World Para Athletics: సచిన్‌ రికార్డు స్వర్ణం

పారిస్‌ పారాలింపిక్స్‌కు ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాల పంట పండిస్తున్నారు.

Updated : 23 May 2024 03:56 IST

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌

కోబె: పారిస్‌ పారాలింపిక్స్‌కు ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాల పంట పండిస్తున్నారు. బుధవారం పురుషుల ఎఫ్‌46 షాట్‌పుట్‌లో సచిన్‌ ఖిలారి బంగారు పతకాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఇనుప గుండును 16.30 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న ఆసియా రికార్డు (16.21మీ)నూ మెరుగుపర్చాడు. మరోవైపు పురుషుల ఎఫ్‌51 క్లబ్‌ త్రోలో ధరంవీర్‌ కాంస్యం నెగ్గాడు. 33.61మీ. దూరం క్లబ్‌ను విసిరి అతను మూడో స్థానంలో నిలిచాడు. అతను కేవలం 1 సెంటీమీటర్‌ తేడాతో వెండి పతకాన్ని కోల్పోయాడు. దిమిత్రిజెవిచ్‌ (సెర్బియా- 34.20మీ) మీట్‌ రికార్డుతో పసిడి, హెర్నాండెజ్‌ (మెక్సికో- 33.62మీ) రజతం గెలిచారు. ఇప్పటికే 12 (5 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు) పతకాలతో ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2023లో సాధించిన 10 (3 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు) పతకాల రికార్డును ఇప్పుడు అధిగమించింది. ఇంకో మూడు రోజుల పాటు పోటీలు జరగనుండటంతో భారత్‌ మరిన్ని పతకాలు సాధించే అవకాశముంది. ప్రస్తుతానికి చైనా (18 స్వర్ణాలు), బ్రెజిల్‌ (17 స్వర్ణాలు) తర్వాత భారత్‌ పతకాల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర సాంగ్లి జిల్లాకు చెందిన 34 ఏళ్ల సచిన్‌కు పాఠశాలలో ఉన్న సమయంలో ఓ దుర్ఘటన కారణంగా ఎడమ చేతిలో వైకల్యం ఏర్పడింది. మోచేతి నుంచి అతని కండరాలు దెబ్బతిన్నాయి. ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా అతని చేయి మునుపటి స్థితికి చేరలేదు. అయినా నిరాశపడకుండా షాట్‌పుట్‌ను ఎంచుకుని గొప్పగా రాణిస్తున్నాడు.

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల టీ20 విభాగం 400మీ.పరుగులో ప్రపంచ రికార్డుతో పసిడి గెలిచిన ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్‌ జీవాంజి దీప్తికి ఘన స్వాగతం లభించింది. జపాన్‌లో జరిగిన ఈ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన ఆమె మంగళవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంది. సాయ్‌ ఎస్టీసీ గచ్చిబౌలి కేంద్రం సహాయక డైరెక్టర్, తెలంగాణ పారా అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి తదితరులు దీప్తికి స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని