Asian Games: ఆసియా క్రీడలకు జట్టు.. ధావన్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఇదేనా..?

ఆసియా క్రీడల్లోనూ భారత క్రికెట్‌ను (Team India) వీక్షించేందుకు అవకాశం దొరకనుంది. టీమ్‌ఇండియాకు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ వ్యవహరిస్తాడనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.

Updated : 01 Jul 2023 21:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌ అభిమానులకు ఆసియా కప్‌, వన్డే ప్రపంచ కప్‌ టోర్నీలకు మధ్య ఉన్న స్వల్ప వ్యవధిలోనూ భారత మ్యాచ్‌లను వీక్షించే అవకాశం రాబోతోంది. ఆసియా క్రీడల్లో (Asian Games) పాల్గొనేందుకు బీసీసీఐ అంగీకరించడంతో భారత జట్టు (Team India) పాల్గొనేందుకు మార్గం సుగమమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టుకు శిఖర్ ధావన్‌ నాయకత్వం వహిస్తాడని, ఎన్‌సీఏ ఛైర్మన్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ జట్టులో ఎవరు ఉంటారు? అనేది అభిమానుల్లో మెదిలే ప్రశ్న. మరి స్క్వాడ్‌ ఎలా ఉండనుందో ఓసారి అంచనా వేద్దాం.. 

వన్డే ప్రపంచ కప్‌, ఆసియా కప్‌ టోర్నీలకు జట్టు ఎంపిక ఇంకా చేయలేదు. సీనియర్లకే స్క్వాడ్‌లోకి తీసుకొనే అవకాశం ఉంది. ఆసియా క్రీడలకు కెప్టెన్‌గా ధావన్‌ను ఉంచుతారంటేనే అతడికి వరల్డ్‌ కప్, ఆసియా కప్‌ వంటి టోర్నీల్లో ఆడించే అవకాశం లేదని అర్థం. దీంతో ఆసియా క్రీడల్లో ధావన్‌ ఓపెనర్‌గా వస్తాడు. అతడికి జోడీగా యశస్వి జైస్వాల్‌ లేదా రుతురాజ్‌ గైక్వాడ్‌ ఖాయం. 

మిడిల్‌.. ఆల్‌రౌండర్లు అదుర్స్‌

కీలకమైన మిడిల్‌ ఆర్డర్‌లో యువ ఆటగాళ్లకు కొదవేంలేదు. ఐపీఎల్‌లో తమ సత్తా చాటి జాతీయ జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్లేయర్లు చాలా మంది. అందులో ముందు వరుసలో మాత్రం నితీశ్‌ రాణా, తిలక్‌వర్మ, రింకు సింగ్‌, దీపక్‌ హుడా, జితేశ్ శర్మ, ప్రభ్‌ సిమ్రన్ సింగ్ ముందుంటారు. ఆల్‌రౌండర్ల జాబితాలో వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య ఉండనే ఉన్నారు. దీపక్‌ హుడా కూడా పార్ట్‌టైమ్‌ బౌలర్‌ కావడం అదనపు బలం. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ జాబితాలో యువ ఆటగాడు రవి బిష్ణోయ్ టాప్‌లో ఉన్నాడు. అలాగే సీనియర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా పరిగణలోకి ఉండటం విశేషం.

పేసర్లు ఫుల్‌.. 

భారత రిజర్వ్‌బెంచ్‌ పటిష్ఠంగా ఉందనడానికి ఇదొక కారణం. బుమ్రా, షమీ, సిరాజ్‌, జయ్‌దేవ్‌ ఉనద్కత్, ఉమేశ్‌.. ఇలా సీనియర్లు ఉన్నప్పటికీ తమ అవకాశం కోసం యువ పేసర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. గాయం కారణంగా ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన ప్రసిధ్‌ కృష్ణ కోలుకుని జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. హర్షల్‌ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, దీపక్‌ చాహర్, ఉమ్రాన్‌ ఖాన్ భారత్‌ తరఫునా అదరగొట్టారు. దీపక్‌ చాహర్‌ నాయకత్వంలోని పేస్‌ దళం ఆసియా గేమ్స్‌ బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదు. అయితే, వీరిలో కొందరు ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ టోర్నీలకు ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు. 

భారత్‌ స్క్వాడ్‌ (అంచనా): 

శిఖర్ ధావన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్, తిలక్ వర్మ, నితీశ్‌ రాణా, రింకు సింగ్, దీపక్ హుడా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్‌ సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, కుల్‌దీప్‌ యాదవ్ ఉమ్రాన్‌ మాలిక్, ప్రసిధ్‌ కృష్ణ, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, దీపక్ చాహర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని