Sanju Samson: సమయం లేదు సంజూ.. ఇదే ఆఖరి ఛాన్స్‌ అనుకో!

జాతీయ జట్టులో అవకాశం వచ్చినప్పుడు ఠక్కున పట్టుకొని రాణించాలి. తమను పక్కనపెట్టాలంటే సెలక్టర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించేలా ఆడాలి. 

Updated : 09 Jan 2024 09:18 IST

సాధారణంగా ఐపీఎల్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉండే భారత ఆటగాడికి జాతీయ జట్టులో సుస్థిరమైన స్థానం ఉంటుంది. గతంలో రోహిత్, విరాట్‌ కోహ్లీ.. ఇప్పుడు కేఎల్ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, హార్దిక్‌ పాండ్య ఇలా ప్రతి ఒక్కరూ జట్టులో పాతుకు పోయినవారే. కానీ, ఒకే ఒక్క ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సారథి మాత్రం భారత్‌ తరఫున అడపాదడపా ఆడుతుంటాడు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. అతడే సంజూ శాంసన్‌ (Sanju Samson). తాజాగా అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించాడు. 

దక్షిణాఫ్రికాపై శతకంతో..

సంజూలో ప్రతిభకు కొదవలేదు. ఐపీఎల్‌లో ఓ జట్టునే నడిపిస్తున్న కెప్టెన్. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడే నైపుణ్యం. అన్నీ ఉన్నా.. ఈ భారత క్రికెటర్ అవకాశాల కోసం ఎదురు చూస్తుండాల్సిన పరిస్థితి. తీరా వచ్చిన ఛాన్స్‌లను వృథా చేసుకుంటూ పోయి విమర్శలపాలయ్యాడు. సంజూకు గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. అప్పటికి జట్టు సారథిగా కేఎల్‌ రాహుల్‌ ఉండటంతో సంజూకు ఫైనల్‌ XIలో స్థానం కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, అనూహ్యంగా మూడు మ్యాచుల్లోనూ బరిలోకి దిగాడు. కీలకమైన ఆఖరి వన్డేలో సెంచరీ సాధించి జట్టును గెలిపించడంలో ముఖ్య భూమిక పోషించాడు. అప్పటి వరకు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటూ విమర్శలపాలైన సంజూ ఒక్కసారిగా సరైన రూట్‌లోకి వచ్చాడు. అదే అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసేందుకు మార్గం చూపిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇప్పుడు రాణిస్తేనే.. 

గతేడాది ఆగస్టులో చివరిసారిగా సంజూ శాంసన్‌ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడాడు. ఇప్పుడు కూడా కేఎల్ రాహుల్‌కు విశ్రాంతినివ్వడంతోపాటు, ఇషాన్‌ కిషన్‌ ఆటకు దూరంగా ఉండటం వల్ల సంజూకు అవకాశం దక్కింది. ఇలాంటప్పుడు దీనిని అందిపుచ్చుకుంటే టీ20 వరల్డ్ కప్‌ను ఆడేందుకు ఛాన్స్‌ దగ్గరవుతుంది. పొట్టి కప్‌లోగా టీమ్‌ఇండియా ఆడే చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌ ఇదే. రెండు నెలల తర్వాత ఐపీఎల్‌ వచ్చినా.. ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయం కావడంతో ఐపీఎల్ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. అందుకే, సంజూ శాంసన్‌ కనీసం వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లోనైనా చోటు సంపాదించాలంటే ఈ సిరీస్‌లో తనదైన ముద్ర వేయాల్సిందే.

ఫామ్‌ కొనసాగించేందుకు రంజీల్లో..

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిశాక స్వదేశానికి చేరుకుని మరీ రంజీ ట్రోఫీలో సంజూ శాంసన్‌ ఆడాడు. కేరళ కెప్టెన్‌గా బరిలోకి దిగిన సంజూ ఉత్తర్‌ప్రదేశ్‌పై 46 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. జనవరి 11 నుంచి అఫ్గాన్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సంజూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెలిసిందే కదా. రంజీల్లో అతడి  ఆటను చూసేందుకు భారీగా అభిమానులు స్టేడియానికి చేరుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు కెరీర్‌లో కేవలం 24 అంతర్జాతీయ టీ20లను మాత్రమే ఆడిన సంజూ 374 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 152 మ్యాచుల్లోగానూ 3,888 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు కూడా ఉన్నాయి.

- ఇంటర్నెట్ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని