Sania Mirza: కెరీర్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

తన గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza).. మ్యాచ్‌ అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైంది. 

Published : 27 Jan 2023 10:51 IST

మెల్‌బోర్న్‌: భారత టెన్నిస్‌ (Tennis) స్టార్ సానియా మీర్జా (Sania Mirza) తన గ్రాండ్‌స్లామ్‌ ప్రయాణాన్ని ఓటమితో ముగించింది. గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లో చివరిదైన ఆస్ట్రేలియా ఓపెన్‌ (Australia Open) మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌ వరకూ వెళ్లి పరాజయం పాలైంది. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన సానియా.. మ్యాచ్‌ అనంతరం తన జర్నీ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

‘‘నా ప్రొఫెషనల్‌ కెరీర్‌ మెల్‌బోర్న్‌లోనే మొదలైంది. నా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి వేదిక ఉంటుందని నేను అనుకోను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నా కుమారుడు చూస్తుండగా గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదు’’ అంటూ సానియా ఉద్వేగానికి గురైంది.  ఈ వీడియోను ఆస్ట్రేలియా ఓపెన్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. సానియా (Sania Mirza)కు వీడ్కోలు పలికింది.

36 ఏళ్ల సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెన్‌, దుబాయ్‌ ఓపెన్‌ తర్వాత ఆటకు వీడ్కోలు పలకనున్నట్టు వెల్లడించింది. ఇందులో తాజాగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌ తన చివరి గ్రాండ్‌స్లామ్‌. ఈ టోర్నీలో సానియా మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో పోటీపడింది. మహిళల డబుల్స్‌ నిరాశపర్చినప్పటికీ.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మరో భారత ఆటగాడు రోహన్‌ బోపన్నతో కలిసి ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. అయితే టైటిల్‌ పోరులో బ్రెజిల్‌ జంట స్టెఫాని-రఫెల్‌లో చేతిలో 6-7, 2-6 తేడాతో సానియా-బోపన్న జోడీ ఓటమిపాలైంది. దీంతో సానియా.. గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌కు ఓటమితో వీడ్కోలు పలికినట్లయింది. ఇక, వచ్చే నెలలో జరిగే దుబాయి ఓపెన్‌లో సానియా తన కెరీర్‌లో చివరి టోర్నీ ఆడనుంది.

టెన్సిస్‌లో సానియా మొత్తం 43 డబుల్స్‌ టైటిళ్లు సాధించింది. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలున్నాయి. మహిళల డబుల్స్‌ కేటగిరీలో 91 వారాల పాటు నంబర్‌ 1 క్రీడాకారిణిగా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని