Sachin- ODI Cricket: కొన్ని మార్పులు చేస్తే.. వన్డే క్రికెట్‌కు జీవం వస్తుంది: సచిన్

వన్డే క్రికెట్‌లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సచిన్ తెందూల్కర్‌ (Sachin) చెప్పాడు. అప్పుడే వన్డే ఫార్మాట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెంచేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపాడు.

Published : 18 Mar 2023 12:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్‌ది ప్రత్యేక స్థానం. ఆ తర్వాత వన్డేలను (ODI Cricket) విపరీతంగా అభిమానులు వీక్షించేవారు.  టీ20లు ఎప్పుడైతే వచ్చాయో.. వన్డే ప్రాభవం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలు మినహా ద్వైపాక్షిక సిరీసుల్లో ఈ ఫార్మాట్‌ మ్యాచ్‌లకు చోటు దక్కడం కూడా గగనంగా మారింది. దీంతో వన్డేలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఐసీసీ, క్రికెట్ బోర్డులపై ఉందనేది కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరగాలంటే కచ్చితంగా కీలక మార్పులు చేయాలని మాజీ క్రికెటర్లు ఘంటాపథంగా చెప్పారు. ఇప్పుడున్న 50 ఓవర్ల ఫార్మాట్‌ను 40కు కుదించాలని టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ కూడా రవిశాస్త్రి అభిప్రాయానికి మద్దతు పలికాడు. వన్డే మ్యాచ్‌లు బోర్‌ కొడుతున్నాయని చెప్పిన సచిన్‌ (Sachin).. ఆసక్తి పెంచడానికి పలు కీలక సూచనలనూ అందించాడు. 

‘‘గత కొన్నేళ్లుగా వన్డే క్రికెట్‌ ఫార్మాట్‌లో ఎలాంటి మార్పులు లేవు. తప్పకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రకారం రెండు కొత్త బంతులను ఇవ్వడం వల్ల బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయింది. గతంలో మాదిరిగా రివర్స్ స్వింగ్ చేసే అవకాశం బౌలర్లకు లభించడంలేదు. దాంతో 15వ ఓవర్ నుంచి 40వ ఓవర్‌ వరకు మ్యాచ్‌ బోర్ కొడుతోంది. అందుకే టెస్టు తరహాలో 50 ఓవర్ల క్రికెట్‌నూ రెండు ఇన్నింగ్స్‌లుగా విడదీసి ఆడించాలి.  అప్పుడు మ్యాచ్‌ రసవత్తరంగా మారడంతోపాటు వాణిజ్యపరంగానూ కలిసొస్తుంది. టాస్,  మంచు ప్రభావం, పిచ్‌ పరిస్థితులు ఇరు జట్లకూ అనుకూలంగా ఉండాలి’’ అని సచిన్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని