టి.. వరుసగా రోహిత్‌కు ఏదీ కలిసి రావట్లేదు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు దేశవాళీ టోర్నీల్లోనూ అతడికి చుక్కెదురే అయింది. తాజాగా ఏడాది చివరన ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) కెప్టెన్సీ కూడా పోవడం అతడికి ఇంకా పెద్ద దెబ్బ. 

ఐపీఎల్‌తో మొదలెట్టి ఐపీఎల్‌తోనే

రోహిత్‌శర్మ.. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌. రికార్డు స్థాయిలో అయిదుసార్లు ముంబయి ఇండియన్స్‌కు టైటిల్‌ అందించిన ఘనత అతడిది. కానీ గత మూడేళ్లలో ఆ జట్టు ఒక్కసారి కూడా కప్పు దక్కించుకోలేకపోయింది. 2021, 2022 సీజన్లలో అయితే కనీసం లీగ్‌ దశను కూడా దాటలేదు. ఈ ఏడాది బాగానే ఆడినా ప్లేఆఫ్స్‌లోనే వెనుదిరగాల్సి వచ్చింది. క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి అభిమానులను నిరాశ పరిచింది. మళ్లీ ఒట్టి చేతులతోనే వెనుదిరిగింది. ఇది రోహిత్‌కు తొలి దెబ్బ. ఆ తర్వాత భారత్‌ జట్టు తరఫున కూడా అతడికి సారథిగా కలిసి రాలేదు. కెప్టెన్‌గా గత కొంతకాలంగా మంచి విజయాలే సాధించిన రోహిత్‌కు కీలక తరణంలో ప్రతిష్టాత్మక కప్పులు చేజారిపోయాయి. 2023లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌ ఆస్ట్రేలియా చేతిలోనే ఫైనల్లో ఓడి ఉసూరుమంది. తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవిచూసిన భారత్‌కు.. రెండో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ మరోసారి నిరాశే ఎదురైంది. ఇది రోహిత్‌కు తగిలిన రెండో మాస్టర్‌ స్ట్రోక్‌.

ప్రపంచకప్‌తో ఇంకా

రోహిత్‌కు అన్నిటికంటే పెద్ద మాస్టర్‌ స్ట్రోక్‌ ప్రపంచకప్పే. వరుస విజయాలతో అదరగొట్టేసి అభిమానుల్లో ఆశలను ఆకాశానికి పెంచేసిన రోహిత్‌ సేన చివరి మెట్టుపై తడబడటం మింగుడుపడని అంశమే. ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమి సారథిగా రోహిత్‌ పెద్ద షాకే ఇచ్చింది. ఈ ఏడాది ఊరించిన అదృష్టం మరోసారి అతడి నుంచి చేజారిపోయింది. ఓ పెద్ద టోర్నీలో గెలిచే అవకాశం అలా చిక్కినట్లే చిక్కి వెనక్కిపోయింది. ఈ స్ట్రోక్‌తో అతడు చాలా ఢీలా పడిపోయాడు. ఆ దెబ్బ నుంచి కోలుకుని కాస్త విశ్రాంతి తర్వాత మళ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం అయ్యాడు. కానీ ఈలోగా మళ్లీ అతడికి ఇంకో దెబ్బ తగిలింది. ఇది కూడా పెద్ద ప్రకంపనమే. పదేళ్ల పాటు ముంబయి ఇండియన్స్‌ జట్టును విజయవంతంగా నడిపించిన అతడికి సారథ్యం దూరమైంది. ఇది అతడు అసలా ఊహించని స్ట్రోక్‌. ఎందుకంటే ముంబయి జట్టుకు ఆత్మలాంటోడు రోహిత్‌. అతడు సారథిగా లేని ఆ జట్టును ఊహించలేం. అంతగా తన ముద్ర వేశాడు. హార్దిక్‌ పాండ్య రాకతో అతడికి కెప్టెన్సీ అప్పగించిన ఫ్రాంఛైజీ రోహిత్‌కు షాక్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అతడు జట్టులో ఒక సభ్యుడిగా ఆడతాడా లేదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. లక్షల మంది అభిమానులు సోషల్‌ మీడియాలో ముంబయి ఇండియన్స్‌ అకౌంట్లను అన్‌ఫాలో చేశారు. ముంబయిని ఏ స్థాయిలో నిలబెట్టిన రోహిత్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అని అభిమానులు విరుచుకుపడ్డారు. పాండ్యను కెప్టెన్‌గా చేయడం అనూహ్య పరిణామమని రోహిత్‌ను చూసినా అర్థమవుతుంది. 

ప్రపంచకప్‌లో ఆడతాడా!

2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌శర్మ జట్టుకు సారథ్యం వహించాలని అభిమానుల ఆశ. కానీ తాజా పరిణామాలతో అసలు అతడు మున్ముందు టీ20ల్లో కొనసాగుతాడా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. టీ20లకు గుడ్‌బై చెప్పకపోయినా చాన్నాళ్లుగా అతడు ఈ ఫార్మాట్లో ఆడట్లేదు. మరి 2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ ఆడాలంటే కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. మొన్నటిదాకా పాండ్య.. తాజాగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ఫార్మాట్లో కెప్టెన్లుగా ఉన్నారు. మరి సెలక్టర్లు రోహిత్‌కు సారథ్యం ఇస్తారా అనేది అనుమానం. ఎందుకంటే భవిష్యత్‌ను దృష్టి పెట్టుకుని పాండ్యకే పగ్గాలు అప్పజెప్పొచ్చు. ఒకవేళ అదే జరిగితే రోహిత్‌ ఆడతాడా అనేది చూడాలి. ఏదేమైనా కచ్చితంగా రోహిత్‌ కెరీర్‌ మున్ముందు భిన్నంగా ఉండబోతోంది.

               - ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని