Ban vs Ind: టీమ్‌ ఇండియాపై అరుదైన రికార్డు సాధించిన బంగ్లా బౌలర్‌

తొలి వన్డేలో షకీబ్‌ అల్ హసన్‌ భారత్‌పై 5 వికెట్లు పడగొట్టడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. 

Published : 05 Dec 2022 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ పర్యటనను టీమ్‌ఇండియా ఓటమితో ఆరంభించింది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌పై బంగ్లాదేశ్ ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 9  వికెట్లు కోల్పోయి 46 ఓవర్లలో ఛేదించింది. భారత్‌ని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్ హసన్‌ కీలక పాత్ర పోషించాడు.   10 ఓవర్లు బౌలింగ్‌ చేసి 36 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్‌లు ఉండటం విశేషం. కీలకమైన రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీలను కూడా షకీబే పెవిలియన్ చేర్చాడు. 

షకీబ్‌ అల్ హసన్‌ ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత్‌పై అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో టీమ్‌ఇండియాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బంగ్లా స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా భారత జట్టుపై ఈ ఫీట్‌ సాధించిన ఎనిమిదో స్పిన్నర్‌గా నిలిచాడు. గతంలో ముస్తాక్‌ అహ్మద్‌, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీధరన్‌,యాష్లే గైల్స్, అజంతా మెండిస్‌, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ వన్డేల్లో భారత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశారు. బంగ్లాదేశ్, భారత్‌ మధ్య డిసెంబర్‌ 7న రెండో వన్డే జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని