Rohit Sharma : రోహిత్ శర్మ.. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీల రికార్డు

జులై 6.. ఇవాళ టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించిన రోజు. ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదిన...

Published : 06 Jul 2022 16:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జులై 6.. ఇవాళ టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించిన రోజు. ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌లోనే ఓటమిపాలై ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ కేవలం 9 మ్యాచుల్లోనే ఐదు శతకాలతో 647 పరుగులు చేశాడు. 2015లో శ్రీలంక మాజీ వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర నాలుగు సెంచరీలు చేశాడు. గత వరల్డ్‌కప్‌లో రోహిత్ ఐదు శతకాలు చేసి సంగక్కరను బీట్‌ చేశాడు. ఏ జట్ల మీదంటే..

  1. దక్షిణాఫ్రికాపై 122 నాటౌట్‌: 2019 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ (122 నాటౌట్) శతకం బాదాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 227/9 స్కోరు సాధించింది. అనంతరం భారత్‌ 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 230 పరుగులు చేసి విజయం సాధించింది.
  2. పాకిస్థాన్‌ బౌలర్లను చితక్కొట్టాడు: భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్‌ ఎప్పుడూ రసవత్తరమే. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా రోహిత్ (140), కేఎల్ రాహుల్ (57), కోహ్లీ (77) చెలరేగడంతో 336/5 భారీ స్కోరు సాధించింది. అనంతరం పాక్‌ను 212/6 (40 ఓవర్లకు) కట్టడి చేసి భారత్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి) తేడాతో విజయం సాధించింది.
  3. ఇంగ్లాండ్‌పై 102 పరుగులు: ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో రోహిత్ (102) శతకం సాధించినా భారత్‌ గెలవలేకపోయింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 306/5 స్కోరుకే పరిమితమై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓడినా రోహిత్ ఇన్నింగ్స్‌ మాత్రం ఎప్పటికీ మరువలేం.
  4. బంగ్లాపైనా బాదుడే: పసికూన బంగ్లాదేశ్‌పైనా రోహిత్ శర్మ సెంచరీ బాదేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 314/9 భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ (104), కేఎల్ రాహుల్ (77) విజృంభించారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లా ధీటుగానే స్పందించింది. అయితే కీలకమైన సమయంలో వికెట్లు తీసిన బౌలర్లు భారత్‌కు విజయాన్నందించారు. బంగ్లాదేశ్‌ 286 పరుగులకే ఆలౌటై పరాజయపాలైంది.
  5. హ్యాట్రిక్‌ శతకం: ఒకే సిరీస్‌లో అత్యధిక సెంచరీలతోపాటు హ్యాట్రిక్‌ శతకం సాధించడం విశేషం. శ్రీలంకపై ఓపెనర్లు కేఎల్ రాహుల్ (111), రోహిత్ శర్మ (103) శతకాలతో హోరెత్తించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని