WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్.. షెడ్యూల్‌, ప్రైజ్‌మనీ...?

జూన్‌ 7న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ప్రారంభంకానుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. 

Updated : 06 Jun 2023 14:20 IST

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీ ఏదైనా ఉందంటే అది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC). ఒకరకంగా చెప్పాలంటే ఇది టెస్టుల్లో ప్రపంచకప్‌. మరుగునపడిపోతున్న టెస్టు క్రికెట్‌కు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు ఐసీసీ ప్రయోగాత్మకంగా 2019లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌నకు శ్రీకారం చుట్టింది.  పోటీపడిన జట్లలో పాయింట్ల పట్టికలో నిలిచిన టాప్‌-2 జట్లతో రెండేళ్లకొసారి ఫైనల్‌ (WTC Final)నిర్వహిస్తోంది. భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టు ఛాంపియన్ షిప్‌  ఫైనల్‌ (2021)లో కివీస్‌ విజేతగా నిలిచి మొట్టమొదటి డబ్ల్యూటీసీ గదను దక్కించుకుంది. ఈ సారి తొమ్మిది జట్లు పోటీపడగా.. ఆస్ట్రేలియా, భారత్‌ (IND vs AUS) ఫైనల్‌కు చేరుకున్నాయి. మరి రెండో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఎక్కడ జరగనుంది, జట్ల వివరాలు, విజేతకు ఎంత మొత్తం ప్రైజ్‌మనీ దక్కుతుంది.. తదితర వివరాలను తెలుసుకుందాం.  

మ్యాచ్‌ ఎక్కడ జరగనుంది?

జూన్ 07-11 మధ్య లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ జరగనుంది. జూన్‌ 12ను రిజర్వ్ డేగా ప్రకటించారు. వర్షం లేదా ఇతరత్రా కారణాల వల్ల ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా ఆట నిర్వహణ సాధ్యంకాకపోతే రిజర్వ్ డే రోజు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. 

ఎక్కడ చూడాలి?

భారత్‌లోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించొచ్చు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ యాప్‌లోనూ లైవ్‌స్ట్రీమింగ్ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. 

ప్రైజ్‌మనీ ఎంతంటే?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో విజేతగా నిలిచి గదను దక్కించుకున్న జట్టుకు రూ.13 కోట్లు (1.6 మిలియన్‌ డాలర్లు) ప్రైజ్‌మనీ దక్కుతుంది. రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు రూ.6.5 కోట్లు (8 లక్షల డాలర్లు) ఇస్తారు. 

జట్ల వివరాలు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్,  రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, అజింక్య రహానె, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్‌, ఉమేశ్ యాదవ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, ముఖేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్‌), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేసర్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్ మార్ష్, మాట్‌ రెన్‌షా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని