Rohit Sharma: హిట్‌మ్యాన్‌ 2.0.. అభిమానులు కోరుకున్నదీ ఇదే!

వన్డేల్లో రోహిత్‌కు తిరుగులేకపోయినా.. టీ20ల్లో మాత్రం నిలకడ ఉండటం లేదనే చెప్పాలి. కానీ, అఫ్గాన్‌తో మూడో టీ20లో రోహిత్‌ 2.0 కనిపించాడు. తనవి కాని స్విచ్‌ షాట్లను కూడా సమర్థంగా ఆడాడు.

Published : 19 Jan 2024 02:04 IST

14 నెలలుగా అంతర్జాతీయ టీ20ల్లో ఆడలేదు.. పైగా పొట్టి ఫార్మాట్లో రోహిత్‌కు నిలకడ లేదనే వ్యాఖ్యలు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ దిశగా యువ జట్టును సిద్ధం చేస్తున్నారు.. జట్టును నడిపించేందుకు యంగ్‌ కెప్టెన్‌నూ తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి సమయంలో రోహిత్‌ను మళ్లీ టీ20 జట్టులోకి తీసుకురావడం, అంతే కాకుండా కెప్టెన్‌నూ చేయడంపై ఓ వర్గం నుంచి విమర్శలూ వచ్చాయి.

అఫ్గానిస్థాన్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో అతను డకౌట్‌ కావడంతో రోహిత్‌పై విమర్శలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో రోహిత్‌ను టీ20ల్లోకి తిరిగి తీసుకురావడం బెడిసికొడుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌.. ఒకే ఒక్క మ్యాచ్‌తో రోహిత్‌పై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఇది కదా రోహిత్‌ అంటే అని అభిమానులు సంబరపడిపోతున్నారు. 

వీరోచిత శతకంతో విజయశిఖరాల వైపు

అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి టీ20తో రోహిత్‌ కెరీర్‌ తిరిగి కొత్తగా మొదలైందనే చెప్పాలి. ఇది అతని కొత్త వర్షన్‌ అని చెప్పుకోవచ్చు. అసలు టీ20లు ఆడతాడో, లేదో అనే సందేహాలను దాటి.. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపించేలా అతను సాగుతున్నాడు. అఫ్గాన్‌తో మూడో టీ20లో బ్యాట్‌తో, కెప్టెన్సీతో రోహిత్‌ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  4 వికెట్లు కోల్పోయి.. ఓటమి ప్రమాదంలో పడిన జట్టును వీరోచిత శతకంతో రోహిత్‌ విజయశిఖరాల వైపు నడిపించాడు.

మరో వికెట్‌ పడకుండానే జట్టు 212 పరుగులతో ఇన్నింగ్స్‌ ముగించిందంటే అందుకు కారణం రోహిత్‌. రింకు సింగ్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ నిర్మించిన తీరు.. చివర్లో ధనాధన్‌ షాట్లతో చెలరేగిన వైనం.. టీ20ల్లో ఒకప్పటి రోహిత్‌ను గుర్తుచేసింది. వన్డేల్లో రోహిత్‌కు తిరుగులేకపోయినా.. టీ20ల్లో మాత్రం నిలకడ ఉండటం లేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ మ్యాచ్‌తో రోహిత్‌ 2.0 కనిపించాడు. తనవి కాని స్విచ్‌ షాట్లను కూడా సమర్థంగా ఆడాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక శతకాల (5) రికార్డు రోహిత్‌దే. రెండు సూపర్‌ ఓవర్లలోనూ సత్తా చాటాడు. మొదట రెండు సిక్సర్లు, తర్వాత ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టాడు. తొలి సూపర్‌ ఓవర్లో చివరి బంతికి బౌలింగ్‌ ఎండ్‌లో ఉన్న అతను.. రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగి వేగంగా పరుగెత్తడం కోసం రింకు సింగ్‌ను పిలిపించడం అతని తెలివికి నిదర్శనం. ఇక రెండో సూపర్‌ ఓవర్లో పేసర్‌ అవేశ్‌ను కాదని మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు బంతి అందించడం కూడా మంచి ఎత్తుగడే.    అది అద్భుత ఫలితాన్నివ్వడంతో మ్యాచ్‌ సొంతమైంది. ఇలాగే టీ20 ప్రపంచకప్‌లోనూ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్‌ సత్తా చాటితే.. భారత ఐసీసీ ట్రోఫీల నిరీక్షణకు తెరపడ్డట్లే!

టీ20 ప్రపంచకప్‌కూ అతనేనా?

2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత రోహిత్‌ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్‌షిప్‌పై ఫోకస్‌ పెట్టడం కోసం టీ20ల్లో ఆడలేదు. ఆ సమయంలో టీ20ల్లో యువ రక్తాన్ని ఎక్కించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. యువ ఆటగాళ్లను పొట్టి ఫార్మాట్లో ఆడిస్తోంది. అలాగే టీ20ల్లో జట్టును హార్దిక్‌ నడిపిస్తున్నాడు. కానీ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో తిరిగి రోహిత్‌ను జట్టులోకి తీసుకొచ్చి, సారథ్య బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరుగా సాగింది.

బీసీసీఐ కూడా దీనికి మొగ్గు చూపినట్లే కనిపించింది. పైగా హార్దిక్‌ గాయం కూడా రోహిత్‌ను తిరిగి పరిగణలోకి తీసుకోవడంలో కీలకంగా మారింది. దీంతో టీ20 ప్రపంచకప్‌కు ముందు చివరగా అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ కోసం రోహిత్‌తో పాటు కోహ్లీని తిరిగి జట్టులోకి తీసుకుంది. రోహిత్‌ను కెప్టెన్‌ను చేసింది. ఇప్పుడీ సిరీస్‌లో, ముఖ్యంగా చివరి టీ20లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్‌ ఉత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ జట్టును అతనే నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి లోగా హార్దిక్‌ కోలుకున్నా.. పొట్టి కప్‌లో రోహిత్‌కే సారథ్య బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని