IND vs NZ: ఒత్తిడి లేదని చెప్పను.. రిలాక్స్‌ అవ్వకూడదు..: రోహిత్

భారీ స్కోరు చేసినా ఇద్దరు కివీస్‌ బ్యాటర్లు క్రీజ్‌లో పాతుకుపోవడంతో టీమ్‌ఇండియా (IND vs NZ) అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ, షమీ కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు వెళ్లిపోయింది.

Published : 16 Nov 2023 08:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌కు (ODI World Cup 2023) టీమ్‌ఇండియా చేరుకుంది. లీగ్‌ స్టేజ్‌లో అప్రతిహత విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చిన భారత్‌.. నాకౌట్‌లోనూ అదరగొట్టేసింది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ను (IND vs NZ) చిత్తు చేసి టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. అయితే, తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 397 పరుగులు చేసినా.. ఒకానొక దశలో కివీస్‌ లక్ష్య ఛేదన దిశగా సాగడంతో భారత అభిమానుల్లో కాస్త కలవరం రేగింది. కానీ, భారత బౌలర్లు పుంజుకుని కివీస్‌ను కట్టడి చేయడంతో 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్‌ అనంతరం ఇదే విషయంపై స్పందించాడు. 

‘‘వాంఖడే మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడా. అలాగని రిలాక్స్‌గా ఉండకూడదు. వీలైనంత త్వరగా మన బాధ్యతలను ముగించాలి. సెమీస్‌ వంటి మ్యాచుల్లో ఒత్తిడి సహజం. అయినా నిశ్శబ్దంగా మా బాధ్యతలను నిర్వర్తించాం. ఎప్పుడైతే లక్ష్య ఛేదనలో రన్‌రేట్‌ 9కి కంటే ఎక్కువగా ఉందో.. అప్పుడు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అయితే, డారిల్ మిచెల్-కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడారు. ఒకదశలో స్టేడియంలోని ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా మారిపోయారు. క్రికెట్ మ్యాచ్‌ అంటేనే ఇలా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలనే దానిపై మాకు అవగాహన ఉంది. షమీ అద్భుతం చేశాడు. అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 

ఇక బ్యాటింగ్‌లో టాప్‌ 6 ఆటగాళ్లు రాణించడం మరింత సంతోషంగా ఉంది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ అద్భుత ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. కోహ్లీ తనదైన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. మా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు సూపర్బ్. ఇదే ఉత్సాహంతో టైటిల్‌ పోరు బరిలోకి దిగుతాం. ఇంగ్లాండ్‌పై 230 పరుగులు చేసినా మా బౌలర్లు కాపాడారు. ముందుండి జట్టును గెలిపించారు. ఇవాళ మ్యాచ్‌లో దాదాపు 400 కొట్టినా ఒత్తిడి లేదని చెప్పలేను. కానీ, మా ఆటగాళ్లు రాణించడంతోనే విజయం ఖాయమైంది. లీగ్‌ దశలో 9 మ్యాచుల్లో మేం ఏం చేశామో.. దానినే కొనసాగించాం’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. 

కంగ్రాట్స్‌ భారత్‌: కేన్‌ విలియమ్సన్

‘‘మొదట టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన క్రికెట్‌ ఆడుతూ వచ్చింది. ఈ మ్యాచ్‌లోనూ వారి అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం అభినందనీయం. మా ఆటగాళ్లూ అద్భుతంగా పోరాడారు. అయితే, నాకౌట్‌ స్టేజ్‌లో ఓటమి చెందడం బాధగా ఉంది. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి బ్యాటర్లు భారత్‌ జట్టులో ఉన్నారు. దాదాపుగా 400 పరుగుల లక్ష్యం మాకు నిర్దేశించారు. అయినా మేం గట్టిపోటీనిచ్చాం. భారీగా వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. భారత్‌ అతిథ్యం బాగుంది. రచిన్‌, మిచెల్‌ టోర్నీలో మంచి ప్రదర్శన చేశారు. బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. జట్టుగా వీటన్నింటినీ దాటుకుని ముందుకు సాగుతాం’’ అని కివీస్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని