Sania Mirza: మహిళల విజయానికి విలువకట్టేది ఇలాగేనా? సానియా మీర్జా పోస్ట్‌ వైరల్‌

Sania Mirza: మహిళల విజయంపై ఓ కంపెనీ చేసిన స్ఫూర్తిదాయక ప్రకటనపై సానియా మీర్జా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Published : 02 Mar 2024 10:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమాజంలో ఓ మహిళ సాధించిన విజయాన్ని ఎలా విలువ కడుతున్నారన్నదానిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు భారత టెన్నిస్‌ (Tennis) స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza). స్త్రీ, పురుష వివక్ష అనేది ఇంకా వ్యాప్తిలో ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. మహిళల విజయంపై ఓ కంపెనీ చేసిన యాడ్‌పై స్పందిస్తూ ఆమె సోషల్‌మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

స్థానికంగా పలు సేవలు అందించే అర్బన్‌ కంపెనీ ఇటీవల (చోటీ సోచ్‌ - సంకుచిత ఆలోచనలు) పేరుతో ఓ వీడియో యాడ్‌ విడుదల చేసింది. ‘ప్రతి ఒక్కరికీ తాము చేస్తున్న పని పట్ల గర్వంగా ఉంటుంది. దాన్ని ఇతరులు కూడా గౌరవించాలి’ అనే స్ఫూర్తిదాయక సందేశంతో ఆ ప్రకటనను రూపొందించింది. అందులో ఓ మహిళ బ్యూటీషియన్‌గా పనిచేస్తూ కారు కొనుగోలు చేస్తుంది. అది చూసి ఇరుగుపొరుగూ ఆమె వృత్తిని చులకన చేస్తారు. దాన్ని ఆమె తమ్ముడు అవమానంగా భావిస్తాడు. అప్పుడు ఆమె సోదరుడితో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరూ నేను కొన్న కారునే చూస్తున్నారు. కానీ, దాని వెనుక నా కష్టాన్ని ఎవరూ గుర్తించట్లేదు. మహిళ విజయం సాధించిన ప్రతిసారీ.. ఈ సమాజం కించపర్చాలనే చూస్తుంది. అలాంటి వారి మాటలను పట్టించుకుని మన జీవితాన్ని వదులుకోవాలా? కష్టపడి ముందు సాగాలా? అనేది మన నిర్ణయమే’’ అని అంటుంది.

ఈ వీడియోకు సానియా స్పందిస్తూ ఉద్విగ్నభరిత పోస్ట్‌ చేశారు. ‘‘2005లో డబ్ల్యూటీఏ టైటిల్‌ గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచాను. అది గొప్పదే కదా..?డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్నప్పుడు.. నేను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదు. ఈ కెరీర్‌లో నాకు ఎంతోమంది మద్దతు ఇచ్చారు. కానీ, ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది ఇప్పటికీ అర్థం కాదు. ఈ యాడ్‌ చూసిన తర్వాత నా మదిలో ఎన్నో భావాలు మెదిలాయి. ఈ సమాజంలో వాస్తవాల గురించి మాట్లాడటం కష్టమేనని తెలుసు. కానీ, ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ, అది ఎప్పటికి జరిగేనో..!’’ అని ఆమె రాసుకొచ్చారు.

ఆరేళ్ల వయసులోనే టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన సానియా మీర్జా.. 2003లో 16 ఏళ్ల వయస్సులో ప్రొఫెషనల్‌ ఆటలోకి అడుగుపెట్టారు. తన సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 43 డబుల్స్‌ టైటిళ్లు సాధించారు. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలున్నాయి. మహిళల డబుల్స్‌ కేటగిరీలో 91 వారాల పాటు నంబర్‌ 1 క్రీడాకారిణిగా నిలిచారు. ఈ క్రమంలో తన ఆటతోనే కాకుండా వ్యక్తిగత జీవితం విషయంలోనూ తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె వైవాహిక బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని