Sanju Samson: భారత జట్టులో పాతుకుపోవాలంటే.. ప్రత్యేకత చూపాల్సిందే: సంజూ శాంసన్

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్‌ (Sanju Samson) ఐపీఎల్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

Published : 20 Mar 2024 19:31 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో (Team India) చోటు దక్కడమంటే ఈజీగా ఉండదు. అద్భుతమైన టాలెంట్‌తోపాటు అదృష్టమూ కలిసి రావాలి. నిలకడైన ఫామ్‌, ఫిట్‌నెస్‌తో ప్లేయర్లు సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి అవకాశం వస్తే నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాలి. లేకపోతే మరో ప్లేయర్‌ ఆ స్థానాన్ని తన్నుకుపోయే ఛాన్స్‌ ఉంది. భారత క్రికెటర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) పరిస్థితీ ఇలాంటిదే. అతడు తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. టీమ్‌ఇండియాలో పాతుకుపోవాలంటే కేరళ నుంచి వచ్చిన తనలాంటి ఆటగాడు ప్రత్యేకతను ప్రదర్శించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.

‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంలో క్రికెట్‌ ఆడాలని అనుకుంటే జరిగిపోదు. ఇక్కడ పోటీ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. నంబర్‌వన్‌ జట్టులో ఆడాలనేది చాలామంది క్రికెటర్ల కల. మన దగ్గర ఉన్న టాలెంట్ అద్భుతం. పోటీ తీవ్రం. ఇలాంటప్పుడు కేరళ నుంచి నాలాంటి ఆటగాడు భారత జట్టులో పాతుకుపోవాలని భావిస్తే మాత్రం విభిన్నంగా ఆడాలి. ప్రత్యేకమైన ప్రదర్శన చేస్తేనే జట్టులో కుదురుకోగలం. 

నేను ఎప్పుడు బ్యాటింగ్‌కు దిగినా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా. ప్రతీ బంతినీ హిట్‌ చేయాలనే ఉద్దేశంతో ఆడను. చెత్త బంతిని స్టాండ్స్‌ ఆవలకు తరలించేందుకు ఏమాత్రం ఆలోచించను. అది మొదటి బాల్‌ అయినా సరే వదిలిపెట్టను. అప్పటికప్పుడు నా మైండ్‌సెట్‌ను మార్చుకుంటా. నా శైలిలోనే బ్యాటింగ్‌ చేసేందుకు ఇష్టపడతా. విభిన్నంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. పది బంతుల వరకు సిక్స్‌ కొట్టేందుకు వేచి చూడటం ఎందుకు? నా పవర్‌ హిట్టింగ్‌ వెనక ఉన్న స్ఫూర్తి అదే. కొవిడ్‌ సమయంలోనూ చాలా తీవ్రంగా శ్రమించా’’ అని సంజూ శాంసన్‌ తెలిపాడు. సంజూ శాంసన్‌కు భారత జట్టులో అవకాశాలు వచ్చినప్పటికీ.. నిలకడలేని కారణంగా స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ ఐపీఎల్‌ 17వ సీజన్‌ (IPL) కోసం సన్నద్ధమవుతున్నాడు.

కోహ్లీని అధిగమించే అవకాశం

ఐపీఎల్‌ చరిత్రలో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సురేశ్‌ రైనా, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్ టాప్‌-3లో ఉన్నారు. రైనా 171 ఇన్నింగ్స్‌ల్లో 4,934 పరుగులు చేశాడు. విరాట్ 93 ఇన్నింగ్స్‌ల్లో 2,815 పరుగులు, సంజూ శాంసన్‌ 77 ఇన్నింగ్స్‌ల్లో 2,504 పరుగులు చేశాడు. శాంసన్‌ మరో 312 పరుగులు చేస్తే కోహ్లీని అధిగమిస్తాడు. అయితే, కోహ్లీ ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా వస్తేనే శాంసన్‌కు అవకాశం ఉంటుంది. విరాట్ కూడా వన్‌డౌన్‌లో వస్తే ఆ వ్యత్యాసం ఇంకా పెరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని