Ruturaj-Jagadeesan: భారత టీ20 లీగ్‌ సహచరులే.. విజయ్ హజారే ట్రోఫీలోనూ అదరగొట్టేశారు

భారత టీ20 లీగ్‌లో ఇద్దరూ ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఒకరు తుది జట్టులో స్థానం సంపాదించి అదరగొట్టగా.. మరొకరు ఎక్కువగా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావడం గమనార్హం. అయితే విజయ్‌ హజారే ట్రోఫీలో మాత్రం చెరొక జట్టుకు ఆడి అద్భుత ప్రదర్శన చేశారు. 

Published : 01 Dec 2022 20:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విజయ్‌ హజారే ట్రోఫీ కోసం దేశీయంగా 32 జట్లు తలపడ్డాయి. చివరికి డిసెంబర్‌ 2న మహారాష్ట్ర, సౌరాష్ట్ర మాత్రమే ఫైనల్‌లో ఢీకొనబోతున్నాయి. అయితే టోర్నీలో ఇద్దరు పేర్లు మారుమోగిపోతున్నాయి. ఒకరేమో శతకాల నారాయణ్ జగదీశన్‌ కాగా.. మరొకరు సిక్సర్ల రుతురాజ్‌ గైక్వాడ్‌. విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఫ్రాంచైజీకి వీరు ఆడటం విశేషం. విజయ్‌ హజారే ట్రోఫీలో రుతురాజ్‌, జగదీశన్ ఏ టీమ్‌లకు ఆడుతున్నారు.. ఏం ఘనత సాధించారు..? అనే విషయాలను తెలుసుకొందాం...

యువీ గుర్తుకొచ్చి..

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టడం అరుదైన ఘనత. అలాంటిది అదనంగా వేసిన బంతిని కూడా సిక్స్‌గా మలచడం విశేషం. ఈ రికార్డును కొట్టిందెవరో కాదు క్రికెట్‌ అభిమానులకు సుపరిచితుడైన రుతురాజ్‌ గైక్వాడ్‌. ఉత్తర్‌ప్రదేశ్‌ మీద ఏడు సిక్స్‌లు కొట్టాడు. ఐదో సిక్స్‌ కొట్టిన తర్వాత రుతురాజ్‌ తనకు యువరాజ్‌ గుర్తుకొచ్చాడని చెప్పాడు. మొత్తం ఆ ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. మహారాష్ట్ర తరఫున ఆడుతున్న రుతురాజ్‌.. తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడంలోనూ కీలక పాత్ర పోషించాడు. సెమీస్‌లో అసోంపై శతకం (168) సాధించాడు. సౌరాష్ట్రపైనా ఫైనల్‌లో అదరగొట్టాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు శతకాలతో 443 పరుగులు సాధించాడు. 

టీ20 లీగ్‌లో..

భారత టీ20 లీగ్‌ 2021 సీజన్‌లో టాప్‌ స్కోరర్ జాబితాలో చేరాడు. 16 మ్యాచుల్లో ఒక సెంచరీ, నాలుగు అర్ధశతకాలతో 635 పరుగులు సాధించాడు. ఇందులో ఓపెనర్‌గా డుప్లెసిస్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మించాడు. అయితే గత సీజన్‌లో మాత్రం పెద్దగా రాణించలేదు. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 368 పరుగులు మాత్రమే చేశాడు. 

శతకాలతో విజృంభణ..

కేవలం ఏడు మ్యాచుల్లో వరుసగా ఐదు శతకాలు సాధించడం సాధారణ విషయం కాదు. అయితే ఆ ఘనతను తమిళనాడు క్రికెటర్ నారాయణ్‌ జగదీశన్‌ సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, గోవా, హరియాణా, అరుణాచల్‌ ప్రదేశ్‌పై సెంచరీలు బాదాడు. ఇందులో అసోంపై కేవలం 141 బంతుల్లోనే 277 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ ఓ రికార్డునే తెచ్చిపెట్టింది. లిస్ట్ - ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగా జగదీశన్‌ నిలిచాడు.  అయితే కీలకమైన క్వార్టర్ ఫైనల్‌లో విఫలం కావడంతో తమిళనాడు కథ అక్కడికే పరిమితమైంది. కానీ టోర్నీ టాప్‌ స్కోరర్‌ మాత్రం జగదీశనే కావడం విశేషం. 8 మ్యాచుల్లో 138.33 సగటుతో 830 పరుగులు చేశాడు.

టీ20 లీగ్‌లో..

జగదీశన్‌కు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. గత సీజన్‌లో కేవలం రెండు మ్యాచులు, 2020 ఎడిషన్‌లో 5 మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. అన్ని మ్యాచుల్లో కలిపి కేవలం 73 పరుగులు చేశాడు. మరి జగదీశన్‌ ప్రదర్శనతో ఈసారైనా చెన్నై రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేయకుండా తుది జట్టులో స్థానం కల్పిస్తుందో లేదో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని