Shivam Dube: హార్దిక్‌కు దూబె ఎసరు! టీ20 ప్రపంచకప్‌కు శివమ్‌

గాయాలతో జట్టుకు హార్దిక్‌ పాండ్య టీమ్ఇండియాకు దూరమై వేళ మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె నిలకడగా రాణిస్తూ 2024 టీ20 ప్రపంచకప్‌ రేసులోకి దూసుకొచ్చాడు. 

Updated : 16 Jan 2024 10:38 IST

టీమ్‌ఇండియా వెతుకుతున్న ఆల్‌రౌండర్‌ దొరికాడా? గాయాలతో జట్టుకు దూరమైన హార్దిక్‌ (Hardik Pandya)ను రీప్లేస్‌ చేసే ఆల్‌రౌండర్‌ వచ్చాడా? ఈ ఏడాది పొట్టి కప్పులో భారత జట్టు ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించేది అతనేనా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. హార్దిక్‌ స్థానానికి ఎసరు పెట్టేలా.. జట్టుకు ఉత్సాహాన్ని అందించేలా మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ వచ్చాడు. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో అదరగొడుతున్నాడు. అతనే శివమ్‌ దూబె (Shivam Dube). జట్టులో పాతుకుపోయేలా అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతున్నాడు. 

ఆ మెరుపులతో..

శివమ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నాలుగేళ్లు గడిచిపోయాయి. కానీ హార్దిక్‌ రూపంలో ఉత్తమ ఆల్‌రౌండర్‌ జట్టులో ఉండటంతో శివమ్‌కు తగినన్ని అవకాశాలు రాలేవనే చెప్పాలి. ఆడిన మ్యాచ్‌ల్లోనూ దూబె ప్రదర్శన మెరుగ్గానే ఉంది. 2019లోనే భారత జట్టులోకి వచ్చిన అతను 20 టీ20ల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 275 పరుగులు చేశాడు. అతని సగటు 45.83 ఉండటం విశేషం. పేస్‌ బౌలింగ్‌తో 8 వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ ఆడిన ఏకైక వన్డేలో 9 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో శివమ్‌ ప్రదర్శన మెరుగ్గా ఉంది. అతను మూడు అర్ధశతకాలు కూడా చేశాడు. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. గాయంతో హార్దిక్‌ దూరం కావడంతో దొరికిన అవకాశాన్ని అతను రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు చేసి భారత్‌ సిరీస్‌ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్‌ కోల్పోకూడదనే పట్టుదలతో సాగుతున్న అతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచి మ్యాచ్‌ ముగించడం విశేషం. ముఖ్యంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో అతను కనిపిస్తుండటం మరింత  సానుకూలాంశం.

క్రీజులో నిటారుగా నిలబడి.. బంతిని కచ్చితంగా అంచనా వేసి, అలవోకగా భారీ షాట్లు ఆడేస్తున్నాడు. ఒత్తిడిని చిత్తుచేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై అతను ఆధిపత్యం చలాయిస్తున్నాడు. అఫ్గానిస్థాన్‌ పేరుకు చిన్నజట్టే కావొచ్చు, కానీ ఇందులో నాణ్యమైన బౌలర్లున్నారు. పోరాట పటిమకు మారుపేరుగా మారిన ఆ జట్టును ఎదుర్కోవడంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ దూబె మాత్రం తన మెరుపులతో జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు. ఇక పేస్‌ బౌలింగ్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో వికెట్‌ పడగొట్టాడు. విరాట్, యువరాజ్‌ తర్వాత ఒకటి కంటే రెండు మ్యాచ్‌ల్లో అర్ధశతకం చేయడంతో పాటు ఒక వికెట్‌ పడగొట్టిన మూడో భారత ఆటగాడిగా దూబె నిలిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయడం, వికెట్లు పడగొట్టడం, బ్యాటింగ్‌లో ధనాధన్‌ షాట్లతో చెలరేగడం.. జట్టు కోరుకుంటున్న ఆల్‌రౌండర్‌కు ఉండాల్సిన నైపుణ్యాలివే. ఇప్పుడు దూబెలో అవి కనిపిస్తున్నాయి.

ఐపీఎల్‌ కీలకం..

ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో అదరగొడుతున్నా.. టీ20 ప్రపంచకప్‌ జట్టులో దూబెకు చోటు ఖాయమని ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గాయం నుంచి కోలుకుని హార్దిక్‌ వస్తే అప్పుడు దూబెను దూరం పెట్టే అవకాశముంది. అలా జరగకుండా ఉండాలన్నా, ప్రపంచకప్‌కు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాలన్నా దూబెకు వచ్చే ఐపీఎల్‌ ఎంతో కీలకం. 2019 ఐపీఎల్‌కు వేలానికి ముందు బరోడాతో రంజీ మ్యాచ్‌లో ముంబయి తరపున అయిదు బంతులకు అయిదు సిక్సర్లు బాదడంతో దూబె వెలుగులోకి వచ్చాడు. దీంతో వేలంలో రూ.5 కోట్లకు అతణ్ని ఆర్సీబీ సొంతం చేసుకుంది. 2019, 2020 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన అతను ఆ తర్వాత రాజస్థాన్‌ జట్టులోకి వెళ్లాడు. 2022 మెగా వేలంలో రూ.4 కోట్లకు అతణ్ని సీఎస్కే దక్కించుకోవడంతో దూబె దశ తిరిగిందనే చెప్పాలి. నిరుడు ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 418 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పుడు రాబోయే సీజన్లోనూ బ్యాట్‌తో ఇలాగే రాణించి, బంతితోనూ సత్తాచాటితే దూబె కచ్చితంగా ప్రపంచకప్‌కు వెళ్లే జట్టుతో పాటు విమానం ఎక్కుతాడు. దూబె ఇదే జోరు కొనసాగిస్తే హార్దిక్‌కు ఎసరు తప్పదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా పోటీ మంచిదే కదా. ఇది అంతిమంగా జట్టుకే మేలు కలిగిస్తుంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని