IPL 2023: సీనియారిటీలోనే కాదు.. ఆటలోనూ అదుర్సే..

యువ ఆటగాళ్లకు తామేం తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు కొందరు సీనియర్లు. బ్యాటింగ్‌లో దూకుడు.. బౌలింగ్‌లో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో ముందుంటున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) ఇలాంటి ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

Published : 09 May 2023 10:48 IST

ఇంటర్నెట్ డెస్క్: అనుభవం ఉంటే సరిపోదు.. ఎక్కడ ఎప్పుడు దాన్ని బయటకు తీయాలో తెలియడటమే సీనియారిటీ అంటే.. ఇదేదో సినిమా డైలాగ్‌ను మార్చినట్లు ఉంది కదా. ఇప్పుడు చెప్పబోయే ప్లేయర్ల గురించి ఈ మాత్రం పరిచయం అవసరమే మరి. ఎందుకంటే వారంతా టీమ్‌ఇండియా తరఫున ఆడిన వెటరన్‌ ఆటగాళ్లు. వయసు పెరగడం, ఫామ్‌ కోల్పోవడం, కుర్రాళ్ల నుంచి పోటీ ఎక్కువ కావడంతో జాతీయ జట్టు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. తాజాగా ఐపీఎల్‌లో (IPL 2023) మాత్రం యువ క్రికెటర్లతో పోటీ పడి మరీ తమ సత్తా ఏంటో అభిమానులకు చూపిస్తున్నారు.

  1. అజింక్య రహానె (Rahane): ప్రస్తుత సీజన్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని చెలరేగిపోతున్న సీనియర్‌ బ్యాటర్లలో అజింక్య రహానె ముందుంటాడు. సీఎస్‌కే తరఫున 9 మ్యాచ్‌లు ఆడిన రహానె 181.48 స్ట్రైక్‌రేట్‌తో 245 పరుగులు చేశాడు. సీఎస్‌కే నుంచి పరుగుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. స్ట్రైక్‌రేట్‌లో మాత్రం అతడే టాప్‌. ‘ఆటను ఎంజాయ్‌ చేయడం వల్లే ఇలా ఆడుతున్నా’ అని ఒకానొక సందర్భంలో రహానె చెప్పాడు. ఐపీఎల్‌ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి రహానెకు పిలుపు రావడం విశేషం. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే అవకాశం వచ్చింది. 
  2. వృద్ధిమాన్‌ సాహా (Saha): గత రెండేళ్లుగా జాతీయ జట్టులోకి అప్పుడప్పుడు వస్తున్నా.. అవకాశం మాత్రం దక్కలేదు. కానీ, గత సీజన్‌ నుంచి గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న సీనియర్‌ వికెట్‌ కీపర్ వృద్ధిమాన్ సాహా పవర్‌ప్లేలో భారీ హిట్టింగ్‌తో రెచ్చిపోయాడు.  గత సీజన్‌లో గుజరాత్ టైటిల్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన సాహా.. ఈసారి కూడా 11 మ్యాచుల్లో 273 పరుగులు చేశాడు. వికెట్ల వెనుక కూడా చురుగ్గా కదులుతూ కుర్రాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లెగ్‌సైడ్‌ వెళ్తున్న బంతిని పట్టుకున్న తీరు అమోఘం. 
  3. పీయూశ్‌ చావ్లా (Piyush Chawla): ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ ఎవరో తెలుసా..? పీయూశ్‌ చావ్లా. అవునండీ 10 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ రేసులోనూ నిలిచాడు. ముంబయి బౌలర్ల యావరేజ్‌(16.47)లో కూడా చావ్లాదే తక్కువ. టీమ్‌ఇండియా తరఫున చివరి సారిగా 2012లో ఆడిన చావ్లా.. ఆ తర్వాత లీగ్‌లకే పరిమితం కావడం గమనార్హం. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ -5లో కూడా పీయూశ్‌ చోటు సంపాదించాడు. ఇప్పటి వరకు 175 మ్యాచ్‌లు ఆడిన చావ్లా 174 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల చావ్లాకు అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. అనిల్ కుంబ్లే తరహాలో లెగ్ స్పిన్‌ బౌలింగ్‌లో కీలకంగా మారతాడని ఆశించినా ప్రయోజనం లేకుండా పోయింది.
  4. ఇషాంత్ శర్మ (Ishant Sharma): యువ ఫాస్ట్‌ బౌలర్లు జట్టులోకి వస్తుండటంతో ఇషాంత్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. చివరిసారిగా భారత్‌ జట్టు తరఫున 2021లో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇషాంత్ శర్మ ఆడాడు. ఈసారి ఐపీఎల్‌లోనూ ఆరంభంలో ఇషాంత్‌కు అవకాశాలు రాలేదు. అయితే, వచ్చిన ఛాన్స్‌లను మాత్రం సద్వినియోగం చేసుకున్నాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశాడు. గుజరాత్‌పై రెండు వికెట్లు తీసి దిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరం కాగా..  రాహుల్‌ తెవాతియా, హార్దిక్‌ వంటి హిట్టర్లు ఉన్నా కేవలం 6 పరుగులే ఇచ్చాడు. తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ వికెట్లు తీయకపోయినా పరుగులను నియంత్రించాడు. 
  5. అమిత్ మిశ్రా (Amit Sharma): 40 ఏళ్ల అమిత్ మిశ్రా ఇప్పటికీ తన వైవిధ్యభరిత స్పిన్‌తో ప్రత్యర్థులను మెలికలు తిప్పిస్తున్నాడు. రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్‌ వంటి స్పిన్నర్లు ఉన్నా అమిత్ మిశ్రాకూ అవకాశాలు దక్కడం మాత్రం అతడి సత్తా ఏంటో తెలియజేస్తోంది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనపై పెట్టుకున్న నమ్మకాలను నిలబెట్టుకుంటూ కీలక సమయాల్లో వికెట్లూ పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచులకుగాను ఆరు వికెట్లు తీశాడు. 
  6. మోహిత్ శర్మ (Mohit Sharma): ఎక్కడ కోల్పోయాడో.. అక్కడే రాబట్టుకున్నాడు 34 ఏళ్ల మోహిత్ శర్మ.  అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే  పర్పుల్‌ క్యాప్‌ను 2014 సీజన్‌లోనే సొంతం చేసుకున్న మోహిత్ శర్మ ఆ తర్వాత కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి చాలా శ్రమించాడు. గాయాలు, ఫామ్‌తో ఇబ్బంది పడిన మోహిత్ 2015 నుంచి 2020వ సీజన్‌ వరకు ఫ్రాంచైజీలు మారాడు. అయినా, ఆయా ఫ్రాంచైజీల తరఫున ఒక్కో మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అయితే, గత రెండు సీజన్లలోనూ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోవడం గమనార్హం. దీంతో హరియాణా తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడమని గుజరాత్ టైటాన్స్‌ కోచ్‌ ఆశిశ్‌ నెహ్రా సూచించడంతో అటువైపు వెళ్లాడు. గతేడాది మోహిత్‌ను తీసుకున్న గుజరాత్‌ అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. కానీ,  ఈసారి మాత్రం తనకు వచ్చిన ఛాన్స్‌ను మోహిత్ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ రాణిస్తూ 8 మ్యాచుల్లోనే 12 వికెట్లు తీశాడు. 
  7. శిఖర్ ధావన్‌: 37 ఏళ్ల శిఖర్ ధావన్‌ పేరు గతేడాది వరకు మారుమోగింది. వన్డే జట్టులో కీలక పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్ రోహిత్‌తో ఓపెనర్లుగా శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌ ఎప్పుడైతే సక్సెస్‌ అయ్యారో.. అప్పటి నుంచి ధావన్‌ను బీసీసీఐ కాస్త పక్కనపెట్టేసింది. ఈ క్రమంలో వచ్చిన ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌కు సారథిగా వ్యవహరిస్తూ అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడేశాడు. ఇప్పుడా ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ కూడా ధావనే కావడం విశేషం. 7 మ్యాచుల్లో 292 పరుగులు చేసిన ధావన్‌ 148 స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి వరకూ క్రీజ్‌లో ఉండి 99 పరుగులు సాధించాడు. ఇప్పటికీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఈ క్రమంలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో ధావన్‌కు చోటు కల్పించడంపై మేనేజ్‌మెంట్‌కు సవాల్‌ విసిరాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని