Sachin-Sehwag:అలా చేసినందుకు సచిన్‌ నన్ను బ్యాట్‌తో కొట్టాడు: సెహ్వాగ్‌

2011 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా సచిన్‌ (Sachin Tendulkar)తో జరిగిన ఓ సరదా సంఘటనను సెహ్వాగ్‌ (Virender Sehwag) తాజాగా బయటపెట్టాడు. 

Published : 14 Apr 2023 01:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌.. వీరి ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సచిన్‌  (Sachin Tendulkar) క్లాస్‌ ఆటతో మెప్పిస్తే.. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సెహ్వాగ్‌ (Virender Sehwag) దూకుడైన ఆటతీరుతో అలరించాడు. వీరిద్దరూ చాలాకాలంపాటు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. భారత్‌ 2011 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవడంలో ఈ ద్వయం కీలకపాత్ర పోషించింది. సచిన్, సెహ్వాగ్‌ మైదానంలోనే కాకుండా బయట కూడా మంచి మిత్రులు. బ్యాటింగ్ చేసేటప్పుడు సెహ్వాగ్‌కు పాటలు పాడే అలవాటు ఉందని మనలో చాలామందికి తెలిసే ఉంటుంది.  తనలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి బ్యాటింగ్‌ చేసేటప్పుడు సెహ్వాగ్‌ పాటలు పాడుతాడు. ఈ నేపథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా సచిన్‌తో జరిగిన ఓ సరదా సంఘటనను సెహ్వాగ్‌ తాజాగా బయటపెట్టాడు. 

‘‘ 2011 ప్రపంచకప్‌లో మేం (భారత్)  దక్షిణాఫ్రికాతో ఆడుతున్నాం. నేను బ్యాటింగ్ చేస్తూ పాటలు పాడుతున్నాను. ఈ సమయంలో సచిన్‌ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. అతనికి ఓవర్ల మధ్య మాట్లాడే అలవాటు ఉంది. కానీ, నేను అస్సలు మాట్లాడను. ఏకాగ్రత పొందేందుకు పాటలు పాడుతుంటాను. అలా తొలి మూడు ఓవర్ల పాటు జరిగింది. నాలుగో ఓవర్‌ తర్వాత సచిన్‌ వెనుక నుండి వచ్చి నన్ను బ్యాట్‌తో కొట్టాడు. సచిన్‌ నా దగ్గరకు వచ్చి ‘నువ్వు అలా కిషోర్‌ కుమార్‌లా పాటలు పాడుతూ ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది’’ అని అన్నాడని సెహ్వాగ్‌ గుర్తు చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్‌, సెహ్వాగ్ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. సెహ్వాగ్‌ (73) అర్ధ శతకంతో మెరవగా..  సచిన్‌ (111) శతక్కొట్టాడు.  అయితే, ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. 2011 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే ఏకైక ఓటమి కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని