Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌ ఐపీఎల్‌ ఫైనల్‌కు వచ్చేస్తాడు: జూహీ చావ్లా

కోల్‌కతా ఓనర్ షారుక్ ఖాన్ డీహైడ్రేషన్‌కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా సహ యజమాని జూహీ చావ్లా స్పందించారు.

Published : 23 May 2024 12:45 IST

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్‌ నటుడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓనర్ షారుక్ ఖాన్‌ (Sharukh Khan) అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో (మే 21న) హైదరాబాద్‌పై కేకేఆర్‌ గెలిచింది. ఆ సందర్భంగా షారుక్ ఆటగాళ్లతో అహ్మదాబాద్‌ మైదానంలో సందడి చేశాడు. అయితే, ఆ సమయంలో అస్వస్థతకు గురి కావడంతో ఆసుప్రతికి తరలించారు. డీహైడ్రేషన్‌, అధిక వేడి కారణంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితిపై కేకేఆర్‌ సహ యజమాని జూహీ చావ్లా కీలక సమాచారం అందించారు. ‘‘ఆసుప్రతిలో చేరినప్పుడు షారుక్ కాస్త ఇబ్బందిగా ఉన్నాడు. నిన్న సాయంత్రానికి ఆరోగ్యం మెరుగైంది. దేవుడి దయ వల్ల త్వరగా కోలుకుంటున్నాడు. కోల్‌కతాను ప్రోత్సహించేందుకు తప్పకుండా ఐపీఎల్‌ ఫైనల్‌కు వస్తాడు’’ అని చావ్లా తెలిపారు. 

వైద్యులు ఏమన్నారంటే?

‘‘బాలీవుడ్ నటుడు షారుక్ డీహైడ్రేషన్ కారణంగా ఇబ్బంది పడ్డారు. అహ్మదాబాద్‌లో 45+ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైద్యుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆసుపత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశాం’’ అని వైద్య వర్గాలు వెల్లడించాయి. మే 26న ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే కోల్‌కతా తుది పోరుకు దూసుకెళ్లింది. శుక్రవారం జరగనున్న రెండో క్వాలిఫయర్‌లో విజేతగా నిలిచే జట్టుతో కేకేఆర్‌ టైటిల్‌ కోసం తలపడనుంది.

అనారోగ్యంతో బాధపడుతూనే.. 

తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ అనంతరం నీరసంగా ఉన్న షారుక్ ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఓ దివ్యాంగ అభిమాని ఎదురుగా వచ్చాడు. అతడిని నిరుత్సాహపరచడం ఇష్టంలేని ఎస్‌ఆర్‌కే ఆప్యాయంగా మాట్లాడి ఫొటో దిగాడు. అప్పుడు షారుక్ అలసటగానే కనిపించాడు. దీంతో బాలీవుడ్‌ స్టార్‌పై నెట్టింట ప్రశంసలు వచ్చాయి. సూపర్‌ స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తించారు. ఆ వీడియో కూడా వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని