Sameer Rizwi: రైటార్మ్‌ రైనా..ఐపీఎల్‌ వేలంలో సమీర్‌ సంచలనం

ఐపీఎల్‌ వేలంలో ఓ అనామక ఆటగాడిగా అడుగుపెట్టి రికార్డు ధర సొంతం చేసుకున్నాడు ఓ కుర్రాడు. రైటార్మ్‌ రైనాగా పేరు తెచ్చుకున్న అతను ఇప్పుడు సీఎస్‌కే జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

Published : 23 Dec 2023 02:14 IST

అది 2011.. యూపీలోని మేరఠ్‌. సౌరాష్ట్రతో ఉత్తర్‌ప్రదేశ్‌ రంజీ మ్యాచ్‌. యూపీ కెప్టెన్‌గా రైనా ఉన్నాడు. అక్కడ ప్రాక్టీస్‌ సమయంలో అదే మైదానంలో ఓ చిన్న పిల్లాడి ఫీల్డింగ్‌ నైపుణ్యాలు రైనాను మెప్పించాయి. అప్పుడు ఆ పిల్లాడి ప్రదర్శనకు మెచ్చి రైనా తన కళ్లజోడు బహుమతిగా ఇచ్చాడు. పన్నెండేళ్ల తర్వాత.. ఐపీఎల్‌ (IPL) వేలంలో ఓ అనామక ఆటగాడు ఏకంగా రూ.8.40 కోట్ల ధర పలికాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) అతణ్ని సొంతం చేసుకుంది. అప్పుడు రైనాను మెప్పించింది.. ఇప్పుడు అనూహ్య ధర సొంతం చేసుకుంది.. సమీర్‌ రిజ్వీ (Sameer Rizvi). 20 ఏళ్ల ఈ ఉత్తర్‌ప్రదేశ్‌ సంచలనం రైటార్మ్‌ రైనాగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రైనా ఆడిన జట్టుకే ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 

మేనమామ శిక్షణలో..

అయిదేళ్ల వయసు నుంచి ఇప్పుడు ఐపీఎల్‌లో భారీ ధర దక్కించుకునేంత వరకూ సమీర్‌ ప్రయాణం ఒడుదొడుకుల మధ్యే సాగింది. అతని మేనమామ తంకీబ్‌ అక్తర్‌ ఒకప్పటి క్రికెటర్‌. కానీ ముందుకు వెళ్లలేకపోయాడు. అందుకే తన సోదరి తనయుడు సమీర్‌లోని నైపుణ్యాలు గుర్తించి ఆటలో తీర్చిదిద్దాడు. అయితే అందుకు సమీర్‌ తండ్రి హసీన్‌ మొదట్లో ఒప్పుకోలేదు. సమీర్‌ను నీలాగే ఎందుకు పనికి రాకుండా చేస్తావా? అని తంకీబ్‌ను ప్రశ్నించేవాడు. కానీ, తంకీబ్‌ పట్టు వదల్లేదు. సమీర్‌కు ఆటలో ఓనమాలు నేర్పడమే కాదు అద్భుత ఆటగాడిగా మార్చాడు. ఇప్పుడు వేలంలో సమీర్‌కు భారీ ధర దక్కడంతో తంకీబ్‌ చేతులు పట్టుకుని హసీన్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకా ఐపీఎల్‌లో ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా సమీర్‌ చరిత్ర సృష్టించాడు. 

ఈ కష్టాలు దాటి.. 

2011లో క్రికెట్లో అడుగుపెట్టిన సమీర్‌ భారత అండర్‌-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 16 ఏళ్లకే రంజీలో అరంగేట్రం చేశాడు. కానీ టీనేజీలోనే మైదానం లోపల, బయటా కష్టాలు ఎదుర్కొన్నాడు. సీనియర్‌ జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌ జట్టు ముంబయి ఇండియన్స్‌ తరపున ట్రయల్స్‌లో పాల్గొన్నా ఫలితం దక్కలేదు. మరోవైపు తండ్రి మెదడు సంబంధిత సమస్యతో మంచం పట్టడంతో కుటుంబాన్ని పోషించాల్సిన భారం కూడా అతనిపైనే పడింది. కానీ ఈ అడ్డంకులను చూసి సమీర్‌ ఆగిపోలేదు. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సంకల్ప బలంతో ముందడుగు వేశాడు. సీనియర్‌ జట్టులో చోటు దక్కకపోతే.. జూనియర్‌ లెవల్‌లో ఆడుతూ రాణించాడు. దీంతో మళ్లీ సీనియర్‌ జట్టులోకి వచ్చాడు. టీ20 లీగ్‌లోనూ ఆడటం మొదలెట్టాడు. భారత్‌ తరపున అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడే అవకాశం రాకపోయినా కుంగిపోలేదు. అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడనంత మాత్రాన దేశానికి ఆడలేవని అనుకోవద్దని ధోని చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని సాగాడు. 

ఆ లీగ్‌ మలుపు.. 

యూపీ సీనియర్‌ జట్టు తరపున ఇప్పటివరకు సమీర్‌ 24 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈ ఏడాది యూపీ టీ20 లీగ్‌తో అతని పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఈ లీగ్‌లో కాన్పూర్‌ సూపర్‌స్టార్స్‌ తరపున ఆడుతూ అతను సిక్సర్లతో చెలరేగాడు. ఆ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు కొట్టింది అతనే. ఈ సీజన్‌లో రెండు సెంచరీలు సహా మొత్తం 455 పరుగులు చేయడంతో ఫ్రాంఛైజీల కన్ను అతనిపై పడింది. 10 జట్లు అతణ్ని ట్రయల్స్‌ కోసం పిలిచాయి. కానీ అండర్‌-23 టోర్నీ కారణంగా కేవలం పంజాబ్‌ కింగ్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున మాత్రమే ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. అండర్‌-23 వన్డే టోర్నీలో జట్టును విజేతగా నిలిపాడు. మరోవైపు అండర్‌-16 వరకు ఓపెనర్‌గా ఆడిన సమీర్‌.. స్పిన్‌ను బాగా ఆడతాడు. ఈ నైపుణ్యాలతోనే అతడు మిడిలార్డర్‌ బ్యాటర్‌గా మారాడు. ఈ మార్పు అతని కెరీర్‌నే మార్చింది. ఇప్పుడు రాబోయే ఐపీఎల్‌లోనూ మందకొడిగా ఉండే చెపాక్‌ పిచ్‌పై మిడిలార్డర్‌లో సమీర్‌ కీలకమయ్యే అవకాశముంది. 

‘‘నా ఆటతీరు చూసి జనాలు నన్ను రైనా అని పిలుస్తుంటారు. ఇన్నేళ్లుగా నేను పడ్డ కష్టానికి 50 శాతం ఫలితం దక్కింది. నా కంటే ముందు వేలంలో కొంతమంది ఆటగాళ్లు అమ్ముడుపోకపోవడంతో ఒత్తిడి కలిగింది. కానీ నా కోసం సీఎస్‌కే అంత ధర పెట్టడం ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ జట్టు నన్నెందుకు తీసుకుందోనని ఆలోచిస్తున్నా. ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. ఐపీఎల్‌ కోసం ఎలా సన్నద్ధమవ్వాలా అని ఆలోచించా. వేలంలో వచ్చిన డబ్బుతో ఏం చేయాలన్నది కుటుంబ సభ్యుల ఇష్టానికే వదిలేస్తా’’ అని సమీర్‌ తెలిపాడు.

- ఈనాడు క్రీడా విభాగం 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని