T20 World Cup 2022: సంచలనాలు.. హోరాహోరీ పోటీలను దాటి.. పొట్టి కప్‌ సెమీస్‌లోకి ఎంట్రీ..!

టీ20 ప్రపంచకప్‌ చివరి దశకు చేరుకొంది. గ్రూప్ స్టేజ్‌ను దాటుకొని నాకౌట్‌ దశకు చేరింది. సెమీస్‌లో ఢీకొనబోయే నాలుగు జట్లేవో తేలిపోయింది. అనూహ్యంగా పాకిస్థాన్‌ సెమీస్‌ చేరుకోగా.. గ్రూప్ - 2లో అగ్రస్థానంతో భారత్‌ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

Updated : 07 Nov 2022 09:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇక నుంచి పోరు మరో ఎత్తు. లీగ్ స్టేజ్‌లో హోరాహోరీగా మ్యాచ్‌లు జరిగాయి. సంచలన విజయాలు.. ఉత్కంఠభరిత పోరులు చూశాం. మధ్యమధ్యలో వరుణుడు వచ్చి మ్యాచ్‌లను తుడిచిపెట్టడమూ జరిగిపోయింది. ఇక నాకౌట్‌ దశ వచ్చేసింది.. గెలిస్తే ముందుకు.. ఓడితే ఇంటికి వెళ్లి పోయే పరిస్థితి. 

అనుకొన్నదొకటి.. అయిందొకటి అన్నట్లు.. సెమీస్‌లోకి దూసుకొస్తామని భావించిన టీమ్‌లు ఇంటిముఖం పట్టాయి. ఆశలు సన్నగిల్లిన సమయంలోనూ పుంజుకొని అనూహ్యంగా సెమీఫైనల్‌ బెర్తులను దక్కించుకొన్న జట్లూ ఉన్నాయి. మరి సెమీస్‌ పోరుకు చేరిన జట్ల మధ్య పోటీ ఎలా ఉండనుందో..? ఓసారి అంచనా వేద్దాం..

ఐసీసీ మెగా టోర్నీలు అంటేనే దక్షిణాఫ్రికా జట్టుకు కలిసిరావేమో.. వరుసగా రెండు విజయాలు సాధించి సెమీస్‌కు వెళ్లే తొలి జట్టుగా అవతరిస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా దక్షిణాఫ్రికా ఇంటిముఖం పట్టి.. పాకిస్థాన్‌కు దారి కల్పించింది. అలాగే ఆతిథ్య దేశం, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌కు భంగపాటు తప్పలేదు. వర్షం వల్ల ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దు కావడం కూడానూ ఆసీస్‌పై ప్రభావం పడింది. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ -12 దశలో భారత్‌ అత్యధికంగా నాలుగు విజయాలు, ఒక ఓటమితో 8 పాయింట్లు సాధించిన టీమ్‌గా సెమీస్‌కు చేరుకొంది. ప్రస్తుతం సెమీస్‌కు చేరిన నాలుగు జట్లలో టీమ్‌ఇండియానే టాప్‌. న్యూజిలాండ్‌ (7) మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దు.. ఇంగ్లాండ్ (7) మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దు.. పాకిస్థాన్‌ (6) మూడు విజయాలు, రెండు ఓటములు నమోదు చేశాయి.  

తొలి సెమీస్‌..

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఆశ్చర్యపరిచే అంశం పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరుకోవడం. ఆ దేశ అభిమానులకే కాకుండా మాజీలకు కూడా నమ్మకాలు సన్నగిల్లిన వేళ.. అదృష్టం కలిసొచ్చి నాకౌట్‌ దశకు చేరుకొంది. గ్రూప్ - 1లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో తొలి సెమీస్‌ పోరులో (నవంబర్ 9న) తలపడనుంది. అయితే పాకిస్థాన్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సూపర్ -12 దశలో తొలి రెండు మ్యాచ్‌లను ఓడిన పాక్‌.. కీలక సమయంలో రాణించి విజయాలు నమోదు చేసింది. అయితే దాయాది దేశం కీలక పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది ఎట్టకేలకు ఫామ్‌లోకి దూసుకొచ్చాడు. అలాగే హారిస్ రవుఫ్, షాదాబ్‌ ఖాన్‌, నవాజ్‌ గత ప్రదర్శనను పునరావృతం చేస్తే మాత్రం పాక్‌కు తిరుగుండదు. అయితే కివీస్‌ చాపకింద నీరులా ఎలాంటి హడావుడి లేకుండా సెమీస్‌కు దూసుకొచ్చింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సెంచరీలు సాధించిన ఇద్దరు బ్యాటర్లలో ఒకరు కివీస్‌ ఆటగాడే (గ్లెన్‌ ఫిలిప్స్‌) మరొకరు శతకానికి సమీపంగా (డేవన్‌ కాన్వే) రావడం గమనార్హం. పొట్టి కప్‌ 2022 తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు కివీస్‌ చుక్కలు చూపించింది. ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణిస్తూ విజయాలు సాధించిన న్యూజిలాండ్‌కు నాకౌట్‌ దశ పెద్దగా అచ్చిరాదు. గత వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లినప్పటికీ.. అదృష్టం కలిసిరాక ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫామ్‌లోకి రావడం మాత్రం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలాంశం. 

భారత్‌-ఇంగ్లాండ్‌ పోరు..

ఎప్పుడో పదిహేనేళ్ల కిందట అరంగేట్ర పొట్టి టోర్నీ టైటిల్‌ను నెగ్గిన టీమ్‌ఇండియా మళ్లీ విజేతగా నిలవలేదు. 2014లో ఒక్కసారి మాత్రం ఫైనల్‌ వరకు వచ్చి లంక చేతిలో ఓటమిపాలైంది. గత ప్రపంచకప్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగినా గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది. అయితే ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లోనూ విజయాలు నమోదు చేసి సెమీస్‌కు వచ్చింది. అయితే ఇక్కడే కఠిన పరీక్ష ఎదురుకానుంది. నవంబర్ 10న ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీకొట్టనుంది. టీమ్‌ఇండియాలోని ఆటగాళ్ల సంగతి తెలిసిందే. విరాట్, సూర్యకుమార్‌కు తోడు కేఎల్ రాహుల్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు. అయితే కెప్టెన్ రోహిత్ కూడా బ్యాట్‌ను ఝులిపిస్తే బ్యాటింగ్‌లో భారత్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు. కానీ భీకర ఆటగాళ్లు ఉన్న ఇంగ్లాండ్‌ను అడ్డుకోవడం సులువైన విషయం కాదు. అలెక్స్ హేల్స్, బట్లర్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్, మొయిన్‌ అలీ, సామ్ కరన్ వంటి హార్డ్ హిట్టర్లు ఆ జట్టు సొంతం. అలాగే పేస్‌ బౌలింగ్‌లో అత్యంత స్పీడెస్టర్‌గా మారిన మార్క్‌ వుడ్‌ చెలరేగుతున్నాడు. అతడికి సహకారంగా క్రిస్‌ వోక్స్, సామ్‌ కరన్, అదిల్ రషీద్‌ వంటి బౌలర్లు ప్రత్యర్థులను వణికించారు. నాకౌట్‌ దశలో ఇంగ్లాండ్‌ తక్కువగా అంచనా వేయొద్దని క్రీడా విశ్లేషకులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని