IPL 2024: ఈ ఐపీఎల్‌లో చూడాల్సింది ఇతణ్నే

ఐపీఎల్‌లో (IPL) ఆడాలని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిఒక్కరూ ఆశ పడుతుంటారు. వేలంలోకి వచ్చినా ఒక్కోసారి ఎవరూ తీసుకోరు. కానీ, ప్రతిభ ఉంటే ఛాన్స్‌ అదే వస్తుందని నిరూపించాడీ వెస్టిండీస్‌ సంచలనం.

Published : 12 Feb 2024 15:46 IST

ఐపీఎల్‌లో (IPL) అభిమానుల చూపు ఎప్పుడూ సూపర్ స్టార్ల మీదే ఉంటుంది. అలాగే వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల మీదా కన్నేస్తారు. అయితే స్టార్లలో కొందరు రాణిస్తారు. కొందరు విఫలమవుతారు. ఇక భారీ ధర పలికిన ఆటగాళ్ల అంచనాలను అందుకున్న సందర్భాలూ తక్కువే.  కానీ కొందరు యువ ఆటగాళ్లు అనుకోకుండా ఐపీఎల్‌లోకి వచ్చి అదరగొడుతుంటారు. ఈసారి ఆ జాబితాలో చేరే పేరు.. షమార్ జోసెఫ్ కావచ్చన్నది విశ్లేషకుల మాట. ఈ వెస్టిండీస్ యువ సంచలనం పేరు ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశం అవుతోంది. మిస్ అయిందనుకున్న ఐపీఎల్ ఛాన్స్ వరంలా అందడంతో అతడి ప్రదర్శన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆస్ట్రేలియాతో వెస్టిండీస్‌ టెస్టు మ్యాచ్ ఆడుతోందంటే ఎవరికీ అంతగా ఆసక్తి ఉండదు. అందులోనూ ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో విండీస్ ఢీకొంటుంటే ఆసక్తి ఇంకా సన్నగిల్లిపోతుంది. సొంతగడ్డపై కంగారూలను కరీబియన్ జట్టు ఓడించడం సంగతి అటుంచితే.. పోటీ ఇవ్వడం కూడా కష్టమే. గత నెలలో రెండు టెస్టుల సిరీస్ కోసం విండీస్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నపుడు కూడా అందరూ ఆ జట్టును తేలిగ్గానే తీసుకున్నారు. అందుకు తగ్గట్లే తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో చిత్తయింది విండీస్. కానీ గబ్బాలో జరిగిన రెండో టెస్టు (డే/నైట్)లో ఆ జట్టు అనూహ్య విజయం సాధించింది. కేవలం 8 పరుగుల తేడాతో నెగ్గింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 207 పరుగులకే పరిమితం అయింది. ఆ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో ఆసీస్ పతనాన్ని శాసించిన బౌలర్.. షమార్ జోసెఫ్.

ముందురోజు బ్యాటింగ్ చేస్తుండగా స్టార్క్ యార్కర్ బలంగా తాకి బొటన వేలు విరిగినా.. చివరి రోజు బౌలింగ్‌కు వచ్చి 7 వికెట్ల ప్రదర్శనతో విండీస్‌ను గెలిపించాడు. దీంతో అతడి పేరు ప్రపంచ క్రికెట్లో మార్మోగింది. 28 ఏళ్ల విరామం తర్వాత ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ ఓ టెస్టు మ్యాచ్ నెగ్గడంతో ఆ దేశ దిగ్గజాలు భావోద్వేగానికి గురవుతూ షమార్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఆస్ట్రేలియా గ్రేట్ స్టీవ్ వా అయితే.. టెస్టు క్రికెట్‌ను రక్షించడానికి వచ్చిన సేవియర్ అంటూ షమార్‌ను కొనియాడాడు. ఆ సిరీస్‌లో షమార్ బౌలింగ్ విన్యాసాలు చూసినవారికి అతను వన్ మ్యాచ్ వండర్‌లా కనిపించలేదు. కండలు తిరిగిన దేహం, సూపర్ ఫిట్‌నెస్‌, చూడాలనిపించే బౌలింగ్ శైలి, మెరుపు వేగం.. ఇవన్నీ చూసి 24 ఏళ్ల ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేశారు.

నేపథ్యం ఆసక్తికరం

షమార్ నేపథ్యం తెలిస్తే అతను ఈ స్థాయికి చేరడం నమ్మశక్యంగా అనిపించదు. గయానా దీవుల్లోని ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు షమార్. 2018 ముందు వరకు ఆ గ్రామానికి ఫోన్లు, ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేదు. పేద కుటుంబంలో పుట్టిన జోసెఫ్.. చిన్నతనంలో మొద్దులు నరికే పనికి వెళ్లేవాడు. యుక్త వయసులోనే పెళ్లి కావడంతో కుటుంబంతో కలిసి పట్నానికి వలస వెళ్లి అక్కడ కొంతకాలం ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా, మూడేళ్ల పాటు సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. అలా పని చేస్తూనే క్రికెట్ మీద ఆసక్తితో సాధన చేశాడు. విండీస్ క్రికెటర్ రొమారియో షెఫర్డ్ అతడి ప్రతిభను గుర్తించి గయానా జట్టుకు రిఫర్ చేశాడు. అక్కడ సత్తా చాటి దేశవాళీ క్రికెట్లోకి వచ్చిన షమార్.. శరవేగంగా ఒక్కో మెట్టు ఎక్కాడు. గత నెల ఆస్ట్రేలియా పర్యటనకు విండీస్ జాతీయ జట్టులోకి వచ్చేశాడు. తొలి సిరీస్‌లోనే అదరగొట్టి క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.

అలా ఐపీఎల్‌లోకి..

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో షమార్ ప్రదర్శన చూసిన చాలామంది ఐపీఎల్ వేలానికి ముందు అతను ఈ ప్రదర్శన చేసి ఉంటే.. కచ్చితంగా ఈ లీగ్‌లోకి వచ్చేసేవాడు అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇంకో ఏడాది ఎదురుచూపులు తప్పవు అనుకున్నారు. కానీ అనుకోకుండా అతడికి ఈ లీగ్‌లో అవకాశం దక్కింది. లఖ్‌నవూ ప్రధాన పేసర్లలో ఒకడైన ఇంగ్లాండ్ ఆటగాడు మార్క్ వుడ్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. టీ20 ప్రపంచకప్, యాషెస్ లాంటి ముఖ్యమైన టోర్నీలు ఉండడంతో ఇంగ్లాండ్ బోర్డు అతణ్ని ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని సూచించింది. దీంతో ఒక ఖాళీ ఏర్పడి లఖ్‌నవూ జట్టు షమార్‌ను సంప్రదించింది. అతను సంతోషంగా అంగీకరించాడు. తొలి సీజన్ కోసం అతడికి రూ.3 కోట్లు ఇవ్వనున్నారట. షమార్ లాంటి పేసర్ కచ్చితంగా ఐపీఎల్‌పై తనదైన ముద్ర వేస్తాడని భావిస్తున్నారు. కొంచెం బ్యాటింగ్ కూడా చేయగల నైపుణ్యం అతడికి ఉంది. 2024 ఐపీఎల్‌లో అతను అంచనాలను అందుకుంటే.. వచ్చే సీజన్‌కు వేలంలోకి వెళ్లి భారీ ధర దక్కించుకునే అవకాశముంది.

-ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని