Sanju Samson: కేరళలోనూ రియాన్‌ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ

ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

Updated : 29 Mar 2024 09:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దిల్లీతో మ్యాచ్‌లో 36 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు పడ్డాయి. చివరికి రాజస్థాన్‌ స్కోరు 20 ఓవర్లకు 185/5. దీనికి కారణం రియాన్ పరాగ్ (84*). అతడితోపాటు అశ్విన్ (29), ధ్రువ్ జురెల్ (20), హెట్‌మయర్ (14*) కూడా రాణించారు. గత సీజన్‌లో ఫామ్‌ కోల్పోయిన రియాన్.. ఎప్పుడు రాణిస్తాడని అంతా ఎదురు చూశారు. ఇప్పుడు సత్తా చాటుతూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడేస్తున్నాడు. మ్యాచ్‌ అనంతరం రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. 

‘‘తొలి 10 ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయలేకపోయాం. దీంతో రోవ్‌మన్‌ పావెల్‌ను సిద్ధంగా ఉండాలని చెప్పాం. అతడితో బ్యాటింగ్‌ చేయించాలని భావించాం. కానీ, ఆ తర్వాత బ్యాటర్లు తమ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించారు. మ్యాచ్‌పై పట్టు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంపాక్ట్‌ రూల్‌ వచ్చిన తర్వాత తుది 11 మంది ఆటగాళ్లే కాకుండా.. మొత్తం 15 మంది కూడా కీలకమే. మా ఇన్నింగ్స్‌లోని 13-17 ఓవర్ల మధ్య నేను, సంగక్కర కనీసం నాలుగైదుసార్లు బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుకున్నాం. రియాన్‌ అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి ఎదుట పోరాడే లక్ష్యం నిర్దేశించగలిగాం. గత నాలుగేళ్లుగా రియాన్‌ చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో ఎక్కడికెళ్లినా అతడి గురించే అడిగేవారు. ఎప్పుడు బాగా ఆడతాడని కేరళలోనూ అతడి ఆటతీరుపై చర్చ జరిగింది. ఇప్పుడు మంచి టచ్‌లోకి వచ్చాడు. ఇలాగే కొనసాగితే తప్పకుండా భారత జట్టులోకి రావడం ఖాయం. మా బౌలర్లు సందీప్‌ శర్మ, అవేశ్‌ ఖాన్‌ కీలక సమయంలో పరుగులను నియంత్రించారు’’అని సంజూ శాంసన్‌ వెల్లడించాడు. 

తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాం: రిషభ్ పంత్

‘‘విజయానికి చేరువగా వచ్చాం. చివర్లో మ్యాచ్‌ను వదిలేయడం నిరుత్సాహానికి గురి చేసింది. మా బౌలర్లు 16 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా వేశారు. డెత్‌ ఓవర్లలో బ్యాటర్ల దూకుడు ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. తప్పకుండా డెత్‌లో పరుగులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. దానిపై దృష్టిపెట్టి తదుపరి మ్యాచుల్లో తప్పిదాల నుంచి పాఠాలను నేర్చుకుంటాం’’ అని దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని