T20 World cup: దక్షిణాఫ్రికా బతికిపోయింది

టీ20 ప్రపంచకప్‌లో బౌలర్ల జోరు కొనసాగుతోంది. చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని జట్లు విజయాలు సాధిస్తున్నాయి. పాకిస్థాన్‌పై భారత్‌ 119 పరుగులను కాపాడుకుంటే.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 113 పరుగులే చేసి గట్టెక్కింది. గొప్ప బౌలింగ్‌ ప్రదర్శనతో సఫారీ జట్టును కట్టడి చేసి, విజయానికి చేరువగా వెళ్లిన బంగ్లా.. చివర్లో తడబడి ఓటమి పాలైంది. 

Updated : 11 Jun 2024 07:52 IST

114 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా చతికిల

టీ20 ప్రపంచకప్‌లో బౌలర్ల జోరు కొనసాగుతోంది. చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని జట్లు విజయాలు సాధిస్తున్నాయి. పాకిస్థాన్‌పై భారత్‌ 119 పరుగులను కాపాడుకుంటే.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 113 పరుగులే చేసి గట్టెక్కింది. గొప్ప బౌలింగ్‌ ప్రదర్శనతో సఫారీ జట్టును కట్టడి చేసి, విజయానికి చేరువగా వెళ్లిన బంగ్లా.. చివర్లో తడబడి ఓటమి పాలైంది. 

న్యూయార్క్‌

దక్షిణాఫ్రికా మురిసింది. టీ20 ప్రపంచకప్‌లో సోమవారం 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. బంగ్లా బౌలర్లు తంజిమ్‌ హసన్‌ (3/18), తస్కిన్‌ అహ్మద్‌ (2/19) విజృంభించడంతో మొదట దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 113 పరుగులే చేయలిగింది. క్లాసెన్‌ (46; 44 బంతుల్లో 2×4, 3×6), మిల్లర్‌ (29; 38 బంతుల్లో 1×4, 1×6) రాణించారు. అనంతరం సూపర్‌ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ఛేదనలో తడబడ్డ బంగ్లా.. 7 వికెట్లకు 109 పరుగులే చేసింది. హృదోయ్‌ (37) టాప్‌ స్కోరర్‌. కేశవ్‌ మహరాజ్‌ (3/27), రబాడ (2/19), నోకియా (2/17) ఆ జట్టును దెబ్బతీశారు.

బంగ్లా చతికిల..: స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేక బంగ్లాదేశ్‌ తడబడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల కోసం చెమటోడ్చింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు పదో ఓవర్లో 50/4తో నిలిచింది. ఈ దశలో బంగ్లా పుంజుకుంది. హృదోయ్, మహ్మదుల్లా (20) అయిదో వికెట్‌కు 44 పరుగులు జోడించడంతో సమీకరణం కొంచెం తేలికైంది. 17 ఓవర్లకు స్కోరు 94. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేయాల్సి రావడంతో బంగ్లానే గెలిచేలా కనిపించింది. కానీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన రబాడ, బార్ట్‌మన్, మహరాజ్‌ ఆ జట్టును ఆ కొన్ని పరుగులు కూడా చేయనివ్వలేదు. జోరుమీదున్న హృదోయ్‌ని రబాడ ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బంతి అందుకున్నాడు. తొలి రెండు బంతుల్లో 4 పరుగులొచ్చాయి. మూడో బంతికి జేకర్‌ అలీ (8) ఔటయ్యాడు. నాలుగో బంతికి సింగిల్‌ (బై) వచ్చింది.  2 బంతుల్లో 6 పరుగులు అవసరం కాగా.. మహ్మదుల్లా అయిదో బంతికి సిక్సర్‌కు ప్రయత్నించాడు. కానీ లాంగాన్‌ బౌండరీ వద్ద మార్‌క్రమ్‌ అదిరే క్యాచ్‌ అందుకున్నాడు. చివరి బంతికి సింగిలే రావడంతో మ్యాచ్‌ సఫారీ జట్టు  సొంతమైంది.

చెమటోడ్చిన దక్షిణాఫ్రికా: అనుకూలిస్తున్న పరిస్థితుల్లో పేసర్లు తంజిమ్‌ హసన్, తస్కిన్‌ అహ్మద్‌ విజృంభించడంతో మొదట దక్షిణాఫ్రికా బెంబేలెత్తిపోయింది. ఏ దశలోనూ జోరందుకోని ఆ జట్టు చాలా తక్కువ స్కోరుతో సరిపెట్టుకుంది. దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. తంజిమ్‌ పదునైన పేస్‌తో ఆ జట్టు లైనప్‌ను కకావికలం చేశాడు. అతడి ధాటికి సఫారీ జట్టు 23 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. తొలి ఓవర్లో హెండ్రిక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా ప్రత్యర్థి పతనాన్ని ఆరంభించిన తంజిమ్‌.. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో డికాక్‌ (18), స్టబ్స్‌ (0)లను వెనక్కి పంపాడు. ఈ మధ్యలో మార్‌క్రమ్‌ (4)ను తస్కిన్‌ పెవిలియన్‌ చేర్చాడు. 13 పరుగుల వద్ద మిల్లర్‌ ఇచ్చిన క్యాచ్‌ను లిటన్‌ దాస్‌ వదిలేసి ఉండకపోతే దక్షిణాఫ్రికా పరిస్థితి మరింత దారుణంగా ఉండేదే. పరిస్థితులను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆడిన క్లాసెన్‌.. మిల్లర్‌తో కలిసి ఆ జట్టును ఆదుకున్నాడు. క్లిష్టమైన పిచ్‌పై బ్యాటర్లిద్దరూ దూకుడుగా బ్యాటింగ్‌ చేయలేకపోయినా అయిదో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టు స్కోరును వంద దాటించారు. ఇద్దరూ ఆఖర్లో ఔటయ్యారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో అయిదు ఫోర్లు, ఆరు సిక్స్‌లు మాత్రమే ఉండడం విశేషం.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: హెండ్రిక్స్‌ ఎల్బీ (భి) తంజిమ్‌ 0; డికాక్‌ (బి) తంజిమ్‌ 18; మార్‌క్రమ్‌ (బి) తస్కిన్‌ 4; స్టబ్స్‌ (సి) షకిబ్‌ (బి) తంజిమ్‌ 0; క్లాసెన్‌ (బి) తస్కిన్‌ 46; మిల్లర్‌ (బి) రిషాద్‌ 29; యాన్సెన్‌ నాటౌట్‌ 5; మహరాజ్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 113; వికెట్ల పతనం: 1-11, 2-19, 3-23, 4-23, 5-102, 6-106; బౌలింగ్‌: తంజిమ్‌ హసన్‌ సకిబ్‌ 4-0-18-3; తస్కిన్‌ అహ్మద్‌ 4-0-19-2; ముస్తాఫిజుర్‌ 4-0-18-0; రిషాద్‌ 4-0-32-1; షకిబ్‌ 1-0-6-0; మహ్మదుల్లా 3-0-17-0

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ హసన్‌ (సి) డికాక్‌ (బి) రబాడ 9; నజ్ముల్‌ శాంటో (సి) మార్‌క్రమ్‌ (బి) నోకియా 14; లిటన్‌దాస్‌ (సి) మిల్లర్‌ (బి) మహరాజ్‌ 9; షకిబ్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) నోకియా 3; తౌహిద్‌ ఎల్బీ (బి) రబాడ 37; మహ్మదుల్లా (సి) మార్‌క్రమ్‌ (బి) మహరాజ్‌ 20; జేకర్‌ అలీ (సి) మార్‌క్రమ్‌ (బి) మహరాజ్‌ 8; రిషాద్‌ నాటౌట్‌ 0; తస్కిన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 109; వికెట్ల పతనం: 1-9, 2-29, 3-37, 4-50, 5-94, 6-107, 7-108; బౌలింగ్‌: యాన్సెన్‌ 4-0-17-0; రబాడ 4-0-19-2; బార్ట్‌మన్‌ 4-0-27-0; కేశవ్‌ మహరాజ్‌ 4-0-27-3; నోకియా 4-0-17-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని