Sarfaraz - Jaiswal: సర్ఫరాజ్‌ ‘డబుల్‌ సెంచరీ’ ఆనందం... నువ్వు సూపర్‌ అంతే!

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్‌ సెంచరీ చేయలేదు... కానీ 200 కొట్టినంత సంబరం చేసుకున్నాడు.. ఎందుకంటే?

Updated : 19 Feb 2024 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత దేశవాళీ క్రికెట్‌లో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న పేరు, నడుస్తున్న చర్చ సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan)గురించే. అయితే ఇన్నాళ్లూ అతని ఆటే స్పెషల్‌ అనుకున్నాం. కానీ టీమ్‌ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాక ఆటే కాదు.. మనసు కూడా స్పెషలే అని అర్థమైంది. దానికి కారణం అతను చేసిన పనులు. అవి చూడటానికి, వినటానికి సింపుల్‌గా అనిపించొచ్చు కానీ... ఈ యువ క్రికెటర్‌ పరిణతి ఎంతో చెప్పడానికి అవి చాలు. ఫ్యూచర్‌ ఇండియన్‌ స్టార్‌ అవుతాడు అనడానికి కూడా. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 97వ ఓవర్‌ తొలి బంతి పడే ముందు రాజ్‌కోట్‌ స్టేడియం మొత్తం యశస్వి జైస్వాల్‌ పేరు మారుమోగుతోంది. కారణం అతను 199 పరుగులతో క్రీజులో ఉండటం. 96.1వ బంతికి సింగిల్‌ తీసి ద్విశతకం సాధించేశాడు. దాంతో మైదానం ఈలలు, చప్పట్లు, అరుపులతో దద్దిరిల్లిపోయింది. అయితే, మైదానంలో ఆ డబుల్‌ సెంచరీని సెలబ్రేట్‌ చేసుకుంది ఒకరు కాదు ఇద్దరు. 

అవును, అంతటి గొప్ప మూమెంట్‌ని జైస్వాల్‌తోపాటు... అవతలి ఎండ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా సంబరంలా జరుపుకొన్నాడు. ఆ పరుగు తీస్తున్నప్పుడు జైస్వాల్‌ ఎంతటి సంబరపడ్డాడో... ఇంచుమించే అంతే ఆనందపడ్డాడు సర్ఫరాజ్‌. తానే డబుల్‌ సెంచరీ చేశాడేమో అనేంతలా ఎగురుకుంటూ అవతలి ఎండ్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత జైస్వాల్‌ను అభినందనలతో ముంచెత్తాడు.

ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అదేదో మ్యాచ్‌ గెలిపించే రన్‌లా సర్ఫరాజ్‌ సంబరపడిపోయాడు అని కొందరు కామెంట్లు పెడుతుంటే...  మరికొందరేమో సర్ఫరాజ్‌ సూపర్‌ అంటూ పొగిడేస్తున్నారు. మరికొందరేమో ‘పక్కోడి ఘనతను సంబరంలా జరుపుకొంటున్నాడు.. గ్రేట్‌’ అని కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్‌ తొలి రోజు ఎమోషనల్‌ అయ్యి... అందరినీ ఎమోషనల్‌ చేసిన సర్ఫరాజ్‌... ఇలా ఆఖరి రోజు జోష్‌ చూపించి మరింత కనెక్ట్ అయ్యాడు. 

నిజానికి సర్ఫరాజ్‌ ఇప్పుడే కాదు.. తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా కారణంగా రనౌట్‌ అయినప్పుడు కూడా ఇంతే పరిణతితో ‘క్రికెట్‌లో ఇలాంటివి సహజం’ అని అన్నాడు. ఇక స్లిప్‌ కార్డన్‌లో ఉన్నప్పుడు అయినా, క్లోజ్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడు అయినా టీమ్‌ను భలే సపోర్టు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ డిక్లేర్‌ చేసినప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లేటప్పుడు ‘ముందు నడుచుకుంటూ వెళ్లి లీడ్‌ చేయ్‌’ అని జైస్వాల్‌ను ముందుకు పంపించాడు. తొలి టెస్టు ఆడుతూ ఇంతటి పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో ఆడటం గ్రేట్ అనొచ్చు. దేశవాళీల్లో చేసిన పరుగులకు ఈ యాటిట్యూడ్‌ మరింత మంచి పేరు తీసుకొస్తుంది అనొచ్చు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని