T20 World Cup 2024: నమీబియాపై స్కాట్లాండ్‌ పైచేయి

టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌ గెలుపు బోణీ కొట్టింది. ఇంగ్లాండ్‌తో గత మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్లు పంచుకున్న స్కాట్లాండ్‌..

Published : 08 Jun 2024 03:10 IST

బ్రిడ్జ్‌టౌన్‌: టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌ గెలుపు బోణీ కొట్టింది. ఇంగ్లాండ్‌తో గత మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్లు పంచుకున్న స్కాట్లాండ్‌.. ఈసారి పూర్తి పాయింట్లను ఖాతాలో వేసుకుంది. గ్రూప్‌-బి పోరులో స్కాట్లాండ్‌ 5 వికెట్ల తేడాతో నమీబియాను ఓడించింది. మొదట నమీబియా 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. గెరార్డ్‌ ఎరాస్మస్‌ (52; 31 బంతుల్లో 5×4, 2×6) టాప్‌ స్కోరర్‌. వీల్‌ (3/33), క్యూరీ (2/16), లీస్క్‌ (1/16) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో రిచీ బారింగ్టన్‌ (47; 35 బంతుల్లో 2×4, 2×6), లీస్క్‌ (35; 17 బంతుల్లో 4×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని స్కాట్లాండ్‌ 18.3 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి అందుకుంది.

మెరిసిన బారింగ్టన్, లీస్క్‌: ఛేదనలో నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో స్కాట్లాండ్‌ 5 ఓవర్లకు 25/1తో నిలిచింది. ఈ స్థితిలో మైకేల్‌ జోన్స్‌ (26) దూకుడుగా ఆడి స్కోరు పెంచాడు. అతడు ఔటయ్యాక స్కాట్లాండ్‌ మళ్లీ వెనుకబడింది. 12 ఓవర్లకు 78/4తో ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ స్థితిలో రిచీ బారింగ్టన్, లీస్క్‌ జట్టును ఆదుకున్నారు. 24 బంతుల్లో 40 పరుగులు అవసరమైన స్థితిలో వీజ్‌ బౌలింగ్‌లో లీస్క్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో సమీకరణం (18 బంతుల్లో 21) తేలికైపోయింది. ఆ తర్వాత నమీబియా గెలుపు లాంఛనమే అయింది. 

నమీబియా: 155/9 (ఎరాస్మస్‌ 52, గ్రీన్‌ 28, డావిన్‌ 20; వీల్‌ 3/33, క్యూరీ 2/16, లీస్క్‌ 1/16, సోల్‌ 1/16, గ్రెవ్స్‌ 1/24) స్కాట్లాండ్‌: 18.3 ఓవర్లలో 157/5 (బారింగ్టన్‌ 47, మైకేల్‌ లీస్క్‌ 35, జోన్స్‌ 26)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని