Sehwag: ద్రవిడ్‌కు మద్దతుగా సెహ్వాగ్.. గ్యారీ కిర్‌స్టెన్‌ను ప్రస్తావించిన డ్యాషింగ్‌ బ్యాటర్!

కీలక మ్యాచుల్లో భారత్‌ ఓడిపోవడంతో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై (Rahul Dravid) విమర్శలు వచ్చాయి. జట్టును సరిగా నడిపించలేకపోతున్నాడని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, ద్రవిడ్‌కు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ (Sehwag) మద్దతుగా నిలిచాడు.

Updated : 29 Jun 2023 15:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లోనూ (WTC Final 2023) భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. రాహుల్‌ ద్రవిడ్ (Rahil Dravid) ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2022), ఆసియా కప్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్‌ఇండియాకు ఓటమి తప్పలేదు. దీంతో అతడి కోచింగ్‌ శైలిపై విమర్శలు రేగాయి. ఈ క్రమంలో భారత మాజీ డ్యాషింగ్‌ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ తన సహచరుడికి మద్దతుగా నిలిచాడు. అయితే, వన్డే ప్రపంచకప్‌ 2011 టైటిల్‌ను నెగ్గిన భారత్‌ జట్టుకు కోచ్‌గా పని చేసిన గ్యారీ కిర్‌స్టెన్ ప్రస్తావన తీసుకురావడం విశేషం.

‘‘ఆటగాళ్ల ప్రదర్శనపైనే కోచ్‌ కీర్తి ప్రతిష్ఠలు ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి వారు మైదానంలోకి దిగి మంచి ప్రదర్శన చేస్తే కోచ్‌ను అభినందిస్తారు. అలాగే ఓడితే విమర్శిస్తారు. మనం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాం. కానీ, ఓటమి చవిచూశాం. ప్రతి ఒక్కరూ పరాజయం గురించి మాత్రమే మాట్లాడతారు. మనం ఇక్కడ వరకు ఎలా వచ్చామనేది పట్టించుకోరు. రాహుల్‌ ఉత్తమ కోచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లే సరిగ్గా ఆడాలి. మీరు ఒకసారి 2011 ప్రపంచ కప్‌ సమయంలోని టీమ్‌ఇండియా కోచ్‌ను గుర్తు చేసుకోవాలి. భారత్‌ను విజేతగా నిలిపిన గ్యారీ కిర్‌స్టెన్‌ ఆ తర్వాత చాలా జట్లకు కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ, ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలపలేకపోయాడు. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు కప్‌ అందించాడు. అయితే, ఇక్కడ కిరిస్టెన్ కంటే ఆశిశ్‌ నెహ్రా చాలా కష్టపడ్డాడు. మ్యాచుల సందర్భంగా మనం టీవీల్లోనూ చూశాం’’ అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ద్రవిడ్ - రోహిత్ (Dravid - Rohit) కాంబినేషన్‌లో వన్డే ప్రపంచకప్‌ను నెగ్గి ఐసీసీ ట్రోఫీ కోసం పదేళ్లుగా ఉన్న నిరీక్షణకు తెరదించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆ రెండు జట్లు గ్యారంటీ

‘‘రాబోయే వన్డే ప్రపంచకప్‌లో నాలుగు జట్లు సెమీస్‌ చేరేవేంటో చెబుతా. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్‌. అయితే, అందులో రెండు జట్లు మాత్రం తప్పకుండా ఉంటాయి. అవి ఆసీస్‌, ఇంగ్లాండ్. ఎందుకంటే ఇరు జట్లు ఆడే విధానం ఆ స్థాయిలో ఉంది. మిగతా రెండు వచ్చే అవకాశాలు ఎక్కువే. కానీ, అద్భుతాలు జరిగితే ఇప్పుడేం చెప్పలేం’’ అని సెహ్వాగ్ చెప్పాడు. 

ఆ మ్యాచ్‌ చూడాలని ఉంది: ముత్తయ్య మురళీధరన్‌

‘‘ప్రపంచకప్‌లో భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్‌ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. భారత్ నిస్సందేహంగా ఫేవరేట్‌. ఎందుకంటే వారి స్వదేశంలో టోర్నీని ఆడబోతోంది. అందుకే, ఇంగ్లాండ్‌తో పోరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అని ముత్తయ్య తెలిపాడు. భారత్‌ - ఇంగ్లాండ్‌ జట్ల మధ్య అక్టోబర్ 29న లఖ్‌నవూ వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు